టైగర్ పై ఎటాక్..కొత్త పల్లవి తెరపైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నివాసంపై కాల్పుల ఘటనపై నటుడు మనోజ్ బాజ్‌పేయ్ స్పందించారు. ఈ దాడిలో టైగర్ అసలు లక్ష్యం కాకపోవచ్చని, షూటర్లు మరో ప్రముఖుడిని టార్గెట్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మారుతున్న నేరాల తీరుతో సెలబ్రిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
By: Srikanth Kontham | 11 Nov 2026 11:53 AM ISTబాలీవుడ్ సెలబ్రిటీలపై వరుస గ్యాంగ్ స్టర్ల దాడులు ఎంత సంచలనమవుతున్నాయో తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల అనంతరం తాజాగా టైగర్ ష్రాప్ నివాసంపై జరిగిన కాల్పులతో సన్నివేశం మరింత వేడెక్కింది.
దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలంతా కట్టు దిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లిపోయారు. దేశంలో ఎంతో మంది సెలబ్రిటీలున్నా? ప్రత్యేకంగా బాలీవుడ్ తారలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది ఎప్పటికీ తీరని సందేహమే. తాజాగా ఈ ఘటనలను ఉద్దేశించి మనోజ్ బాజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నేటి సమాజంలో నేరాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా నేరుగా చలనచిత్ర పరిశ్రమను టార్గెట్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదని ఎవరో ఎక్కడో కూర్చుని వేరే వారిని లక్ష్యంగా చేసుకుని షూటర్లను పంపుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ తరహా ఘటనలు సెలబ్రిటీలలో తీవ్ర భయాం దోళనలను కలిగిస్తు న్నాయన్నారు. తాజా కాల్పుల ఘటనలో టైగర్ ష్రాఫ్ అసలు లక్ష్యం కాదని.. అనుకోకుండా ఆయన ఈ వివాదంలో చిక్కుకున్నారని మనోజ్ బాజ్‌పేయ్ అభిప్రాయపడ్డారు.
అసలైన టార్గెట్‌గా ఉన్న ప్రముఖ స్టార్లపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందని.. వారు తమ భద్రత కోసం అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కాలం మారుతున్న కొద్దీ నేరాల వేగం, నిర్వచనం కూడా పూర్తిగా మారిపోతున్నాయన్నారు. ఇలాంటి దుర్ఘటనలు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మనోజ్ బాజ్‌పేయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయానక వాతావరణంపై మహారాష్ట్ర ప్రభుత్వం .. పోలీసు యంత్రాంగం ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నాయని.. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు సినీ ప్రముఖులకు భద్రతను చేకూరుస్తాయని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ తరహా సవాళ్లు .. భద్రతా ముప్పుల నడుమ, పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఎలాంటి భయం లేకుండా జీవించే వాతావరణం మళ్లీ రావాలని ఆకాంక్షించారు. దర్యాప్తు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చి భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరికలా నిలుస్తుందని మనోజ్ బాజ్‌పేయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మనోజ్ వ్యాఖ్యలతో షూటర్ల అసలు టార్గెట్ టైగర్ ఫ్రాప్ కాదని..వారు మరొకర్ని టార్గెట్ చేయగా వారు అందుబాటులోకి లేకపోవడంతో టైగర్ పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. అలాగే వెనుకుండి నడిపిస్తోన్న ఆ బిగ్ బాస్ ఎవరు? అన్నది కూడా తేలాల్సిన అంశం. సాధారణంగా గ్యాంగ్ స్టర్లు ఇతర దేశాల నుంచి బాలీవుడ్ తారలను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం ఉండనే ఉంది.
