Begin typing your search above and press return to search.

'అవినీతి పండితుడు' అని టైటిల్ పెడితే ఫ్యామిలీని బెదిరించారు!

ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయీ కథానాయకుడిగా నటించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ చిత్రం `గజబ్ రాత్` ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Sivaji Kontham   |   24 Oct 2026 10:26 PM IST
అవినీతి పండితుడు అని టైటిల్ పెడితే ఫ్యామిలీని బెదిరించారు!
X

ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయీ కథానాయకుడిగా నటించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ చిత్రం `గజబ్ రాత్` ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో టైటిల్ పరంగా తీవ్ర వివాదాలను ఎదుర్కొంది. మొదట ఈ చిత్రానికి `ఘోష్‌ ఖోర్ పండిత్`(అవినీతి పండితుడు) అని పేరు ప్రకటించగా, ఆ పేరుపై సంబంధిత కుల‌ వర్గాల నుండి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమయ్యాయి. విమర్శలను పరిగణనలోకి తీసుకున్న చిత్ర నిర్మాతలు వెంటనే స్పందించి సినిమా టైటిల్‌ను `గజబ్ రాత్`గా మార్చారు. రితేష్ షా దర్శకత్వంలో నీరజ్ పాండే నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నుస్రత్ భరుచ్చా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అయితే ఈ టైటిల్ వివాదం కేవలం సినిమాకే పరిమితం కాకుండా తన వ్యక్తిగత జీవితం, కుటుంబం వైపు మళ్లడం పై మనోజ్ బాజ్‌పేయీ తీవ్ర దిగ్భ్రాంతి, అసహనం వ్యక్తం చేశారు. పేరు, ముఖం లేని అజ్ఞాత ఖాతాలు- బోట్లు సోషల్ మీడియా వేదికగా తన కుటుంబ సభ్యుల ఫోటోలను షేర్ చేస్తూ బెదిరింపులకు పాల్పడటం ఆయనను ఎంతగానో కలచివేసింది. ``ఒక నటుడిగా అనేక తిరస్కారాలు ఎదుర్కొని ఇక్కడిదాకా వచ్చాను.. కాబట్టి నాపై ఎంతటి విమర్శలైనా భరించగలను. కానీ సమాజంలో అవగాహన లేని కొందరు నా కుటుంబాన్ని మధ్యలోకి తెచ్చి ఫొటోలు పోస్ట్ చేస్తూ వేధించడం తీవ్రంగా అభ్యంతరం కలిగించింది`` అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రకమైన డిజిటల్ దాడులపై స్పందిస్తూ.. తాను సాధారణంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తినని.. కానీ తన కుటుంబ రక్షణ విషయానికి వస్తే ఎవరితోనైనా నేరుగా పోరాటానికి సిద్ధపడతానని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో ఈ బెదిరింపులన్నీ అజ్ఞాత ఖాతాల నుంచి రావడంతో ఎవరిని ప్రశ్నించాలో తెలియక నిస్సహాయత ఎదురైందని తెలిపారు. కథలోని ప్రధాన పాత్ర స్వభావాన్ని బట్టి దాదాపు ఐదు లేదా ఆరు పేర్లను పరిశీలించిన తర్వాతే మొదటి టైటిల్‌ను ఎంచుకున్నామని.. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తమకు లేదని వివరించారు. ఈ వివాదాల సమయంలో స్థానిక అధికారులు భద్రతా కారణాల రీత్యా బయటకు రావద్దని హెచ్చరించినా.. తాను భయపడకుండా ధైర్యంగా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లానని బాజ్‌పేయీ స్పష్టం చేశారు.

ఇక సినిమా కథాంశం విషయానికి వస్తే....`గజబ్ రాత్` కథంతా ఢిల్లీ నగరంలో ఒకే ఒక్క రాత్రిలో జరిగే తీవ్ర ఉత్కంఠభరితమైన నేర సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇందులో మనోజ్ బాజ్‌పేయీ `అజయ్ నిర్విత్` అనే అవినీతిపరుడైన, స్వార్థపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలో ఉన్న ఒక హోటల్‌పై దాడి చేసిన తర్వాత అతడి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అదే రాత్రి తీవ్రగాయాలతో ఉన్న ఒక గుర్తుతెలియని యువతిని వేగంగా వెళ్తున్న కారులోంచి రోడ్డుపైకి పడేయడం.. ఆ కేసు విచారణ బాధ్యతలను అజయ్‌కి అప్పగించడంతో కథలో అసలైన సస్పెన్స్ మొదలవుతుంది.

ఈ కేసు కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదం కాదని.. దీని వెనుక అంతర్జాతీయ రహస్యాలు .. ప్రభుత్వ వ్యవస్థలోని ఉన్నతాధికారుల పెద్ద కుట్ర దాగి ఉందని కథనం ముందుకు సాగుతున్న కొద్దీ వెల్లడవుతుంది. విచారణలో భాగంగా సీబీఐ, ఎన్‌ఐఏ అధికారులు.. స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) రంగంలోకి దిగుతాయి. కేవలం డబ్బు కోసమే పనిచేసే అజయ్ రూ. 5 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చి ఆ యువతిని అంతమొందించాలని చూసే దుష్ఠ‌ శక్తుల నుండి ఆమెను ఎలా రక్షించాడు? ఈ క్రమంలో అతనిలోని మనస్సాక్షి ఎలా మేల్కొంది? అనే ఆసక్తికరమైన మలుపులతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా నేరుగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.