సరైన కామెడీ సినిమాలే లేవన్న జాతీయ ఉత్తమ నటుడు!
ఈరోజుల్లో సరైన కామెడీ సినిమాలు రావడం లేదని, బలవంతపు కామెడీల్ని తెరపై చూపిస్తున్నారని ఆవేదన చెందారు జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్‌పాయి.
By: Sivaji Kontham | 2 Sept 2025 10:05 PM ISTఈరోజుల్లో సరైన కామెడీ సినిమాలు రావడం లేదని, బలవంతపు కామెడీల్ని తెరపై చూపిస్తున్నారని ఆవేదన చెందారు జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్‌పాయి. తాను ఇలాంటి స్లాప్ స్టిక్ కామెడీ సినిమాలు చేయలేనని ఆయన అన్నారు. అంగూర్, పడోసన్ , జానే భీ దో యారో వంటి చిత్రాలలో కామెడీ సహజంగా, సులభంగా అనిపిస్తుందని, అలాంటి వాటిని ఈరోజుల్లో కోల్పోయామని మనోజ్ భాజ్ పేయి విచారం వ్యక్తం చేశారు.
దురదృష్టవశాత్తూ ఇటీవల మంచి కామెడీ కథలు రాయడం లేదు. మరిన్ని మంచి కామెడీ కథలు రాస్తే నేను నటిస్తాను! అని కూడా మనోజ్ భాజ్ పాయి అన్నారు. తాను కృత్రిమ ముఖాన్ని తయారు చేసుకోలేనని కూడా భాజ్ పేయి వ్యాఖ్యానించారు.
భారతదేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన మనోజ్ భాజ్‌పేయి తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించారు. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ లో అతడు సీరియస్ టోన్ ఉన్న పాత్రలో కూడా అద్భుతమైన సహజసిద్ధమైన కామెడీని పండించారు. ఆర్జీవీ `సత్య` లాంటి చిత్రంలో సీరియస్ టోన్ ఉన్న పాత్రతోను మెప్పించారు. ఇప్పుడు అతడు నటించిన కామెడీ థ్రిల్లర్ చిత్రం `ఇన్‌స్పెక్టర్ జెండే` విడుదలకు సిద్ధమవుతోంది. ఇది పూర్తి స్థాయి కామెడీతో అలరించే చిత్రం.. సహజంగా కామెడీ పుడుతుందని ఇటీవల విడుదలైన టీజర్ వెల్లడించింది.
సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను పట్టుకున్న అధికారిగా పాపులరైన ప్రముఖ ముంబై పోలీసు మధుకర్ జెండే నిజ జీవిత పాత్రలో మనోజ్ బాజ్‌పేయి నటిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ జెండే లైఫ్ సింపుల్ గా ఉండదు.. ఉద్రిక్తతను కూడా తెలివిగా హ్యాండిల్ చేసే అధికారి ఆయన. మోసంతో తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్ ని పట్టుకునేందుకు ప్రయత్నించే అధికారిగా మనోజ్ భాజ్ పేయి నటించారు. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహించగా, కథను కూడా ఆయనే రాసారు. బాజ్‌పేయి - ఇన్‌స్పెక్టర్ జెండే గా, జిమ్ సర్బ్ కార్ల్ భోజ్‌రాజ్ గా నటించారు. ఇన్‌స్పెక్టర్ జెండేలో సచిన్ ఖేడేకర్, గిరిజా ఓక్, భాల్‌చంద్ర కదమ్, వైభవ్ మంగళే, హరీష్ దుధడే, ఓంకార్ రౌత్, భరత్ సవాలే తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.
