బాల్ ఠాక్రేకే షాక్ ఇచ్చిన స్టార్ నటుడు!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా `సత్య` అలాంటి చిత్రమే. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది.
By: Srikanth Kontham | 20 Jun 2026 4:00 PM ISTకొన్ని సినిమాలు.. పాత్రలు విజయంతో కొత్త నిర్వచనాలు ఇస్తుంటాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా `సత్య` అలాంటి చిత్రమే. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. సినిమాలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా, ముంబై నగరంలోని వాస్తవిక క్రైమ్ ప్రపంచానికి అద్దం పట్టేలా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో నటీనటుల ప్రదర్శన, పాత్రల రూపకల్పన ప్రేక్షకులపై సుదీర్ఘ కాలం పాటు చెరగని ముద్ర వేసాయి. ఈ చిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్ర `భీకూ మాత్రే`. ఈ ముంబై గ్యాంగ్‌స్టర్ పాత్రను నటుడు మనోజ్ బాజ్‌పాయ్ పోషించారు.
మనోజ్ అద్భుతమైన నటనా చాతుర్యం, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్‌తో ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఒక మరాఠీ స్థానిక గ్యాంగ్‌స్టర్ ఎలా ప్రవర్తిస్తాడు? అతని ఆవేశం? నవ్వు, మాట్లాడే తీరు ఎలా? ఉంటాయనే విషయాలను మనోజ్ బాజ్ పాయ్ ఎంతో సూక్ష్మంగా గమనించి వెండి తెరపై ఆవిష్కరించారు. ఈ పాత్ర సృష్టించిన ఇంపాక్ట్ ఎంతలా పనిచేసిందంటే? సినిమా చూసే ప్రతి ఒక్కరూ ఆయన్ను నిజమైన మరాఠీ ముఠా నాయకుడిగానే భావించారంటే అతిశయోక్తి కాదు. దీనికి సంబంధించి ఓ బలమైన ఉదాహరణ కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ముంబై స్థానిక సంస్కృతి .. అక్కడి ప్రజల నాడిపై పూర్తి పట్టున్న ప్రముఖ నాయకుడు బాల్ థాకరే సైతం ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయినట్లు ఓపెన్ అయ్యారు. `భీకూ మాత్రే పాత్రలో లీనమైన మనోజ్ బాజ్‌పాయ్ నటన చూసి ఆయన ఖచ్చితంగా మరాఠీ నటుడే అనుకున్నా. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు మనోజ్ బాజ్‌పాయ్ మరాఠీ వ్యక్తి కాదని, ఆయన బీహార్ ప్రాంతానికి చెందినవారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. భిన్నమైన సాంస్కృతిక, ప్రాంతీయ నేపథ్యం నుండి వచ్చిన నటుడు ముంబైకి చెందిన పక్కా లోకల్ మరాఠీ పాత్రను అంత పక్కాగా పండించడం అనేది సాధారణ విషయం కాదు.
కేవలం భాష .. యాస నేర్చుకోవడం మాత్రమే కాదు. ఆ ప్రాంతపు జీవన విధానాన్ని, అంతర్గత భావోద్వేగాలను సొంతం చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మనోజ్ బాజ్‌పాయ్ చేసిన హోంవర్క్, దర్శకుడి విజన్‌ను అర్థం చేసుకుని పాత్ర పట్ల ఆయన చూపిన అంకితభావం చలనచిత్ర రంగంలో నటనకు గొప్ప బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. కాలక్రమేణా ఇతర సినిమా పరిశ్రమల్లో పాత్రల ఎంపిక విధానంలో కూడా సానుకూల మార్పు వచ్చింది. అంతకుముందు ఒక నిర్దిష్ట ప్రాంతీయ నేపథ్యం ఉన్న పాత్రలను కేవలం ఆయా ప్రాంతాల నటులకే పరిమితం చేసేవారు.
కానీ `సత్య` సినిమా ఆ మూస పద్ధతులను పూర్తిగా బద్దలు కొట్టింది. ప్రతిభ, కఠోర శ్రమ, పాత్రను శోధించే గుణం ఉంటే ఒక నటుడు ఏ ప్రాంతపు సరిహద్దులనైనా దాటి.. ఏ సంస్కృతినైనా తెరపై అద్భుతంగా పండించగలడని `సత్య` నిరూపించింది. భీకూ మాత్రే వంటి పాత్రలు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఒక నటుడు సొంత వ్యక్తిగత గుర్తింపును, ప్రాంతీయతను పూర్తిగా పక్కన పెట్టి కథలోని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడే ఇలాంటి అద్భుతాలకు అవకాశం ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ మేకింగ్ శైలి, మనోజ్ బాజ్‌పాయ్ నటనా వైదుష్యం కలిసి భారతీయ చిత్రసీమకు ఒక మైలురాయి లాంటి క్యారెక్టరైజేషన్‌ను అందించాయి.
