నెరిసిన జుట్టు చూసి బాధపడిపోతున్న నటి ఫ్యాన్స్
సీనియర్ నటి మనీషా కొయిరాలా తన తాజా లుక్‌తో సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు తెరలేపారు.
By: Sivaji Kontham | 31 March 2026 4:52 PM ISTసీనియర్ నటి మనీషా కొయిరాలా తన తాజా లుక్‌తో సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు తెరలేపారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ.. వయసు పెరగడాన్ని దాచకుండా తన సహజమైన నెరిసిన జుట్టును ధైర్యంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎవరికో నచ్చాలని కాకుండా.. తనకు నచ్చినట్టుగా జీవించడంలోనే నిజమైన ఆనందం ఉందని, ఈ రూపం తనకు ఒక గొప్ప స్వేచ్ఛ ను ఇస్తోందని గర్వంగా చెబుతున్నారు.
55 ఏళ్ల వయసులో ఉన్న మనీషా.. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని.. మనలోని ప్రశాంతతే అసలైన అందమని బలంగా నమ్ముతున్నారు. జుట్టుకు రంగులు వేసి నిరంతరం యవ్వనంగా కనిపించాలనే ఒత్తిడి నుంచి బయటపడటం ఎంతో హాయిగా ఉందని మనీషా పేర్కొన్నారు. తన కెరీర్‌లో దాదాపు 90 చిత్రాల్లో నటించిన ఈ వెటరన్ బ్యూటీ.. ఇప్పుడు కృత్రిమ అందం కంటే ఆత్మవిశ్వాసంతో కూడిన అసలైన రూపానికే పెద్దపీట వేస్తున్నారు.
అయితే తమ ఆరాధ్య దేవతను ఇలాంటి లుక్‌లో చూడటం కొందరు వీరాభిమానులకు కష్టంగా అనిపిస్తోంది. 90లలో `క్రిమినల్` సినిమాలో తన అందంతో మతులు చెడగొట్టిన బ్యూటీయేనా ఈమె? `ఆవిడా మా ఆవిడే`లో మెరిసిన సుందరి ఈవిడేనా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే `ఒకే ఒక్కడు' సినిమాలో విలేజ్ కుట్టీగా అలరించిన మనీషానేనా ఇలా మారిపోయింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు.. మనీషా కొయిరాలా కొత్త లుక్ చూసి నెటిజన్లు ఆసక్తికరమైన పోలికలు కూడా తీసుకొస్తున్నారు. ఆమె నెరిసిన రింగుల జుట్టుతో చూడగానే ఇందిరాగాంధీని తలపిస్తోందని కొందరు కామెంట్ చేస్తుంటే..ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ మరికొందరు బ్యూటీ విత్ గ్రేస్ అని కొనియాడుతున్నారు. కేన్సర్ వంటి మహమ్మారిని జయించిన తర్వాత జీవితం పై మనీషా దృక్పథం పూర్తిగా మారిందని.. ఆ పరిణితి ఆమె రూపంలో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మనీషా కొయిరాలా తన సహజత్వంతో ఫ్యాషన్ ప్రపంచం నిర్ణయించే బ్యూటీ స్టాండర్డ్స్‌ను సవాలు చేశారు. ఇతర నటీమణులకు కూడా వయసును హుందాగా స్వీకరించడంలో ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. ఎవరి కోసమో కాకుండా.. తన మనసుకి నచ్చినట్లు ఉండటమే అసలైన విజయం! అని నిరూపిస్తూ.. తన 55వ ఏట సరికొత్త ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతున్నారు.
