ఆషిఖి రేంజు మ్యూజికల్ లవ్ స్టోరీలో దురంధర్ బ్యూటీ
‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్‌కు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో సినిమా అవకాశం వచ్చినట్లు బాలీవుడ్ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ షూటింగ్ 2027 జనవరిలో పంజాబ్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో అంబ్రీష్ వర్మ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది పాటలతో రూపొందనున్న ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
By: Sivaji Kontham | 25 Nov 2026 3:39 PM IST`ధురంధర్` ఫేమ్ సారా అర్జున్ తొలిసారి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. కెరీర్ ఆరంభమే ఒక భారీ స్పై థ్రిల్లర్ కథాంశంలో నటించి మెప్పించిన సారా, ఈసారి తన వయసుకు తగ్గట్టు ఒక అద్భుతమైన మ్యూజికల్ లవ్ స్టోరీలో నటించబోతోంది. ఇది ఆషిఖి రేంజులో ఉంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
టైగర్ 3 (2023) చిత్రానికి దర్శకత్వం వహించిన మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. 2027 జనవరిలో పంజాబ్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో `సప్నే వర్సెస్ ఎవ్రీవన్` ఫేమ్ నటుడు అంబ్రీష్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కథాంశంలో సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఉండేలా మొత్తం ఎనిమిది పాటలతో ఈ మ్యూజికల్ రొమాన్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇతర పాత్రధారుల వివరాలతో పాటు వైఆర్ఎఫ్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో బ్యాండ్ బాజా బారాత్ (2010), శుద్ధ్ దేసీ రొమాన్స్ వంటి రొమాంటిక్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మనీష్ శర్మ.. చాలా కాలం తర్వాత మళ్లీ రొమాన్స్ జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో `టైగర్ 3` వంటి యాక్షన్ సినిమా చేసిన తర్వాత ఇప్పుడు అంతా యూత్‌తో మ్యూజికల్ ప్రేమకథను ఎంచుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
సారా అర్జున్‌కు ఇది వైఆర్ఎఫ్ సంస్థలో తొలి సినిమా కావడంతో, తన కెరీర్‌లో ఇది మరో కీలక మలుపుగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు.. మనీష్‌శర్మ ఆషిఖి ఫ్రాంఛైజీ సినిమాలు, సయ్యారాలకు భిన్నంగా ఒక కొత్తదనం నిందిన స్క్రిప్టుతో మెప్పించాల్సి ఉంటుంది. దర్శకుడిగా ఇది అతడికి సవాల్ లాంటిది.
సారా అర్జున్ బాలనటిగా తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. తమిళ దర్శకుడు విజయ్ తెరకెక్కించిన నాన్న చిత్రంతో తెలుగులోను సుపరిచితం. అప్పట్లో క్యూట్ లుక్స్ తో బాలనటిగా ఆకట్టుకుని, ఆ తర్వాత యుక్తవయసులో రణ్ వీర్ సింగ్ లాంటి సీనియర్ ఏజ్డ్ హీరో సరసన కథానాయికగా నటించడంతో విమర్శలు ఎదురయ్యాయి. కానీ దురంధర్ సక్సెస్ ముందు విమర్శలేవీ నిలబడలేదు. చివరికి సారా అద్భుతంగా నటించిందని ప్రశంసలు దక్కాయి. అందుకే ఇప్పుడు మ్యూజికల్ లవ్ స్టోరీలో తన పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలనే క్యూరియాసిటీ నెలకొంది.
