Begin typing your search above and press return to search.

నట రాక్షసులతో మణిరత్నం ప్రయోగం

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మణిరత్నం అంటే కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, అదొక బ్రాండ్.

By:  M Prashanth   |   8 Dec 2025 3:00 AM IST
నట రాక్షసులతో మణిరత్నం ప్రయోగం
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మణిరత్నం అంటే కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. ప్రేమ కథలైనా, పొలిటికల్ డ్రామాలైనా ఆయన టేకింగ్ స్టైల్ చాలా ప్రత్యేకం. అయితే గత కొంతకాలంగా మణిరత్నం నుంచి ఆశించిన స్థాయి మ్యాజిక్ రావడం లేదనేది వాస్తవం. 'పొన్నియిన్ సెల్వన్' వంటి భారీ చిత్రాలు చేసినా, ఆయన మార్క్ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కమల్ హాసన్ తో చేసిన థగ్ లైఫ్ కూడా బెడిసికొట్టింది. సరిగ్గా ఈ సమయంలో కోలీవుడ్ లో వినిపిస్తున్న ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మణిరత్నం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారట. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న తారాగణం చాలా ఆసక్తికరంగా ఉంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవిలను ప్రధాన పాత్రల్లో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తే ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే వీరిద్దరూ మామూలు నటులు కాదు, పాత్ర దొరికితే నమిలి పారేసే రకం.

మణిరత్నం సినిమాల్లో హీరో పాత్రలు చాలా సాఫ్ట్ గా ఉంటూనే, బలమైన ఎమోషన్స్ పండిస్తాయి. కానీ విజయ్ సేతుపతి బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ పూర్తిగా భిన్నం. ఆయన్ని ఒక టిపికల్ మణిరత్నం హీరోలా ఊహించుకోవడం కొంచెం కష్టమే. కానీ ఒకవేళ మణిరత్నం కనుక విజయ్ సేతుపతిలోని ఆ రా నటనను తన స్టైల్ లో వాడగలిగితే, అది కచ్చితంగా స్క్రీన్ మీద ఒక అద్భుతం అవుతుంది.

అలాగే సాయి పల్లవి విషయం తీసుకుంటే.. ఆమెకు గ్లామర్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే ఎక్కువ ఇష్టం. మణిరత్నం హీరోయిన్లలో ఉండే ఆ డిగ్నిటీ, ఎమోషన్ సాయి పల్లవికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. గతంలో వీరిద్దరూ వేర్వేరు సినిమాల్లో తమ సత్తా చాటారు. ఇప్పుడు మణిరత్నం లాంటి లెజెండ్ డైరెక్షన్ లో ఈ ఇద్దరు 'నట రాక్షసులు' కలిస్తే, ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ఊహించడానికే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది.

అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ కూడా ఉంది. మణిరత్నం కథల్లో ఈ మధ్య పాత పట్టు కనిపించడం లేదనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది సందేహమే. సేతుపతి కథలో విషయం ఉంటేనే చేస్తారు తప్ప, దర్శకుడి ఇమేజ్ ను చూసి సినిమాలు చేసే రకం కాదు. ఇప్పటికే 'నవాబ్'లో మణిరత్నంతో పని చేసిన అనుభవం సేతుపతికి ఉంది. కాబట్టి క్యారెక్టర్ నచ్చితే కచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. మరి ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.