మణిశర్మ ఏం చేస్తున్నారు?
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే మణిశర్మ పేరు తప్పకుండా వినిపించేది. చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వరకు ఎన్నో పెద్ద ఆల్బమ్స్ ఆయన నుంచే వచ్చాయి.
By: M Prashanth | 10 Sept 2026 11:12 AM ISTఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే మణిశర్మ పేరు తప్పకుండా వినిపించేది. చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వరకు ఎన్నో పెద్ద ఆల్బమ్స్ ఆయన నుంచే వచ్చాయి. మెలోడీ సాంగ్స్ అంటే ఇప్పటికి టాప్ లిస్టులో మణిశర్మ పేరే ఉంటుంది. ఇప్పుడు మాత్రం కొత్త సినిమాల లిస్టు చూస్తే మణిశర్మ పేరు చాలా అరుదుగా కనిపిస్తోంది. సినిమాలు పూర్తిగా ఆపేయలేదు. కానీ బిగ్ స్టార్ సినిమా, పెద్ద బ్యానర్ ప్రాజెక్ట్ మాత్రం ఆయన దగ్గరకు రావడం తగ్గిపోయింది.
2024లో డబుల్ ఇస్మార్ట్‌కు మణిశర్మ సంగీతం అందించారు. అంతకుముందు శాకుంతలం, బెదురులంక 2012, ఆచార్య, యశోద లాంటి సినిమాలు చేశారు. 2025లో కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాకు పాటలు ఇచ్చారు. ఈ ఏడాది చెన్నై లవ్ స్టోరీ కూడా ఆయన చేతిలోకి వచ్చింది. అంటే పని లేకుండా పూర్తిగా సైడ్ అయ్యారనే పరిస్థితి కాదు. ఒకప్పుడు వరుసగా స్టార్ సినిమాలు చేసిన మణిశర్మ ఇప్పుడు ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నారు.
చెన్నై లవ్ స్టోరీ ఆడియో వేడుకలో మణిశర్మ చెప్పిన మాటలు కూడా అప్పట్లో బాగా వినిపించాయి. పని చాలా తగ్గిపోయిన సమయంలో ఇంట్లోనే ఉన్నానని, దర్శకుడు సాయి రాజేష్ వచ్చి ఈ సినిమా చేయమన్నాడని చెప్పారు. చాలా రోజుల తర్వాత హార్మోనియం దగ్గర కూర్చుని ట్యూన్ చేసినప్పుడు తనలో మ్యూజిక్ ఇంకా అలాగే ఉందని అనిపించిందని మణిశర్మ చెప్పుకొచ్చారు.
మణిశర్మ మ్యూజిక్‌కు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఖుషి, ఒక్కడు, పోకిరి, ఇంద్ర, అతడు లాంటి సినిమాల పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ గుర్తింపు కొత్త పెద్ద సినిమాల అవకాశాలుగా మారడం లేదు. కొన్నేళ్ల కిందటే పెద్ద హీరోలు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లకు రెండు సినిమాలు ఇస్తే తనకు ఒక్క సినిమా ఇచ్చినా బాగుంటుందని మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో వైరల్ అయింది.
ఇక ఆయన కొడుకు మహతి స్వరసాగర్ పరిస్థితి కూడా కొంచెం ఇలానే ఉంది. చలోతో మంచి పేరు వచ్చింది. భీష్మ ఆల్బమ్ కూడా బాగా వెళ్లింది. మాచర్ల నియోజకవర్గంలో రా రా రెడ్డి పాట పెద్ద హిట్ అయింది. తర్వాత భోళా శంకర్, ప్రతినిధి 2, రక్షణ లాంటి సినిమాలు చేశాడు. కానీ ఒక సినిమా తర్వాత మరో పెద్ద సినిమా వరుసగా పడే స్థాయి బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు.
మణిశర్మ మాత్రం ఇప్పటికీ కంపోజ్ చేస్తున్నారు. గజ అనే ఒక చిన్న సినిమాకు వర్క్ చేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీతో ఈ ఏడాది మరోసారి తన మెలోడీ వినిపించారు. మరోవైపు మహతి కూడా తన ప్రాజెక్టులతో కొనసాగుతున్నాడు. ఒకప్పుడు తండ్రి సినిమాలకు కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పని చేసిన కొడుకు ఇప్పుడు స్వతంత్రంగా పదేళ్లకు పైగా ప్రయాణం చేస్తున్నాడు. ఇద్దరికీ ఇప్పుడు కావాల్సింది మాత్రం మళ్లీ అందరినీ ఎట్రాక్ట్ చేసే ఒక్క పెద్ద సినిమా.
