Begin typing your search above and press return to search.

మంగ్లీ సాంగ్‌ తో 'ఇడియట్' హీరోయిన్‌ కు ఏంటి సంబంధం?

అయితే ఆ వివాదం మధ్యలో ఇడియట్ హీరోయిన్‌ రక్షిత పేరు ఎందుకు వినిపిస్తోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  M Prashanth   |   19 March 2026 11:49 PM IST
మంగ్లీ సాంగ్‌ తో ఇడియట్ హీరోయిన్‌ కు ఏంటి సంబంధం?
X

సింగర్ మంగ్లీ పాడిన సర్కే చునార్‌ తేరి సర్కే పాట చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సాంగ్ పై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అన్ని ప్లాట్‌ ఫామ్‌ ల నుంచి సాంగ్‌ ను తొలగించినట్లు ఇటీవల ప్రకటించారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు తెలుపుతూ, లిరిక్స్‌ లో మార్పులు చేసి త్వరలో అప్డేట్‌ వెర్షన్‌ను విడుదల చేస్తామని తెలిపారు.

అయితే ఆ వివాదం మధ్యలో ఇడియట్ హీరోయిన్‌ రక్షిత పేరు ఎందుకు వినిపిస్తోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివాదాస్పద సాంగ్ కన్నడ చిత్రం కేడీ: ది డెవిలన్ లోనిది. ఆ చిత్ర దర్శకుడు ప్రేమ్. ఆయన భార్యే రక్షిత. అందుకే ఈ పాటపై వచ్చిన వివాదం నేపథ్యంలో రక్షిత పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌, సాంగ్ విడుదలల సమయంలో సహజంగానే టీమ్ సభ్యులపై ఫోకస్ పడుతుంది.

దీంతో దర్శకుడి కుటుంబ సభ్యురాలిగా, నిర్మాతగా కూడా యాక్టివ్‌ గా ఉన్న రక్షితపై దృష్టి మరింతగా పడింది. నిజానికి రక్షిత అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చేది ఇడియట్ సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో రవితేజ సరసన నటించిన ఆమె సుచిత్ర పాత్రతో యూత్‌ ను ఆకట్టుకున్నారు. ఇదే ఆమెకు తెలుగులో బ్రేక్ ఇచ్చిన సినిమా.

ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆ మూవీకి మూలం కన్నడ చిత్రం అప్పు. ఆ సినిమాలో కూడా రక్షితనే హీరోయిన్‌ గా నటించారు. సినీ కుటుంబంలో జన్మించిన రక్షిత అసలు పేరు శ్వేత. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బీసీ గౌరీశంకర్‌, నటి మమతా రావుల కుమార్తె. నటనపై ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, మొదటి సినిమాతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నారు.

టాలీవుడ్‌ లో శివమణి, ఆంధ్రావాలా, నిజం, అందరివాడు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కెరీర్ ప్రారంభమైన కొద్ది కాలానికే, 2007లో దర్శకుడు ప్రేమ్‌ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కానీ పూర్తిగా ఇండస్ట్రీని వదల్లేదు. నిర్మాతగా మారి పలు కన్నడ చిత్రాలను నిర్మించారు. జోగయ్య, ఏక్ లవ్ యా వంటి చిత్రాలతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో కూడా భాగమయ్యారు.

ఇక ప్రస్తుత వివాదం విషయానికి వస్తే, కేడీ: ది డెవిల్ సినిమాలోని పాటపై వచ్చిన విమర్శలు టీమ్ మొత్తాన్ని ప్రభావితం చేశాయి. దర్శకుడు ప్రేమ్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యురాలిగా రక్షిత కూడా ప్రస్తావనకు రావడం సహజం. ముఖ్యంగా గతంలో స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు పొందిన ఆమె పేరు మళ్లీ మీడియాలో వినిపించడానికి పాటనే ప్రధాన కారణం. ఏదేమైనా మంగ్లీ పాడిన పాట వివాదం నేరుగా రక్షితతో సంబంధం లేకపోయినా.. ఆ సినిమా దర్శకుడి భార్యగా ఆమె పేరు కూడా ఈ అంశంలో హాట్ టాపిక్‌ గా మారింది.