Begin typing your search above and press return to search.

మరో వివాదంలో మంగ్లీ.. అసలేం జరిగిందంటే?

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్ తదితరులు కలిసి న్యాయవాదిని సంప్రదించారు.

By:  M Prashanth   |   11 April 2026 1:19 PM IST
మరో వివాదంలో మంగ్లీ.. అసలేం జరిగిందంటే?
X

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై హైదరాబాద్‌ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించి మోసం చేశారన్న ఆరోపణలతో పాటు, న్యాయవాదిని బెదిరించారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సికింద్రాబాద్‌ కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, మరో ముగ్గురిపై కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం, మైక్రో

ఫైనాన్స్, వ్యాపార పెట్టుబడుల పేరిట అధిక లాభాలు ఇస్తామని చెప్పి సుమారు రూ.10 కోట్ల వరకు సేకరించి మోసం చేసినట్లు ఆరోపించారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్ తదితరులు కలిసి న్యాయవాదిని సంప్రదించారు. గోకులానందన ఇన్‌ ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దిగుమతి-ఎగుమతి, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ రంగాల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని వారు పేర్కొన్నారు.

మొత్తం 100 నుంచి 150 మంది వరకు ఆ స్కీంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అయితే, కాలం గడుస్తున్నా ఎటువంటి లాభాలు ఇవ్వకపోవడమే కాకుండా, పెట్టుబడిగా ఇచ్చిన అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగ్లీని సంప్రదించగా, ఆమె అవమానకరంగా మాట్లాడారని, తన వృత్తిని కించపరిచారని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, కేసును వెనక్కి తీసుకోవాలని డబ్బులు ఆఫర్ చేశారని, అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఫోన్ ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తూ ప్రమాదానికి గురిచేస్తామని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో విరాటపర్వం చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వినిపించడం గమనార్హం.

ఫిర్యాదును పరిశీలించిన పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్లు ప్రధానంగా బెదిరింపులు, దాడి వంటి అంశాలకు సంబంధించినవి కావడం గమనార్హం. కేసులో ఉన్న ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. డబ్బులు సేకరణ విధానం, పెట్టుబడుల వినియోగం, సంబంధిత వ్యక్తుల పాత్రలపై విచారణ కొనసాగుతోంది.

అవసరమైతే మరిన్ని సెక్షన్లు యాడ్ చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ కేసు నేపథ్యంలో పెట్టుబడుల పేరిట జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక లాభాల ఆశతో తెలియని సంస్థల్లో డబ్బులు పెట్టేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరమని చెబుతున్నారు. మొత్తానికి, మంగ్లీపై నమోదైన కేసులో ఉన్న ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.