మంచు బ్రదర్స్ కలిసిపోయినట్లేనా? విష్ణు పోస్ట్ చూశారా?
టాలీవుడ్ ప్రముఖ మంచు కుటుంబంలో కొన్ని నెలల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
By: M Prashanth | 12 Sept 2025 3:12 PM ISTటాలీవుడ్ ప్రముఖ మంచు కుటుంబంలో కొన్ని నెలల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే సంచలనం సృష్టించాయి.. పెద్ద చర్చనీయాంశంగా మారాయి. వరుస వివాదాలు.. వ్యాఖ్యలు.. పోస్టులు.. అనుచరులతో రచ్చ చేసిన ఘటనలు.. ఇలా ఒకటా రెండా బోలెడు జరిగాయి.
చివరకు కేసుల వరకు వెళ్లిన ఆ వ్యవహారం.. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సైలెంట్ అయింది. ఇప్పుడు పూర్తిగా సద్దుమణిగిందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజంలా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. మంచు బ్రదర్స్ పెట్టిన పోస్టులు కూడా ప్రస్తావిస్తున్నారు.
అయితే మంచు కుటుంబంలో వివాదం నడుస్తున్న సమయంలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు నటించిన కన్నప్ప మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సమయంలో మనోజ్ ఒక అడుగు ముందుకేసి సినిమాను థియేటర్ కు స్వయంగా వెళ్లి చూశారు. అంతే కాకుండా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
విష్ణు పేరును ప్రస్తావించకపోయినా.. క్లైమాక్స్ లో చాలా బాగా నటించారని కొనియాడారు. ఆ తర్వాత విష్ణు తనయుడు అవ్రామ్ కు సంతోషం ఫిల్మ్ అవార్డ్ లభించింది. తనకు పురస్కారం వచ్చినందుకు అవ్రామ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు మనోజ్.. కంగ్రాట్స్ అవ్రామ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని పోస్ట్ పెట్టారు.
అంతే కాదు.. మంచు విష్ణు అన్న, నాన్న మోహన్‌బాబుగారితో కలిసి అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకమని తెలిపారు. ఇప్పుడు మనోజ్ నటించిన మిరాయ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాలో విలన్ గా కనిపించి.. తన యాక్టింగ్ తో విమర్శకుల కూడా ప్రశంసలు అందుకున్నారు.
ఇప్పుడు విష్ణు.. మిరాయ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దేవుని ఆశీస్సులు ఉండాలని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా... నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. అన్నదమ్ముల మధ్య ప్రేమ శాశ్వతమని, గొడవలు కావని చెబుతున్నారు. ఎప్పటికీ కలిసి ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.
