10 కోట్ల సినిమా ఛాన్స్.. మంచు విష్ణు క్రేజీ ఆఫర్!
సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆ కలని నిజం చేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో, ఎవరి తలుపు తట్టాలో తెలియక చాలామంది ప్రతిభావంతులు వెనకబడిపోతుంటారు.
By: M Prashanth | 2 Jan 2026 5:54 PM ISTసినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆ కలని నిజం చేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో, ఎవరి తలుపు తట్టాలో తెలియక చాలామంది ప్రతిభావంతులు వెనకబడిపోతుంటారు. సరిగ్గా అలాంటి వారి కోసమే హీరో మంచు విష్ణు ఒక అద్భుతమైన వేదికను సిద్ధం చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ 'అవా ఎంటర్టైన్మెంట్' ద్వారా కొత్త టాలెంట్ ను వెలికితీసేందుకు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. "10 మినిట్స్ షార్ట్ ఫిలిం టు 10 క్రోర్ ఫీచర్ ఫిలిం" అనే లైన్ తో దీన్ని లాంచ్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర కేవలం ఒక పది నిమిషాల నిడివి ఉన్న అద్భుతమైన లఘు చిత్రం ఐడియా ఉంటే చాలు, అది మిమ్మల్ని ఏకంగా పది కోట్ల బడ్జెట్ సినిమా డైరెక్టర్ ని చేయగలదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కొత్త వాళ్లకు ఇది నిజంగా సువర్ణావకాశం.
నిజానికి సినిమా రేంజ్ అనేది దాని బడ్జెట్ లోనో, భారీ సెట్టింగుల్లోనో ఉండదు. అది పుట్టే ఒక చిన్న ఆలోచనలో, ఆ కథలో ఉండే ఎమోషన్ లో ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ ని మంచు విష్ణు నమ్ముతున్నారు. మన మట్టి కథలు, కొత్త విజన్, క్రియేటివిటీ ఉన్న న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ని ఒక్కటి చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. కేవలం టెక్నికల్ గ్రాండ్ నెస్ కాకుండా, స్టోరీలో దమ్మున్న వాళ్లే వీరికి కావాలి.
ఇండస్ట్రీకి రావాలనుకునే వారికి సరైన మార్గం తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఒక నమ్మకమైన, పారదర్శకమైన దారిని చూపించడానికే విష్ణు ఈ స్టెప్ తీసుకున్నారు. ఇది ఏదో సాధారణ పోటీలా కాకుండా, పరిశ్రమపై అవగాహన కల్పిస్తూ, నిజమైన టాలెంట్ కు పట్టం కట్టేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి కూడా ఇదొక గోల్డెన్ ఛాన్స్ లాంటిది.
మరి ఈ కాంటెస్ట్ లో ఎలా పాల్గొనాలి? నియమ నిబంధనలు ఏంటి? అనే పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. జనవరి 15, 2026న సంక్రాంతి కానుకగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఈలోపు యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ తమ స్క్రిప్ట్ లను, ఐడియాలను సిద్ధం చేసుకోమని చిత్ర బృందం హింట్ ఇచ్చింది.
