మంచానపడ్డ కమెడియన్ రామచంద్ర.. పరామర్శించిన రాకింగ్ స్టార్!
ప్రముఖ కమెడియన్ రామచంద్ర.. జూనియర్ ఎన్టీఆర్ తొలి పరిచయంలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన 'నిన్ను చూడాలని' సినిమా ద్వారా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు.
By: Madhu Reddy | 2 Sept 2025 5:58 PM ISTప్రముఖ కమెడియన్ రామచంద్ర.. జూనియర్ ఎన్టీఆర్ తొలి పరిచయంలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన 'నిన్ను చూడాలని' సినిమా ద్వారా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు. ఈ సినిమా తర్వాత దుబాయ్ శీను, సొంతం, ఆనందం, కింగ్, లౌక్యం, వెంకీ వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా తన సినీ కెరియర్లో 100కు పైగా చిత్రాలలో కమెడియన్ గా చేసిన రామచంద్ర అనూహ్యంగా ఇప్పుడు పక్షవాతం బారినపడి మంచాన పడ్డ విషయం తెలిసిందే. గత నెల రోజులుగా పక్షవాతం సమస్యతో బాధపడుతున్న కమెడియన్ రామచంద్ర ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు కూడా.
కమెడియన్ రామచంద్రన్ పరామర్శించడం మంచు మనోజ్..
ముఖ్యంగా తన ఆరోగ్య పరిస్థితి రవితేజ, చిరంజీవి వరకు చేరాలి అని.. వారు స్పందించాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కమెడియన్ రామచంద్రను కలిసి పరామర్శించారు. విజయవాడకు బయలుదేరిన మంచు మనోజ్ కు రామచంద్ర సోదరుడు వాట్సప్ ద్వారా అసలు విషయాన్ని తెలియజేశారట. దీంతో నేరుగా హైదరాబాదులో ఉన్న రామచంద్ర ఇంటికి వెళ్లి రామచంద్రను కలిసి మనోజ్ పరామర్శించారు. రామచంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.అంతేకాదు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని.. ఖచ్చితంగా అండగా నిలుస్తానని మంచు మనోజ్ హామీ ఇచ్చారు. మీరు త్వరగా కోలుకుంటారు.. త్వరలోనే ఇద్దరం కలిసి సినిమా కూడా చేద్దాం అంటూ మంచు మనోజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కమెడియన్ రామచంద్రకు అసలు ఏమైంది?
గత నెల రోజుల క్రితం తన ఫ్రెండ్ కోరిక మేరకు ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లారట రామచంద్ర. ఈ విషయాన్ని ఆయన చెబుతూ.. "నా ఫ్రెండ్ పిలిస్తే ఒక షూటింగ్ ఉందని వెళ్లాను. అయితే అక్కడ అనుకోకుండా జ్వరం, కాళ్ల నొప్పులు వచ్చాయి. ఇంటికి వచ్చేసాను. వెంటనే ఫ్యామిలీ డాక్టర్ ను కలవగా.. ఆయన స్కానింగ్ చేయాలన్నారు. స్కానింగ్ చేసిన తర్వాత బ్రెయిన్ లో రెండు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని తేలింది. ఆ తర్వాత రెండు రోజులకు ఎడమ చేయి, ఎడమ కాలు పనిచేయడం ఆగిపోయాయి. వైద్యులు పరిశీలించి ఇది పక్షవాతం అని, బ్రెయిన్ లో ఉన్న రెండు బ్లడ్ క్లాట్స్ కరిగిపోతే చెయ్యి, కాలు మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటాయని చెప్పారు. ప్రస్తుతం మందులు వాడుతున్నాను.. మరో రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పారు.
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న రామచంద్ర..
ఇప్పటివరకు కొంతమంది సహాయం చేయగా.. మందులకు ఆ డబ్బులు సరిపోతున్నాయి. దాతలు ఎవరైనా స్పందించి చికిత్సకు సహకరించాలని కోరుకుంటున్నాను" అంటూ కమెడియన్ రామచంద్ర ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామచంద్ర బంధువులు, సన్నిహితులు సెలబ్రిటీలకు ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మంచు మనోజ్ కూడా కమెడియన్ రామచంద్ర ఇంటికి వచ్చి పరామర్శించారు. మరి ఈయన ఆర్థిక సహాయం చేస్తున్నారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
