నేను ఒక్కడినే.. నమ్మి ఉంటావా? - మంచు మనోజ్
ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్టాడటం కొందరికే చెల్లుతుంది. అలాంటి కేటగిరీకే చెందుతాడు మంచు మనోజ్.
By: Sivaji Kontham | 4 Nov 2025 11:10 PM ISTముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్టాడటం కొందరికే చెల్లుతుంది. అలాంటి కేటగిరీకే చెందుతాడు మంచు మనోజ్. మొహమాటం లేకుండా మాట్లాడటం, టైమింగ్ లీ కామిక్ సెన్స్ తో అందరినీ నవ్వించడం, లైవ్ వైర్ లా ఎనర్జీ అతడి ప్రత్యేకతలు. అయితే ఇటీవల తన సోదరుడు విష్ణుతో గొడవల్లో అతడు చాలా ఎమోషనల్ గా కనిపించాడు.
కొంత గ్యాప్ తర్వాత బ్రదర్స్ మధ్య గొడవలన్నీ సమసిపోయినట్టే కనిపిస్తోంది. ఇటీవలే మనోజ్ యువహీరో తేజ సజ్జా మిరాయ్ లో ప్రతినాయకుడిగా మెరిసాడు. ఈ ఫాంటసీ ఫిక్షన్ మూవీలో మనోజ్ నటనకు మంచి పేరొచ్చింది. ఇలాంటి సమయంలో రెట్టించిన ఎనర్జీ ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. మునుముందు ఈ తరహా సినిమాల్లో నటించేందుకు అతడు సుముఖంగా ఉన్నాడు. మరోవైపు సినిమాల ఈవెంట్లలో మనోజ్ చురుగ్గా కనిపిస్తున్నాడు.
ఇటీవల అతడు అతిథిగా వెళ్లిన ఓ ఈవెంట్లో తనతో పాటే తన సతీమణి మౌనిక కూడా ఉన్నారు. ఈ వేదికపై దంపతుల అన్యోన్యత మరోసారి అభిమానుల్లో చర్చగా మారింది. వేదికపై మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక లిరిక్ ఉంది.. దానిలానే నేను నా భార్యకు మాటిచ్చానని అన్నాడు.
రాజ్యాలు లేకపోయినా నిన్ను బాగా చూసుకుంటానని తన భార్యకు మాటిచ్చినట్టు అతడు చెప్పాడు. నేను కూడా మౌనికను కలిసినప్పుడు ఫస్ట్ టైమ్ ఒకరోజు మాటిచ్చాను. ``నాకు అందరూ అనుకున్నట్టు రాజ్యాలు ఏవీ లేవు.. నేను ఒక్కడినే ఉన్నాను. సినిమాలు కూడా చేయడం లేదు. కానీ కచ్ఛితంగా చేస్తాను.. పనైతే చేస్తాను.. కష్టమైనా పడతాను. ఒకరిని మోసం చేయను.. జీవితాంతం నిన్ను చూసుకుంటాను.. నన్ను నమ్మి ఉంటావా? అనడిగాను .. ఈ రోజు వరకూ నమ్మి ఉంది`` అని తెలిపాడు. పెండింగ్ లో ఉన్న వాట్ ద ఫిష్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తాడో వేచి చూడాలి.
