Begin typing your search above and press return to search.

మంచు మనోజ్.. ఇంకోటి ఆగిందా?

ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ.. నిలకడగా హిట్లు కూడా కొడుతూ మంచి ఊపులోనే ఉండేవాడు మంచు మనోజ్.

By:  Garuda Media   |   7 Aug 2025 8:00 AM IST
మంచు మనోజ్.. ఇంకోటి ఆగిందా?
X

ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ.. నిలకడగా హిట్లు కూడా కొడుతూ మంచి ఊపులోనే ఉండేవాడు మంచు మనోజ్. కానీ ఒక దశలో వరుస ఫ్లాపులు, వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల తన కెరీర్‌కు బ్రేక్ పడింది. చూస్తుండగానే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. చివరికి ‘అహం బ్రహ్మాస్మి’ అనే భారీ సినిమా ఒకటి మొదలుపెడితే ఏవో కారణాలతో అది ముందుకు సాగలేదు. చివరికి ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. మనోజ్ రీఎంట్రీ మరింత ఆలస్యం అయింది. ఐతే రెండేళ్ల కిందట ‘వాట్ ద ఫిష్’ అంటూ మనోజ్ మరో సినిమాను మొదలుపెట్టాడు. ఇంట్రెస్టింగ్ పోస్టర్లు కూడా వదిలాడు. కొన్ని రోజులు ఈ చిత్రం వార్తల్లో ఉంది. కానీ తర్వాత అప్‌డేట్స్ ఆగిపోయాయి. మధ్యలో ‘భైరవం’ అనే సినిమా తెరపైకి వచ్చింది. అందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తే.. మనోజ్ విలన్ తరహా పాత్ర పోషించాడు. ఇది కాకుండా ‘మిరాయ్’లో మెయిన్ విలన్‌గానే నటించాడు.

ఆ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. సెప్టెంబరులో రిలీజ్‌కు కూడా రెడీ అవుతోంది. ఐతే ‘వాట్ ద ఫిష్’ మాత్రం దాదాపు ఏడాది నుంచి వార్తల్లోనే లేదు. కాగా ఇప్పుడు మనోజ్ హీరోగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఆ చిత్రమే.. డేవిడ్ రెడ్డి. బ్రిటిష్ వాళ్ల మీద పోరాడిన ఒక యోధుడి కథ ఇదట. హనుమరెడ్డి యక్కంటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని ప్రి లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గానే కనిపిస్తోంది. దీని సంగతి ఓకే కానీ.. ‘వాట్ ద ఫిష్’ సినిమా పరిస్థితి ఏంటి అన్నదే అర్థం కావడం లేదు. ఆ సినిమా పూర్తయినా అయ్యుండాలి. లేదా దాన్ని ఆపేసి అయినా ఉండాలి.

అసలే గ్యాప్ వల్ల హీరోగా మనోజ్ మార్కెట్ దెబ్బతింది. ఇలాంటి టైంలో హీరోగా ఒక సినిమా చేస్తుండగా దాని సంగతి తేల్చకుండా ఇంకోటి మొదలుపెట్టే అవకాశం లేదు. ఏడాది నుంచి ఏ అప్‌డేట్ లేదంటే.. స్క్రిప్టు లేదా మేకింగ్ విషయంలో సంతృప్తి చెందక ఆ సినిమాను ఆపేసి ఉంటారనే భావిస్తున్నారు. హీరోగా మనోజ్ కొత్త సినిమా అనౌన్స్ చేసినపుడల్లా బాగానే క్యూరియాసిటీ కనిపిస్తోంది. కానీ ఆ సినిమాలు ముందుకు మాత్రం కదలట్లేదు. మరి ‘డేవిడ్ రెడ్డి’ అయినా అనుకున్నట్లుగా పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చి మనోజ్‌కు సోలో హీరోగా మంచి విజయాన్నిస్తుందేమో చూడాలి.