ఫ్యామిలీలో గొడవలు.. మంచు డాటర్ ఫస్ట్ రెస్పాన్స్ ఇదే..
అయితే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి స్పందించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
By: M Prashanth | 27 Nov 2025 12:32 PM ISTటాలీవుడ్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుటుంబంలో కొంత కాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏకంగా మీడియా ముందుకు వచ్చి మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఆరోపణలు చేసుకున్నారు. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది. కానీ కొన్నిరోజులుగా కాస్త సద్దమణిగినట్లు కనిపిస్తుందని చెప్పాలి.
అయితే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి స్పందించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అంత జరుగుతున్నా.. ఎందుకు స్పందించడం లేదని అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో మంచు కుటుంబంలో విభేదాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు లక్ష్మి.
ముందుగా దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే మాత్రం తాను తన కుటుంబం మళ్లీ పాత రోజుల్లానే ఒక్కటిగా మారాలని మాత్రమే కోరుకుంటానని చెప్పుకొచ్చారు. అందరూ కూడా ఎలాంటి తేడాలు లేకుండా కలిసి ఉండేలా చూడాలని దేవుడిని వేడుకుంటానని తెలిపారు. నిజానికి.. ప్రతి ఫ్యామిలీలో కూడా గొడవలు సహజమేనని అన్నారు.
కానీ ఎన్ని వివాదాలు వచ్చినా చివరకు కుటుంబమే మిగులుతుంది కదా అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇండియన్ ఫ్యామిలీస్ లో కొన్నిసార్లు చిన్న కారణాలకే పెద్ద పెద్ద దూరాలు ఏర్పడతాయని అన్నారు. కొందరు వ్యక్తులు జీవితాంతం పూర్తిగా కలవకూడదనే నిర్ణయాలు కూడా తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.
కానీ ఎవరికైనా చివరకు నిలిచేది.. మిగిలేది రక్తసంబంధీకులేని అన్నారు. కుటుంబంతో ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేయాలని, దూరాన్ని పెంచుకోకూడదని క్లారిటీ ఇచ్చారు. తాను ముంబయిలో ఉండడం వల్ల కుటుంబ విషయాల గురించి పట్టించుకోలేదని వచ్చిన వార్తలు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ సమయంలో తాను ఎంత బాధపడ్డానో తనకు మాత్రమే తెలుసని అన్నారు మంచు లక్ష్మి. తనపై ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహాగానాలు క్రియేట్ చేశారని అన్నారు. తాను సైలెంట్ గా ఉండడం వల్ల ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని చెప్పారు. పర్సనల్ మ్యాటర్ ను మీడియాతో మాట్లాడటం తనకిష్టం లేదని స్పష్టం చేశారు.
తన ఫ్యామిలీలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అనుకోలేదని చెప్పిన మంచు లక్ష్మి.. కుటుంబం కోసం పోరాడటమే నిజమైన బాధ్యత అన్నారు. చేసే ప్రతి ప్రయత్నం ఒక దశలో ఫలిస్తుందని పేర్కొన్నారు. కుటుంబాన్ని దూరం చేయడం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదని ఆమె చెప్పగా.. ప్రస్తుతం మంచు డాటర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
