Begin typing your search above and press return to search.

నట జీవితానికి అర్ధ శతాబ్దం.. మొన్న బాలయ్య..నేడు?

ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు మరో నటుడు కూడా ఇలా అర్ధ శతాబ్దాన్ని పూర్తి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

By:  Sivaji Kontham   |   14 Nov 2025 9:24 AM IST
నట జీవితానికి అర్ధ శతాబ్దం.. మొన్న బాలయ్య..నేడు?
X

సినీ పరిశ్రమలో హీరోయిన్లకు ఎలాగో లైఫ్ టైం చాలా తక్కువ.. కానీ హీరోలకు మాత్రం వయసు ముదిరినా.. హీరోగా అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.. అలా ఇప్పటికే ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో కొంతమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఏకంగా అర్ధ శతాబ్దం పూర్తి చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు మరో నటుడు కూడా ఇలా అర్ధ శతాబ్దాన్ని పూర్తి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో విలన్ గా కెరియర్ మొదలు పెట్టి, ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసి కలెక్షన్ కింగ్ గా.. డైలాగ్ కింగ్ గా పేరు సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన విశిష్ట సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ చేత గౌరవంగా సత్కరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక అద్భుతమైన ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు.

అందులో భాగంగానే నవంబర్ 22వ తేదీన "MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ " పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ సినిమాకు మోహన్ బాబు అందించిన సేవలను గౌరవిస్తూ ఈ వేడుకను ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయేలా ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో పడ్డారు కుటుంబ సభ్యులు.

మోహన్ బాబు నట జీవిత విషయానికి వస్తే.. తిరుపతి సమీపంలోని మోదుగుల పాలెం గ్రామంలో మంచు నారాయణస్వామి నాయుడు, మంచు లక్ష్మమ్మ దంపతులకు భక్తవత్సలం నాయుడుగా జన్మించారు. YMCA కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధకుడిగా తన కెరియర్ ను ప్రారంభించిన ఈయనకు.. ఆ సమయంలో తెలుగు సినిమాలో స్క్రిప్టు రచయితగా ఉన్న దాసరి నారాయణరావు పరిచయమయ్యారు. ఆ పరిచయం ఆయన కెరియర్ లో అత్యంత కీలకంగా ఏర్పడింది.

అలా 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం చిత్రంతో నటుడిగా మోహన్ బాబుకు తొలి అతిపెద్ద విజయం లభించింది. ఇందులో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ఆ తర్వాత ఖైదీ , కాళిదాసు, గృహప్రవేశం, కేటుగాడు, అల్లరి మొగుడు, అసెంబ్లీ రౌడీ ఇలా చాలా చిత్రాలలో ప్రధాన నటుడిగా కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎక్కువగా రజినీకాంత్ , శివాజీ గణేషన్లతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు మోహన్ బాబు

ఇకపోతే ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన శ్రీ విద్యానికేతన్ సంస్థలను స్థాపించి వాటిని యూనివర్సిటీలుగా అభివృద్ధి చేసి ఎంతో మంది పేద పిల్లలకు ఉచిత విద్యను కూడా అందిస్తూ గొప్ప మనసున్న వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు మోహన్ బాబు.