'మన శంకరవరప్రసాద్ గారు' టికెట్ ధరల వివాదం: హైకోర్టు కీలక ఆదేశాలు!
అంతేకాకుండా, ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో కోర్టు ఇచ్చిన కొన్ని మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈ మెమో జారీ చేశారని పిటిషనర్ వాదించారు.
By: M Prashanth | 24 Jan 2026 1:45 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ ఇప్పటికే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఘనవిజయం ఒకవైపు సందడి చేస్తుంటే, మరోవైపు టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం వరకు వెళ్లింది. ఈ సినిమా కోసం ప్రభుత్వం అనుమతించిన అదనపు టికెట్ ధరల ద్వారా వసూలైన రూ. 42 కోట్లను తిరిగి రికవరీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.
దీనిపై స్పందించిన ధర్మాసనం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు జీఎస్టీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అసలు వివాదం ఏమిటంటే, ఈ నెల 8వ తేదీన హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఒక మెమో జారీ చేస్తూ ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతించారు. దీని ప్రకారం వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్సుల్లో రూ. 100 చొప్పున పెంచుకోవడానికి వీలు కలిగింది.
అంతేకాకుండా, ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో కోర్టు ఇచ్చిన కొన్ని మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈ మెమో జారీ చేశారని పిటిషనర్ వాదించారు. న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, నిబంధనలకు విరుద్ధంగా అదనపు ధరల ద్వారా సుమారు రూ. 42 కోట్లు అక్రమంగా ఆర్జించారని పేర్కొన్నారు. ప్రజల నుండి వసూలు చేసిన ఈ అదనపు మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు.
ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు, ఈ పెంపుదల, వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యంగా జీఎస్టీ రూపంలో వచ్చిన ఆదాయ వివరాలను కూడా కోరింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు నిర్మాణ వ్యయం దృష్ట్యా టికెట్ ధరలు పెంచుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ పెంపు అనేది సామాన్య ప్రేక్షకుడిపై భారం పడకుండా ఉండాలని, చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉండాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా ఉందా లేదా అనేది ఇప్పుడు న్యాయస్థాన విచారణలో తేలాల్సి ఉంది. ఇక ఈ కేసును వచ్చే నెల 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటిలోగా ప్రభుత్వం, ప్రతివాదులు తమ వివరణను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు ఈ వసూళ్లను అక్రమమని గుర్తిస్తే, ఆ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారు లేదా ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
సినిమా విజయవంతంగా నడుస్తున్న తరుణంలో ఇలాంటి చట్టపరమైన చిక్కులు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.మొత్తానికి, పెద్ద సినిమాల టికెట్ ధరల విషయంలో ఒక స్పష్టమైన పాలసీ ఉండాల్సిన అవసరం ఉందని మరోసారి ఈ ఘటన ద్వారా అర్ధమవుతుంది. మరి ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.
