మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి శశిరేఖ వచ్చేనా..?
ఇప్పటికే అనిల్ రావిపూడి అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టాలని తన టీమ్ కి సూచించారని తెలుస్తోంది.
By: Ramesh Palla | 22 Jan 2026 12:46 PM ISTమెగాస్టార్ చిరంజీవి స్టామినాకి తగ్గ హిట్ పడటం లేదని, ఆయన్ను వింటేజ్ పాత్రల్లో చూడాలని కోరుకున్నా అది సాధ్యం కావడం లేదని చాలా ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ మదన పడుతున్నారు. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరి కోరిక తీర్చాడు. తనను అభిమానించే సీనియర్ ఫ్యాన్స్ నుంచి జూనియర్ ఫ్యాన్స్ వరకు అందరిని ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేసే విధంగా 'మన శంకరవర ప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సునాయాసంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ముందు ముందు మరింతగా వసూళ్లు సాధించబోతుంది అనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత కూడా సినిమాకు సాలిడ్‌గా షేర్ నమోదు అవుతున్నట్లు లెక్కలు కనిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు...
ఇంతటి మెగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ చాలా ఆశ పడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు గాను నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టాలని తన టీమ్ కి సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి దుబాయ్ లో ఉన్నారు. ఆయన ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ ఉన్నప్పటికీ చిరంజీవి ఇప్పటికే విజయోత్సవ వేడుక కి ఓకే చెప్పారని, ఆయన వచ్చిన వెంటనే వేడుక ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఈవెంట్ లో భారీ ఎత్తున అభిమానులు హాజరు అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఇక సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారట. అయితే నయనతార ఈ ఈవెంట్ కు హాజరు అయ్యేనా అనేది ప్రశ్నగా మారింది.
నయనతార ఈవెంట్‌కి హాజరు అయ్యేనా...
శంకరవర ప్రసాద్ భార్య శశిరేఖ పాత్రలో నయనతార లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. శశిరేఖ పాత్రకు పర్‌ఫెక్ట్ అన్నట్లుగా ఈ అమ్మడు మెప్పించింది. అందుకే ఈ విజయోత్సవ వేడుకలో నయనతార పాల్గొంటే నిండుగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటికే ఆమెను విజయోత్సవ కార్యక్రమానికి రావాలంటూ విజ్ఞప్తి చేశాడని తెలుస్తోంది. ఎప్పటిలాగే ఈవెంట్‌కి తాను రాలేను అని నయన్ చెప్పిందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కే నయనతార రాలేదు. కానీ ప్రమోషన్ వీడియోలకు మాత్రం ఆమె ఒప్పుకుంది. కనుక మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి నయన్ రాకపోవచ్చు అనేది యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఏమైనా మాట్లాడేనా లేదంటే ఆమె తన మనసు మార్చుకుని హాజరు అయ్యేనా అనేది చూడాలి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో..
మెగాస్టార్ చిరంజీవి తన కామెడీ టైమింగ్‌తో పాటు, లుక్స్ పరంగా మన శంకరవర ప్రసాద్ లో ఫ్యాన్స్ ను మెప్పించాడు. దర్శకుడు అనిల్ రావిపూడి మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ సక్సెస్ జోష్ లో ఉన్నాడు. ఆయన తదుపరి సినిమా ఏంటా అని అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం దుబాయ్‌లో తన తదుపరి సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయ్యి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ ను సాధించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డ్‌లను సొంతం చేసుకుంది.
ఈమధ్య కాలంలో ఏ సినిమా సాధించని విధంగా అన్ని చోట్ల బ్రేక్ ఈ వెన్ ను కేవలం మొదటి వారం పది రోజుల్లోనే సాధించడం రికార్డ్ గా చెప్పుకోవచ్చు. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ రికార్డ్ ఈవెంట్ ను అదే రేంజ్‌లో నిర్వహించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 25వ తారీకు ఆదివారం సినిమా ఈవెంట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
