ఐటం సాంగ్ సినిమా డిఎన్ఏ లో భాగం!
కాలంతో పాటు సంగీతం, నృత్యం మారుతున్నప్పటికీ కమర్షియల్ సినిమాల్లో ఎనర్జిటిక్ పాట ఉండాలనే కాన్సెప్ట్ మాత్రం అలాగే ఉందన్నారు.
By: Srikanth Kontham | 12 July 2026 8:00 AM IST`ఐటమ్ సాంగ్స్`కున్న ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడంటే కంటెంట్ మోజులో పడి ఐటం పాటల్ని లైట్ తీసుకుంటున్నారు గానీ నాలుగైదేళ్ల క్రితం వరకూ ఐటం పాటలకు ఎలాంటి డిమాండ్ కనిపించిందో చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటిపై అదే స్థాయిలో భిన్నమైన అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ప్రత్యేకంగా బాలీవుడ్ పరిశ్రమలో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా ఈ అంశంపై ప్రముఖ గాయని మమతా శర్మ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఐటం పాటలు మన సినిమా డీఎన్‌ఏలో అంతర్భాగంగా పేర్కొన్నారు.
కాలంతో పాటు సంగీతం, నృత్యం మారుతున్నప్పటికీ కమర్షియల్ సినిమాల్లో ఎనర్జిటిక్ పాట ఉండాలనే కాన్సెప్ట్ మాత్రం అలాగే ఉందన్నారు. ఈ తరహా పాటలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాకుండా సినిమాకు ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. చాలా మంది ఐటం పాటలను గ్లామర్ అంశంగా చూస్తారని కానీ ఒక పాట హిట్ అవ్వాలంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంటుందన్నారు. ట్యూన్, సాహిత్యం, గాత్రం అన్నీ కలిస్తేనే ఆ పాట తెరపై మ్యాజిక్‌ను సృష్టిస్తుందన్నారు. కేవలం గ్లామర్ మాత్రమే సినిమాను నిలబెట్టలేదన్నారు. ఐటమ్ సాంగ్స్ పట్ల ఉండే నెగటివిటీని పక్కనపెడితే అవి అందించే వినోద విలువను ఎవరూ కాదనలేరని ఉద్ఘాటించారు.
ఒక ఐటమ్ సాంగ్ సినిమా ఫ్లోను ఎలా మారుస్తుందో? గమనించాలని మమతా శర్మ సూచించారు. కథలో కీలక మలుపు దగ్గర ... ప్రేక్షకులు థియేటర్లో బోర్ ఫీలవుతున్న సమయంలో ఇలాంటి ఎనర్జిటిక్ పాటలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అభిప్రాయపడ్డారు. మ్యూజికల్ ఫీస్ట్ లాంటి ఈ పాటలు బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్లను ప్రభావితం చేయడంలోనూ ..యూత్‌ను థియేటర్లకు ఆకర్షించడంలోనూ తమవంతు పాత్రను పోషిస్తాయని తెలిపారు. సంగీత దర్శకులు, నిర్మాతలు కూడా ఆందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
అయితే పాటలలోని సాహిత్యం చిత్రీకరణ విషయంలో పరిమితులు ఉండాలన్నారు. కాలంతోపాటు ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయని దానికి అనుగుణంగా పాటల్లో హుందాతనాన్ని నాణ్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత సృష్టికర్తలపై ఉందని అభిప్రాయపడ్డారు. అశ్లీలత కంటే, కళాత్మకమైన నృత్యం , మెలోడియస్ బీట్స్ ఉన్న పాటలకు ఎక్కువ ఆదరణ ఉంటుందని.. తాము కూడా అలాంటి పాటలకే ప్రాధాన్యత ఇస్తుంటామన్నారు
తన కెరీర్ లో ప్రతి పాట ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చిందని ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే అసలైన రివార్డ్ అన్నారు.
ఐటమ్ సాంగ్స్ పాడే గాయనిగా తనపై ముద్ర ఉన్నా? మ్యూజిక్ డైరెక్టర్లు తన గొంతులోని వైవిధ్యాన్ని గుర్తించి ఇతర రకాల పాటలను కూడా పాడే అవకాశం ఇచ్చారన్నారు. తాను అన్ని రకాల జోనర్లలోనూ రాణించగలనని ధీమా వ్యక్తం చేసారు. మారుతున్న ట్రెండ్స్ ప్రకారం ఐటం పాటల శైలి మారొచ్చు కానీ వీటి ఆవశ్యకత మాత్రం తగ్గదన్నారు. ప్రేక్షకులు వినోదాన్ని కోరుకున్నంత కాలం ఐటం పాటలు వెండితెరపై సందడి చేస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.
