Begin typing your search above and press return to search.

మల్టీస్టారర్ లో 'హీరో' ఎవరు? మమ్ముట్టి ఆన్సర్ ఏంటంటే?

మల్టీస్టారర్ సినిమాల్లో హీరో ఎవరన్న చర్చ ఎప్పటికీ నిలిచిపోదు. అయితే ఆ ప్రశ్నకు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   9 April 2026 3:00 PM IST
మల్టీస్టారర్ లో హీరో ఎవరు? మమ్ముట్టి ఆన్సర్ ఏంటంటే?
X

మల్టీస్టారర్ సినిమాల్లో హీరో ఎవరన్న చర్చ ఎప్పటికీ నిలిచిపోదు. అయితే ఆ ప్రశ్నకు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. "ఇలాంటి సినిమాల్లో హీరో ఎవరన్నది ముఖ్యం కాదు, కథే అసలు హీరో" అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో యాంకర్.. కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్ - కమల్ హాసన్ కాంబినేషన్‌ లో వస్తున్న KH x RK గ్లింప్స్‌ ను ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. అందులో ఇద్దరు "ఎవరు హీరో?" అని దర్శకుడిని అడిగే సన్నివేశం గురించి ప్రస్తావించి, మీరు మోహన్ లాల్ తో కలిసి నటించినప్పుడు అలాంటి సందేహం వచ్చిందా అని అడిగారు.

దీనికి స్పందించిన మమ్ముట్టి స్పష్టంగా తన అభిప్రాయం వెల్లడించారు. "మేమిద్దరం కలిసి నటించినప్పుడు కథే ప్రధానంగా ఉంటుంది. మేం ఆ కథలో పాత్రలు మాత్రమే. ఎవరు హీరో అన్న భావన మాకు ఉండదు" అని అన్నారు. తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవని, ఒకరి సినిమాల్లో మరొకరు నటించడం చాలా సహజమని కూడా తెలిపారు.

మమ్ముట్టి ఇంకా మాట్లాడుతూ, "నేను మోహన్ లాల్ సినిమాల్లో నటించాను, ఆయన కూడా నా సినిమాల్లో నటించారు. మేం ఎప్పుడూ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ఆలోచన పెట్టుకోం. మంచి కథ ఉంటే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం" అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు మల్టీస్టారర్ సినిమాలపై ఉన్న అభిప్రాయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.

ఇదిలా ఉంటే, సౌత్ లో అరుదైన కాంబినేషన్‌ గా భావిస్తున్న రజనీకాంత్ - కమల్ హాసన్ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. KHxRK అనే వర్కింగ్ టైటిల్‌ తో ఇటీవల విడుదలైన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది. ఆ చిత్రానికి జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.

గ్లింప్స్‌ లో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ స్టైలిష్‌ గా కనిపిస్తూ పోటాపోటీగా నిలిచారు. రజనీకాంత్ కారు కీ ఇవ్వడం, కమల్ హాసన్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చోవడం వంటి షాట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. చివర్లో "ఎవరు హీరో?" అనే ప్రశ్న సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. మమ్ముట్టి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చూస్తే, ఆ ప్రశ్నకు సమాధానం ముందు స్పష్టంగా ఉందని చెప్పాలి. కథే ప్రధానంగా ఉండే ఇలాంటి చిత్రాల్లో నటీనటుల కంటే కంటెంట్‌ కే ప్రాధాన్యం ఉంటుందని ఆయన అభిప్రాయం. ఇదే విధానం కమల్ హాసన్- రజనీకాంత్ ప్రాజెక్ట్‌ లో కూడా కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా.. ఇద్దరు లెజెండ్స్ కలిసి నటిస్తున్న సినిమా కథ ఆధారంగా ముందుకు సాగుతుందన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.