Begin typing your search above and press return to search.

భారీ వ్యాపారాలకు దూరంగా సూప‌ర్ స్టార్!

మమ్ముట్టి - మరో మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్‌లకు గత 30 ఏళ్లుగా ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న సీఏ సానిల్ కుమార్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ మమ్ముట్టి ఆర్థిక విధానాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   1 Nov 2026 5:00 PM IST
భారీ వ్యాపారాలకు దూరంగా సూప‌ర్ స్టార్!
X

దశాబ్దాలుగా అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న మ‌ల‌యాళ‌ మెగాస్టార్ మమ్ముట్టి కేవలం సినిమాల ద్వారానే కాక క్రమశిక్షణతో కూడిన జీవనశైలితోనూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తెరపై ఎలాంటి ప్రయోగాత్మక పాత్రలనైనా ధైర్యంగా చేసే లెజెండ్ రియల్ లైఫ్‌లో ఆర్థిక విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ..ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారట. భారీ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి అనవసరమైన ఆర్థిక రిస్క్‌లను కొనితెచ్చుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడరని.. ఆయన పెట్టుబడులన్నీ ఎక్కువగా భూములు వంటి సురక్షితమైన రంగాలకే పరిమితమవుతాయని ఆర్థిక వ్యవహారాలు చూసే చార్టెడ్ అకౌంటెంట్ వెల్లడించారు.

మమ్ముట్టి - మరో మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్‌లకు గత 30 ఏళ్లుగా ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న సీఏ సానిల్ కుమార్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ మమ్ముట్టి ఆర్థిక విధానాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెలబ్రిటీలు అనగానే పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభించడం, బిజినెస్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం సర్వసాధారణం. కానీ మమ్ముట్టి మాత్రం అలాంటి పెద్ద వ్యాపారాల జోలికి వెళ్లడానికి ఎప్పుడూ ఆసక్తి చూపలేదని సానిల్ కుమార్ స్పష్టం చేశారు. రిస్క్తో కూడిన వ్యాపారాల కంటే భవిష్యత్తులో సురక్షితమైన లాభాలను అందించే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నారు.

అయితే మమ్ముట్టి పూర్తిగా వ్యాపారాలకు దూరంగా ఉంటారని చెప్పలేం. గతంలో ఆయన కుమార్తె సురుమి .. అల్లుడు డాక్టర్ మొహమ్మద్ రెహాన్ సయీద్‌తో కలిసి మాతృత్వ సంరక్షణ సేవలకు సంబంధించిన స్టార్టప్ వెంచర్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. ఆ కాలంలో స్టార్టప్‌ల గురించి నేటిలా అంతగా అవగాహన లేని రోజుల్లోనే ప్రారంభమైన ఆ సంస్థ ఆ తర్వాత కాలంలో విదేశీ కంపెనీ చేతికి టేకోవర్ కావడం .. భారీ ప్రీమియంతో షేర్లు అమ్ముడుపోవడం జరిగిందని సానిల్ కుమార్ గుర్తు చేశారు. అలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాలు మినహా, ఆయన ఎప్పుడూ భారీ కమర్షియల్ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా తన సంపాదనను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా భద్రంగా కాపాడుకోవడంలో మమ్ముట్టికి అద్భుతమైన క్లారిటీ ఉందని సానిల్ కుమార్ ప్రశంసించారు. సొంతంగా తన ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం వల్లనే ఆయన ఆస్తులను ఎప్పుడూ సురక్షితమైన మార్గాల్లోనే వృద్ధి చేసుకున్నారని తెలిపారు. సంపాదించిన డబ్బును తెలివిగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో? ఎక్కడ రిస్క్ తీసుకోకూడదో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు.

సినిమాల విషయానికి వస్తే వయసుతో సంబంధం లేకుండా వరుస ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకెళ్తున్న మమ్ముట్టి ప్రస్తుతం మలయాళంలో లెజెండరీ దర్శకుడు గోపాలకృష్ణన్ తెరకెక్కిస్తున్న `పడయాట్ర` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న భారీ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా `ఓమ్`చిత్రంలో బర్మ కార్తికేయన్ (సియా) అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.