Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న ప్రాంచైజీ నుంచి పార్ట్ -6!

అత్యంత సుదీర్ఘకాలం కొన‌సాగిన‌ ఇన్వెస్టిగేషన్ ఫ్రాంచైజీగా మ‌ల‌యాళం 'సీబీఐ' సిరీస్ ఒక ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది.

By:  Srikanth Kontham   |   30 March 2026 2:24 PM IST
సంచ‌ల‌న ప్రాంచైజీ నుంచి పార్ట్ -6!
X

అత్యంత సుదీర్ఘకాలం కొన‌సాగిన‌ ఇన్వెస్టిగేషన్ ఫ్రాంచైజీగా మ‌ల‌యాళం 'సీబీఐ' సిరీస్ ఒక ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది. ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ఐదు భాగాలు మంచి విజ‌యం సాధించాయి. తాజాగా ఈ సంచలన ఫ్రాంచైజీ నుంచి ఆరవ భాగం సీబీఐ 6ను ప‌ట్టాలెక్కించేందుకు రంగం సిద్ద‌మ‌వుతోంది. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి తన ఐకానిక్ పాత్ర సేతురామ అయ్యర్ గా వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన ఐదు భాగాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాదు.

మమ్ముట్టి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. 1988లో 'ఒరు సీబీఐ డైరీ కురిప్పు' తో మొదలైన ప్రయాణం 2022లో రిలీజ్ 'సిబిఐ 5: ది బ్రెయిన్' వరకు విజయవంతంగా కొనసాగింది. మేధస్సుతో క్లిష్టమైన కేసులను ఛేదించే నిశబ్ద ఆఫీసర్‌గా సేతురామ అయ్యర్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోశారు. ఆయ‌న కాక‌పోతే ఆ పాత్ర అంత‌గా పండేది కాదేమో అన్నంత‌గా సేతురామ పాత్ర‌లో ఒదిగిపోయారు. దీంతో ఆర‌వ‌భాగంలో కూడా ఆయ‌నే ప్ర‌ధాన పాత్ర‌లో కొన‌సాగుతున్నారు. అయితే ఆరవ భాగంలో ఓ కీలకమైన మార్పు చోటు చేసుకుంది.

మొదటి ఐదు భాగాలకు లెజెండరీ డైరెక్టర్ కె. మధు దర్శకత్వం వహించగా ఆర‌వ భాగం బాధ్యతలు యువ దర్శకుడు జోపిన్ టీ చాకో చేతుల్లోకి వెళ్లాయి. గతంలో మమ్ముట్టితో 'తోప్పిల్ జోప్పన్' వంటి చిత్రాలను తెరకెక్కించిన జోపిన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను ఆధునిక హంగులతో సరికొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. దర్శకత్వంలో మార్పు వచ్చినప్పటికీ ఈ సిరీస్ ఆత్మ అయిన సేతురామ అయ్యర్ నడక, ఆ ఆలోచనా శైలి , నేపథ్య సంగీతం ఏమాత్రం తగ్గకుండా ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు.

కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కథా గమనం ఉండబోతోందని యూనిట్ వ‌ర్గాల‌ సమాచారం. మమ్ముట్టి తన 70వ ఏటా కూడా అదే ఉత్సాహంతో ఫిట్‌నెస్‌తో సేతురామ పాత్ర‌లోకి పరకాయ ప్రవేశం చేయ‌డానికి రెడీ అవుతున్నారు. పార్ట్ 6ని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా మ‌మ్ముట్టి త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో కూడా విరివిగా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న ఇమేజ్ కూడా రెట్టింపు అయింది. సీబీఐ సిరీస్ కు మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి ఆదరణ ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే ప్రేక్షకులకు 'సీబీఐ 6' అన్న‌ది ఎంతో ఎగ్జైట్ మెంట్ ను తీసుకొచ్చేదే. డైరెక్ట‌ర్ మధు సెట్ చేసిన ఆ బెంచ్ మార్క్‌ను జోపిన్ ఏ మేరకు అందుకుంటారో ? చూడాలి.