18 ఏళ్ల తర్వాత ఆ కాంబినేషన్ సైలెంట్ గా!
మలయాళ చిత్రసీమలో మమ్ముట్టి, మోహన్‌లాల్ ఇద్దరు ధ్రువతారలు. ఇద్దరు కలిసి నటించడమంటే? అది కేవలం సినిమా మాత్రమే కాదు.
By: Srikanth Kontham | 10 April 2026 4:00 PM ISTమలయాళ చిత్రసీమలో మమ్ముట్టి, మోహన్‌లాల్ ఇద్దరు ధ్రువతారలు. ఇద్దరు కలిసి నటించడమంటే? అది కేవలం సినిమా మాత్రమే కాదు. అభిమానులకు అంతకు మించి అతి పెద్ద పండుగ. 2008లో మల్టీస్టారర్ మూవీ `ట్వంటీ:20` తర్వాత మళ్లీ ఇప్పటికి అంటే 18 ఏళ్ల తర్వాత ఇద్దరు `పేట్రియాట్` చిత్రంలో కలిసి నటించారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఈ జోడీ ఇన్నాళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
`పేట్రియేట్` గ్రిప్పింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇందులో మమ్ముట్టి రిటైర్డ్ జేఏజీ ఆఫీసర్ డాక్టర్ డేనియల్ జేమ్స్ పాత్రలో కనిపిస్తుండగా, మోహన్‌లాల్ శక్తివంతమైన సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. దేశ భద్రత ,సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే కథలో అన్యాయంగా దేశద్రోహం కేసులో చిక్కుకున్న తనను తాను నిరూపిం చుకోవడానికి మమ్ముట్టి పాత్ర తన పాత మిత్రుడైన మోహన్‌లాల్ సాయం కోరుతుంది. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఉండే మైత్రి , యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ప్రచార చిత్రాలతో అర్దమవుతుంది.
ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా సైలెంట్‌గా అంతర్జాతీయ ప్రమాణాలతో సాగడం విశేషం. యునైటెడ్ కింగ్‌డమ్, శ్రీలంక, అజర్బైజాన్, థాయ్‌లాండ్ , యూఏఈ వంటి విదేశీ లొకేషన్లలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక హై-ప్రొఫైల్ మిషన్‌ను ఛేదించే క్రమంలో వచ్చే ఉత్కంఠభరితమైన సీన్లు హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. కేవలం మేకింగ్ పరంగానే కాకుండా కథా పరంగా కూడా మహేష్ నారాయణన్ ఎంతో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మమ్ముట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోహన్‌లాల్‌తో కలిసి నటించడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్ల తర్వాత కలిసి నటించినా? మొదటి రోజు షూటింగ్‌లో తమకు ఏమీ కొత్తగా అనిపించలేదన్నారు. తామిద్దరం ఎప్పుడూ ప్రాణ స్నేహితులమని చెప్పుకొచ్చారు. మోహన్‌లాల్‌ను స్పాంటేనియస్ పెర్ఫార్మర్గా అభివర్ణించారు. ఈ సినిమా సెట్స్‌లో గడిపిన క్షణాలు చాలా ఆహ్లాదకరంగా సాగాయన్నారు. వారి మధ్య ఉన్న ఈ వ్యక్తిగత అనుబంధమే తెరపై కూడా అద్భుతమైన కెమిస్ట్రీగా మారబోతోంది.
సినిమాలో కేవలం మమ్ముట్టి, మోహన్‌లాల్ మాత్రమే కాక, ఫహాద్ ఫాజిల్, నయనతార, కుంచాకో బోబన్, రేవతి వంటి భారీ తారాగణం కూడా ఉండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్ పోషిస్తున్న పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని తెలుస్తోంది. సుశిన్ శ్యామ్ అందించిన సంగీతం, మహేష్ నారాయణన్ మేకింగ్ స్టైల్ వెరసి పేట్రియాట్ బాక్సాఫీస్ సునామీని సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ సాధిస్తోంది.
ఇలా ఇద్దరు లెజెండరీ నటులు మళ్లీ కలిసి రావడం మలయాళ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించినట్లే. ఒకే సినిమాలో మమ్ముట్టి గాంభీర్యం, మోహన్‌లాల్ ఈజ్ చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. `పేట్రియాట్` కేవలం ఒక స్పై థ్రిల్లర్ మాత్రమే కాదు. ఇద్దరు సూపర్ స్టార్ల కలయికకు అది ఒక చిహ్నం. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
