Begin typing your search above and press return to search.

హిట్ సినిమాల కథా చర్చలకు వేదికైన భవనం!

మలయాళ చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన విజయాలకు వేదికగా నిలిచిన భవనం ఇప్పుడు సరికొత్త రూపంలో సందర్శకులను ఆకట్టుకుంటోంది.

By:  Srikanth Kontham   |   2 Oct 2026 6:00 PM IST
హిట్ సినిమాల కథా చర్చలకు వేదికైన భవనం!
X

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి సంబంధించిన ఓ అరుదైన జ్ఞాపకం ఆయన అభిమానులకు, పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. కొచ్చిలోని పనంపిల్లి నగర్ ప్రాంతంలో ఉన్న మమ్ముట్టి పాత‌ నివాసం తాజాగా ఓ లగ్జరీ హోమ్‌‌స్టేగా రూపాంతరం చెందింది. దశాబ్దాల పాటు మ‌మ్ముట్టి నివసించిన ఇల్లు, ఆయన సినీ ప్రయాణంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మలయాళ చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన విజయాలకు వేదికగా నిలిచిన భవనం ఇప్పుడు సరికొత్త రూపంలో సందర్శకులను ఆకట్టుకుంటోంది.

మమ్ముట్టి కుటుంబం ఇల్లును విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మారినా? ఈ భవనానికి ఉన్న చారిత్రక - భావోద్వేగ విలువలను కాపాడే ఉద్దేశంతో యజమానులు దీన్ని హోమ్‌స్టేగా మార్చాలని నిర్ణయించారు. మమ్ముట్టి లాంటి లెజెండరీ హీరో అడుగుపెట్టి.. ఆయన జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన ప్రదేశంలో గడపాలని కోరుకునే సినీ ప్రేమికులకు ఇది ఓ అద్భుతమైన అవకాశం. ఇంటిని సందర్శించడం ద్వారా అభిమానులు మెగాస్టార్ జీవనశైలికి -నాటి జ్ఞాపకాలకు దగ్గరగా అనుభూతి చెందొచ్చు.

ఈ హోమ్‌స్టేను కేవలం బస చేసే ప్రదేశంలా కాకుండా మమ్ముట్టి నట జీవితం , ఆయనకు సంబంధించిన అరుదైన జ్ఞాపకాలకు ప్రతీకగా తీర్చిదిద్దారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో పాత కాలపు కేరళ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేస్తూనే ఆధునిక వసతులను కల్పించారు. మెగాస్టార్ అభిమానులు , పర్యాటకులు ఇక్కడ బస చేస్తూ ఆనాటి వాతావరణాన్ని ఆస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ ఇంటికి కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారత సినిమా చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఎంతోమంది ప్రముఖ దర్శకులు, నటులు, నిర్మాతలు ఇంటికి వచ్చి మమ్ముట్టితో కథా చర్చలు జరిపారు. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన ఎన్నో చిత్రాల స్క్రిప్ట్‌లు ఈ గోడల మధ్యే చర్చకు వచ్చాయి. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రదేశంలో గడపడం ప్రతి అభిమానికి పరుపురాని అనుభూతిని ఇస్తుంది.

ప్రస్తుతం ఈ ఇల్లు సోషల్ మీడియాలో - టూరిజం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. కేరళను సందర్శించే టూరిస్టులు, మమ్ముట్టి డై-హార్డ్ ఫ్యాన్స్ హోమ్‌స్టేను బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేరళ టూరిజంలో ఇదొక కొత్త ల్యాండ్‌మార్క్‌‌గా మారుతుండటం విశేషం.

సాధారణ ఇల్లుగా ప్రారంభమై మెగాస్టార్ నివాసంగా చారిత్రక ప్రసిద్ధి గాంచిన భవనం ఇప్పుడు హోమ్‌స్టే రూపంలో మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. మమ్ముట్టి అభిమానులకు తమ అభిమాన నటుడి జ్ఞాపకాలను ప్రత్యక్షంగా తాకే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ ప్రదేశం, కొచ్చి నగరంలో తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తోంది.