అది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికే సాధ్యం!
కానీ కొంత మంది మాత్రమే సీనియారిటీ పెరుగుతున్నా..వయసు పైబడుతున్నా.. తమ స్టార్ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతుంటారు.
By: Tupaki Entertainment Desk | 17 Jan 2026 3:00 PM ISTఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్స్ అవుతున్నా కొద్దీ స్టార్స్ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఎక్కువ రిస్క్ లేని కథలని ఎంచుకుంటూ హిట్టు కొట్టామా.. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశామా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టామా? అన్నది మాత్రమే చూసుకుంటూ లైమ్‌లైట్‌లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. సేఫ్ జోన్ వదిలి ప్రయోగాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు.. ఆ సాహసం చేయలంటేనే భయపడతారు. కానీ కొంత మంది మాత్రమే సీనియారిటీ పెరుగుతున్నా..వయసు పైబడుతున్నా.. తమ స్టార్ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతుంటారు.
అలాంటి హీరోనే మమ్ముట్టి.. మలయాళ ఇండస్ట్రీలో ఆయనో మెగాస్టార్. ఆయన చేయని జోనర్ లేదు.. టచ్ చేయని క్యారెక్టర్ లేదు. ఓ నటుడిగా మమ్ముట్టి క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, హారర్ థ్రిల్లర్, కామెడీ, లవ్ స్టోరీస్.. ఇలా అన్ని రకాల జోనర్‌లని టచ్ చేస్తూ సినిమాలు చేశారు. స్టార్‌గా దశాబ్దాల పాటు మలయాళ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ఆయన గత కొంత కాలంగా ప్రయోగాలకు శ్రీకారం చుట్టి సమకాలీన స్టార్లకు దడ పుట్టిస్తున్నారు. తనదైన మార్కు ప్రయోగాలతో సంచలనం సృష్టిస్తున్నారు.
రాక్షసుడు, మాడా తరహా పాత్రలతో పాటు సైకో క్యారెక్టర్ లు కూడా చేస్తూ సీనియర్ స్టార్లకు ఛాలెంజ్ విసురుతున్నారు. `భ్రమయుగం` మూవీలో తాంత్రికుడిగా రాక్షసుడి పాత్రలో నటించి షాక్ ఇచ్చిన మమ్ముట్టి తన యాక్టింగ్ కెరీర్‌లోనే అత్యుత్తమమైన నటనని ప్రదర్శించి సమకాలీన స్టార్లని ఆశ్చర్యానికి గురి చేశారు. అంతకు ముందు జ్యోతికతో కలిసి చేసిన `కాదల్ ది కోర్`లో మాడా తరహా క్యారెక్టర్‌లో నటించి అందరిని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా ఓ సంచలనంగా నిలిచింది.
టాలీవుడ్, కోలీవుడ్, సాండల్ వుడ్ ఇండస్ట్రీల్లోని సీనియర్ స్టార్లు ఇప్పటికీ హీరోలుగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో మమ్ముట్టి మాత్రం వారందరికి భిన్నంగా ప్రయోగాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న మమ్ముట్టి ఈ సారి మరో అడుగు ముందుకేసి మరో ప్రయోగం చేశారు. సమకాలీన హీరోలు ఎవరూ కూడ చేయడానికి, సాహసం చేయడానికి కూడా ఆలోచన చేయని క్యారెక్టర్‌లో నటించి షాక్ ఇచ్చారు. మమ్ముట్టి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ `కలాంకావల్`.
ఇందులో మమ్ముట్టి సీరియల్ సైకో కిల్లర్ క్యారెక్టర్‌లో నటించారు. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్.ఐ. స్టాన్లీ దాస్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్న మమ్ముట్టి సైకో కిల్లర్‌గా తనదైన మార్కు నటనతో అందరిని అబ్బురపరుస్తున్నారు. మహిళలని హత్య చేస్తూ సాగే సైకో క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించి మెప్పించారు. కొత్త తరహా పాత్రలని చేయడానికే ఆయన లాంటి సీనియర్ స్టార్లు భయపడుతున్న తరుణంలో మెగాస్టార్ అయిఉండి సైకో క్యారెక్టర్ చేయడం చూసి అంతా విస్తూ పోతున్నారు. ఈ తరహా ప్రయోగాలు చేయడం ఆయనకే సాధ్యమని మమ్ముట్టిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
