తమిళ తంబీలకు ఇచ్చి పడేసిన మాలీవుడ్ బ్యూటీ!
భారతీయ చిత్ర పరిశ్రమలో భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒక భాషా నటులు మరో భాషలో రాణించడం సర్వసాధారణమైంది.
By: Srikanth Kontham | 26 April 2026 7:00 AM ISTభారతీయ చిత్ర పరిశ్రమలో భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒక భాషా నటులు మరో భాషలో రాణించడం సర్వసాధారణమైంది. అయితే ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో మలయాళ నటుల ఆధిపత్యం పెరుగుతోందని స్థానిక నటులకు అవకాశాలు తగ్గుతున్నాయని సోషల్ మీడియాలో కొంత చర్చ నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు ఘాటుగా స్పందించింది. నటులను భాషా ప్రాతిపదికన చూడటం కంటే వారి ప్రతిభను బట్టి చూడటం ముఖ్యమని అభిప్రాయపడింది. తమిళ సినిమాల్లో మలయాళ నటులను తీసుకోవడంపై వస్తోన్న విమర్శలను సున్నితంగా తిప్పికొట్టింది.
సినిమా అనేది కళారూపమని దానికి ఎల్లలు ఉండవంది. ఒక పాత్రకు ఎవరు సరిపోతారో? దర్శకులు నిర్ణయిస్తారని అది కేవలం నటనకు సంబంధించిన విషయమే తప్ప ప్రాంతీయతకు కాదని అభిప్రాయపడింది. ప్రతిభ ఉన్న ఎవరైనా ఎక్కడైనా రాణించొచ్చు అంది. ఇది పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని, నాణ్యతను పెంచుతుందని వివరించింది. సినిమా రంగంలో సరిహద్దులను చెరిపేయడమే అసలైన విజయమని మమితా భావిస్తోందని ఆమె మాటలే స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తోన్న తరుణంలో నటులు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి విభిన్న భాషల్లో నటించడంతో కొత్త రకమైన కంటెంట్ పుట్టుకొస్తుందని తెలిపింది.
మలయాళ నటులు తమిళంలో నటించడం వల్ల రెండు పరిశ్రమల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అభిప్రాయపడింది. మమితా బైజు మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన నటి అన్న సంగతి తెలిసిందే. `ప్రేమలు` సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. అమ్మడి నటనకు, హావభావాలకు భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నటుడికి ప్రేక్షకుల ప్రేమ లభించినప్పుడు వారు ఏ భాషకు చెందిన వారు అనేది అనవసరమైన చర్చగా పేర్కొంది. భాష, ప్రాంతం ఇంకా ఏవోవో? అనుకుంటే వాటితో సాధించేది ఏదీ ఉండదని చెప్పుకొచ్చింది.
ప్రతిభను గుర్తించే విషయంలో దక్షిణాది ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని కొనియాడింది. పరిశ్రమలో వస్తోన్న మార్పులను సానుకూల దృక్పథంతో చూడాలని కోరింది. మలయాళ నటులే కాదు, తమిళ నటులు కూడా మలయాళంలో లేదా తెలుగులో నటిస్తున్నారని ఇది ఆయా పరిశ్రమలకు మంచి వాతావరణం కల్పించడం లాంటిందంది. సినిమాల నాణ్యత పెరగడానికి, విభిన్న రకాల కథలు రూపొందడానికి ఇలాంటి క్రాస్-కల్చరల్ కాస్టింగ్ ఎంతో అవసరమని నొక్కి చెప్పింది. ఈ అంశంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా చాలా మంది నటులు ఎంతో పాజిటివ్ గా స్పందించారు. అన్ని భాషల నటులు కలిసి పనిచేసినప్పుడే మంచి చిత్రాలతో పాటు మార్కెట్ కూడా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
