Begin typing your search above and press return to search.

రూ.15 కోట్ల రెమ్యూనరేషన్‌... హీరోయిన్‌ రియాక్షన్‌

అంతకు ముందు చాలా కాలం నుంచే మమిత సినిమాలు చేస్తున్నప్పటికీ మలయాళ సినిమా ఇండస్ట్రీ వరకే పరిమితం అయింది.

By:  Ramesh Palla   |   26 Oct 2025 11:18 AM IST
రూ.15 కోట్ల రెమ్యూనరేషన్‌... హీరోయిన్‌ రియాక్షన్‌
X

'ప్రేమలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మమిత బైజు. అంతకు ముందు చాలా కాలం నుంచే మమిత సినిమాలు చేస్తున్నప్పటికీ మలయాళ సినిమా ఇండస్ట్రీ వరకే పరిమితం అయింది. కానీ ఎప్పుడైతే మమిత బైజు మలయాళ మూవీ 'ప్రేమలు' సినిమాతో వచ్చిందో అప్పటి నుంచి సౌత్‌లో అన్ని భాషల్లోనూ ఈమెకు గుర్తింపు దక్కింది. ప్రస్తుతం మలయాళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, తమిళ సినిమాలు సైతం చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈమె తమిళ మూవీ డ్యూడ్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా రూపొందిన ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ వారు నిర్మించారు. డ్యూడ్‌ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించినందుకు గాను ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం అందుకుంది అనే వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలోనూ ఆ విషయమై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆకర్షించింది.

మమిత బైజు భారీ పారితోషికం

సాధారణంగా హీరోల, హీరోయిన్స్ పారితోషికాల గురించి సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం కామన్‌ విషయం. కానీ జాతీయ మీడియా సంస్థలు సైతం మమిత బైజు యొక్క పారితోషికం రూ.15 కోట్లు అంటూ కథనాలు ప్రసారం చేయడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది. బాలీవుడ్‌ హీరోయిన్స్ స్థాయిలో మమిత బైజు పారితోషికం అందుకుంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సౌత్ లో హీరోయిన్స్‌ సైతం నిజమేనా అన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఇప్పటి వరకు సౌత్‌ లో హీరోయిన్స్ పారితోషికం రూ.5 కోట్లను భారీ పారితోషికంగా అంటూ ఉంటారు. అలాంటిది డ్యూడ్‌ సినిమాకు మాత్రమే కాకుండా మరో సినిమాకు కూడా మమిత రూ.15 కోట్ల పారితోషికం అందుకుంది అంటూ వచ్చిన వార్తలు అందరికి షాక్ ఇచ్చాయి. మీడియాలో జరుగుతున్న ప్రచారం పై మమిత బైజు స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చింది.

డ్యూడ్‌ సినిమా కోసం ఆమె రెమ్యూనరేషన్‌

మమిత బైజు ఇటీవల ఒక ప్రకటనలో స్పందిస్తూ.. డ్యూడ్‌ సినిమా కోసం నేను రూ.15 కోట్ల పారితోషికం అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయని నాకు కొందరు లింక్‌ లు పంపిస్తే తెలిసింది. నేను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. ఆ వ్యాఖ్యలు, ఆ కథనాలు చూసి నేను షాక్ అయ్యాను. చాలా మంది ఆ పుకార్లను నమ్ముతున్నారు. సౌత్ ఇండియాలో ఆ స్థాయి పారితోషికం తీసుకోవడం రికార్డ్‌ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ కథనాలు పూర్తిగా అవాస్తవం. నేను అంత పారితోషికం తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు, నన్ను అంత పెద్ద హీరోయిన్‌గా అనుకుంటున్నారా లేదంటే అంత ఎక్కువగా డిమాండ్‌ చేస్తున్న హీరోయిన్‌గా అనుకుంటున్నారా నాకు అర్థం కావడం లేదు అంటూ మమిత పారితోషికం కథనాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వార్తలను ఖండించింది.

ప్రదీప్ రంగనాథన్‌ హీరోగా డ్యూడ్‌ సినిమా..

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పారితోషికం భారీగా పెరిగిన విషయం తెల్సిందే. అయితే స్టార్‌ హీరోల సినిమాల్లో, స్టార్‌ హీరోయిన్స్‌ పోషించే పాత్రలకు కాస్త ఎక్కువ పారితోషికం దక్కడం సహజం. కానీ మమిత వంటి మిడియం రేంజ్ హీరోయిన్‌కి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అనేది కచ్చితంగా అవాస్తవం. ఆమె ఈ విషయం గురించి స్పందించకున్నా కూడా చాలా మంది ఆ వార్తలు అవాస్తవం అయ్యి ఉంటాయి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ లో ఒక్కరు ఇద్దరు మాత్రమే రూ.10 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. అది కూడా చాలా చాలా అరుదుగా మాత్రమే. ఇప్పటి వరకు ఆ మొత్తం తీసుకుంటున్నట్లుగా కూడా అధికారికంగా క్లారిటీ లేదు. వందల కోట్ల పారితోషికం తీసుకునే హీరోలు ఉన్నారు కానీ, సౌత్‌ లో పదుల కోట్ల పారితోషికం తీసుకునే హీరోయిన్స్‌ లేరనేది వాస్తవం. కనుక ముందు ముందు కూడా ఇలాంటి కథనాలు వస్తే నమ్మనక్కర్లేదు.