Begin typing your search above and press return to search.

మూడు ఇండస్ట్రీల్లో 'ప్రేమలు' బ్యూటీ.. వరుస హిట్లు పడితే..

ప్రేమలుతో యూత్ హార్ట్‌ బీట్‌ గా మారిన ఆ మలయాళ బ్యూటీ, ఇప్పుడు తమిళం, తెలుగు, మలయాళం ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.

By:  M Prashanth   |   22 July 2026 11:38 AM IST
మూడు ఇండస్ట్రీల్లో ప్రేమలు బ్యూటీ.. వరుస హిట్లు పడితే..
X

ఒక హిట్ పడితే అవకాశాలు వస్తాయి. కానీ ఒకే సినిమా తర్వాత మూడు ఇండస్ట్రీల్లో వరుసగా అవకాశాలు దక్కి, నెల రోజుల వ్యవధిలో మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా రేర్. ఇప్పుడు ఆ ప్రత్యేకతను సొంతం చేసుకున్న నటి మమితా బైజు. ప్రేమలుతో యూత్ హార్ట్‌ బీట్‌ గా మారిన ఆ మలయాళ బ్యూటీ, ఇప్పుడు తమిళం, తెలుగు, మలయాళం ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.

ప్రేమలు సినిమా విడుదలకు ముందు వరకు మమితా బైజు పేరు ప్రధానంగా మలయాళ ప్రేక్షకులకే తెలుసు. అయితే 2024లో విడుదలైన ఆ రొమాంటిక్ కామెడీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె క్రేజ్ ఫుల్ గా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రీను పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఆ ఒక్క సినిమా మమితా కెరీర్‌ కు పూర్తిగా టర్నింగ్ పాయింట్‌ గా నిలిచింది.

ఇప్పుడు మమితా వరుసగా మూడు భాషల్లో సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ముందుగా జూలై 23న దళపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు రావడం మమితాకు మరింత గుర్తింపు తీసుకురానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ తర్వాత ఆగస్టులో సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ చిత్రం మమితాకు స్ట్రెయిట్ తెలుగు డెబ్యూగా నిలవనుంది. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సూర్య సరసన నటించే అవకాశం రావడం కూడా ఆమె కెరీర్‌ లో మంచి ఛాన్స్. తెలుగు ప్రేక్షకులు ప్రేమలు తర్వాత మమితాను పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఆ రెండు సినిమాల తర్వాత కేవలం వారం రోజుల వ్యవధిలోనే మలయాళ చిత్రం బెత్లెహెం కుటుంబం విడుదల కానుంది. నివిన్ పాలీ హీరోగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు ప్రేమలు దర్శకుడు గిరీష్ ఏ.డి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో మమితా మళ్లీ తన హోం ఇండస్ట్రీలో కూడా సందడి చేయనుంది. ఇలా చూస్తే, నెల రోజుల వ్యవధిలో మూడు ఇండస్ట్రీల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం మమితా బైజుకు రేర్ ఫీట్ గా చెప్పొచ్చు.

ఆ మూడు చిత్రాలు హిట్స్ అయితే ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌ గా మరింత స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సహాయ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన మమితా బైజు, ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ తన జర్నీని కొత్త రేంజ్ కు తీసుకెళ్లింది. ప్రేమలు ఇచ్చిన గుర్తింపును ఆమె ఎంతలా యూజ్ చేసుకుంటుందో రానున్న కొన్ని వారాల్లోనే తేలిపోనుంది. అయితే ప్రస్తుతం మాత్రం మూడు ఇండస్ట్రీల్లో మమితా పేరు గట్టిగా వినిపిస్తుండడం విశేషం.