Begin typing your search above and press return to search.

సహ్యాద్రి కొండ ప్రాంతంలో న‌టి జీవ‌నం!

బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి అటుపై అకస్మాత్తుగా వెండితెరకు దూరమైన నటీమణులలో మాలిని శర్మ ఒకరు.

By:  Srikanth Kontham   |   26 Aug 2026 1:00 AM IST
సహ్యాద్రి కొండ ప్రాంతంలో న‌టి జీవ‌నం!
X

బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి అటుపై అకస్మాత్తుగా వెండితెరకు దూరమైన నటీమణులలో మాలిని శర్మ ఒకరు. 2000ల ప్రారంభంలో మ్యూజిక్ వీడియోలు, మోడలింగ్, టీవీ షోలు , సినిమాల ద్వారా మాలిని యువతను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన `రాజ్` చిత్రంలోని `ఆప్కే ప్యార్ మేయిన్` పాటతో ఆమె ఇంటి పేరే మారిపోయింది. చార్లీస్ ఏంజిల్స్ స్ఫూర్తితో వచ్చిన `క్యాట్స్` అనే టెలివిజన్ ధారావాహికలోనూ కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే మాలిని అకస్మాత్తుగా సినిమాల నుంచి తప్పుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్ప‌ట్లోనే నటుడు ప్రియాన్షు ఛటర్జీతో మాలిని వివాహం జరగడం.. ఆ తర్వాత కొంత‌ కాలానికే విడాకులు తీసుకోవడం జరిగింది. కెరీర్ పరంగా ఎదుగుతున్న తరుణంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన మార్పులు, కెమెరా వెనుక పనిచేయాలనే ఆసక్తి వంటి కారణాల వల్ల మాలినీ శ‌ర్మ క్రమంగా చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు.

పరిశ్రమను విడిచిపెట్టిన మాలిని శర్మ జీవితంలో పూర్తి భిన్నమైన .. ప్రశాంతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ముంబై నగరపు రద్దీ జీవితానికి స్వస్తి చెప్పి ప్రకృతి ఒడిలో సాదాసీదా జీవనాన్ని గడపడం ప్రారంభించారు. స్థానిక ఆహార సంస్కృతి, చేతివృత్తులు , ప్రకృతి ఆధారిత జీవనశైలిని ప్రోత్సహించే `ది స్లో లోకల్` అనే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం మాలినీ శ‌ర్మ పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల ప్రాంతంలో ఓ అందమైన పార్మ్ హౌస్ లోనే జీవనం సాగిస్తున్నారు. పూర్తిగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ స్వయంగా కూరగాయలు పండించడంతో పాటు వచ్చిన అతిథులకు తానే స్వయంగా వంట చేసి పెడుతున్నారు. ఆ ప్రాంతాన్ని తన సొంత చిన్న అడవిగా అభివర్ణిస్తారు. అక్కడి చెట్లు, పక్షులు , పచ్చదనం మధ్య ఎంతో సంతృప్తికరమైన ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.

ఇటీవల కాలంలో `ది స్లో లోకల్ డైరీస్` పేరుతో సోషల్ మీడియా వేదికగా తిరిగి కెమెరా ముందుకు వచ్చి తన దైనందిన జీవితాన్ని మాలిని పంచుకుంటున్నారు. సుమారు 23 ఏళ్ల విరామం తర్వాత ఎలాంటి మేకప్ లేకుండా అత్యంత సహజసిద్ధంగా మాలిని జీవిస్తున్న విధానాన్ని ప్రేక్షకులతో పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రయాణంలో గ్లామర్ హంగుల కంటే మనశ్శాంతి, ప్రకృతితో మమేకం కావడమే తనకు అసలైన ఆనందాన్ని ఇస్తోందని నిరూపిస్తున్నారు.

ఈ మార్పు మాలిని శ‌ర్మ వ్యక్తిగత జీవితానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చినా? ఒక ప్రతిభావంతురాలైన నటి వెండితెరకు పూర్తిగా దూరమవడం అభిమానులను ఇప్పటికీ బాధిస్తుంది. ప్రఖ్యాత నటిగా రాణించిన వ్యక్తి, అన్నింటినీ వదిలి ప్రకృతి ఒడిలో ప్రశాంత జీవనాన్ని ఎంచుకోవడం అరుదైన .. స్ఫూర్తిదాయకమైన నిర్ణయంగా చెప్పొచ్చు.