తండ్రి ఆశయాల కోసం రంగంలోకి తనయుడు!
సినీ ప్రముఖుల వారసులు వెండితెరపై నటనలో రాణించడమో? లేదా పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను నిర్వహించడమో? చూస్తుంటాం.
By: Srikanth Kontham | 9 Oct 2026 1:00 PM ISTసినీ ప్రముఖుల వారసులు వెండితెరపై నటనలో రాణించడమో? లేదా పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను నిర్వహించడమో? చూస్తుంటాం. గ్లామర్, కీర్తి ప్రతిష్ఠలు, కోట్ల వ్యాపారాల వైపు అడుగులు వేయడం వారసులకు సహజంగా మారిన నేటి కాలంలో నానా పటేకర్ తనయుడు మల్హర్ పటేకర్ మాత్రం అరుదైన, అత్యంత ప్రశంసనీయమైన బాటను ఎంచుకున్నారు. తండ్రి అందించిన సినీ గ్లామర్‌ను పక్కనబెట్టి ఆయన ప్రాణసమానంగా భావించిన సామాజిక సేవారంగాన్ని తన భుజస్కంధాలపై ఎత్తుకోవడానికి మల్హర్ ముందుకు రావడంపై సర్వత్రాప్రశంసల జల్లు కురుస్తోంది.
నానా పటేకర్ వెండితెరపై విలక్షణ నటనతో అలరించిన నటుడు మాత్రమే కాదు.. కష్టాల్లో ఉన్న ఎంతోమంది పేదలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు అభయమిచ్చిన ప్రజాబంధువు. మరాఠ్వాడా లాంటి కరువు పీడిత ప్రాంతాలలో నీటి ప్రాజెక్టులు నిర్మించారు. `నామ్ ఫౌండేషన్` ద్వారా వేలాది మంది రైతుల కుటుంబాలకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నటుడిగా సాధించిన అవార్డుల కంటే రైతుల కళ్లలో చూసిన ఆనందమే తనకు నిజమైన తృప్తిని ఇచ్చిందని నానా పటేకర్ ఎప్పుడూ చెబుతుండేవారు. సమాజానికి ఇంకా ఎంతో చేయాలనే తపన ఆయనలో చివరి శ్వాస వరకు రగిలిపోతూనే ఉంది.
ఇప్పుడు ఆ దిగ్గజ నటుడు కన్న కలలను, తీరని ఆశయాలను స్వీకరించి పూర్తి చేసే బృహత్తర బాధ్యతను నానా తనయుడు మల్హర్ పటేకర్ స్వీకరించారు. `నానాసాహెబ్ భౌతికంగా దూరమైనా ఆయన చేసిన సేవలు, సాధించిన విజయాల రూపంలో ఎప్పటికీ అమరుడే.. నాన్న లేరనే చేదు నిజాన్ని నేను అంగీకరిస్తే నా ఉనికికే అర్థం ఉండదు` అంటూ మల్హర్ భావోద్వేగ మాటలు అందరి హృదయాలను కదిలించాయి. తండ్రి వదిలివెళ్లిన ఆశయాల బాటలోనే నడుస్తూ ఆయన కన్న సామాజిక కలలను నిజం చేయడమే తన జీవిత లక్ష్యమని మల్హర్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో తండ్రి స్థాపించిన `నామ్ ఫౌండేషన్` తో పాటు `నిర్మలా గజానన్ ఫౌండేషన్` బాధ్యతలను మల్హర్ స్వీకరించి రంగంలోకి దిగారు. మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల సంక్షేమం, జల సంరక్షణ ప్రాజెక్టులతో పాటు కాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఉచిత వైద్యం, పిల్లలకు నాణ్యమైన విద్యనందించే కార్యక్రమాలను ఏమాత్రం ఆటంకం లేకుండా కొనసాగిస్తామని ప్రకటించారు. సమాజ సేవ అనేది తాత్కాలికంగా చేసేది కాదని.. తండ్రి వేసిన బలమైన పునాదులపై సేవా సామ్రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.
విశేషమేమిటంటే? నానా పటేకర్ తుది శ్వాస విడవడానికి ముందే ఈ సంస్థల భవిష్యత్తు ప్రణాళికలపై పక్కా స్పష్టతనిచ్చారు. తను లేకపోయినా సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో ముందే కేటాయించారు. తండ్రి నేర్పిన క్రమశిక్షణ, స్పష్టమైన మార్గదర్శకత్వమే ఇప్పుడు మల్హర్‌కు దిక్సూచిగా మారింది. అలాగే నానా పటేకర్ ఆశయాలకు, నామ్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక కార్యక్రమాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇవ్వడం ఈ ప్రయాణానికి మరింత బలాన్ని చేకూర్చింది.
సాధారణంగా నటుల వారసత్వం అంటే సినిమాల కలెక్షన్లు, బాక్సాఫీస్ రికార్డుల గురించే చర్చ జరుగుతుంది. కానీ నానా పటేకర్ వదిలివెళ్లిన మానవత్వపు వారసత్వాన్ని స్వీకరించి, పేదల కన్నీళ్లు తుడిచేందుకు సిద్ధమైన మల్హర్ పటేకర్ నిజమైన కథానాయకుడిగా నిలిచారు. కోట్లాది రూపాయల ఆస్తుల కంటే సమాజం నుంచి పొందే ప్రేమాభిమానాలే గొప్పవని చాటిచెప్పిన నానా పటేకర్‌కు తనయుడు మల్హర్ ఇస్తున్న నిజమైన నివాళి ఇది. తండ్రి ఆశయాల కోసం రంగంలోకి దిగిన మల్హర్ ప్రయాణం నేటి యువతరానికి, ముఖ్యంగా సినీ వారసులకు ఎంతో స్ఫూర్తిదాయకం.
