Begin typing your search above and press return to search.

లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామ‌ని ఒప్పుకున్న టాప్-5 మేల్ స్టార్స్

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదా లైంగిక వేధింపులు అనగానే సాధారణంగా మహిళా నటుల అనుభవాలే ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి.

By:  Sivaji Kontham   |   2 Aug 2026 10:19 AM IST
లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామ‌ని ఒప్పుకున్న టాప్-5 మేల్ స్టార్స్
X

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదా లైంగిక వేధింపులు అనగానే సాధారణంగా మహిళా నటుల అనుభవాలే ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి. అయితే ఈ రకమైన చేదు అనుభవాలు కేవలం మహిళలకే పరిమితం కాదని, మేల్ నటులు కూడా తమ కెరీర్ ప్రారంభంలో లైంగిక వేధింపులకు గురయ్యారని పలువురు బహిరంగంగా వెల్లడించారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా నటనపై ఆసక్తితో పరిశ్రమలోకి వచ్చే కొత్త నటులకు ఇలాంటి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. సమాజంలో ఉన్న అపోహలను పటాపంచలు చేస్తూ..తమకు ఎదురైన పరాభవాలను ధైర్యంగా ప‌బ్లిగ్గా చెప్పిన‌ ఐదుగురు ప్రముఖ మేల్ నటుల వివరాల్లోకి వెళితే....

న‌టుడు విజయ్ వర్మ:

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాతో ప్రేమాయ‌ణం కార‌ణంగా బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ గురించి తెలుగు స‌ర్కిల్స్ కి కూడా బాగా తెలుసు. గల్లీ బోయ్, డార్లింగ్స్, దహాద్ వంటి చిత్రాలతో వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ వర్మ తాను కూడా మోడ‌లింగ్ చేసే రోజుల్లో వేధింపులు ఎదుర్కొన్నాన‌ని తెలిపారు హైద‌రాబాద్ లో మోడ‌లింగ్ చేస్తున్న స‌మ‌యంలో త‌న‌కు ఈ ఘ‌ట‌న ఎదురైంద‌ని అన్నారు. మోడ‌లింగ్ కోఆర్డినేట‌ర్ త‌ప్పుగా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని.. త‌న‌ను ప‌దే ప‌దే అస‌భ్యంగా తాకాల‌ని చూసాడ‌ని తెలిపారు. ఆ సంఘటనతో తీవ్రంగా నిరాశ చెందినా.. అధైర్యపడకుండా నటన వైపే అడుగులు వేశానని చెప్పారు. ఆ తర్వాత నాటక రంగంలో FTII (ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ప్రవేశ పరీక్షల్లో తిరస్కరణలు ఎదుర్కొని...చివరకు తన పట్టుదలతో నటుడిగా గుర్తింపు సాధించారు.

ఆయుష్మాన్ ఖురానా:

బాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయుష్మాన్ ఖురానా కూడా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బహిరంగంగా చెప్పారు. తాను అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలో ఒక ప్ర‌ముఖ కాస్టింగ్ ఏజెంట్ త‌న కామ కోరిక‌లు తీర్చ‌మ‌ని ప్రెజర్ చేసాడ‌ని తెలిపారు. ఛాన్సిస్తాను కోరిక తీర్చ‌మ‌ని అడిగాడ‌ని వెల్ల‌డించారు. తాను ఆ ప్రతిపాదనను వినయంగా తిరస్కరించి.. అక్కడ నుండి బయటకు వచ్చేశానని.. ఆ తర్వాత సొంత ప్రతిభపైనే ఆధారపడి చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎదిగానని తెలిపారు.

రణ్‌వీర్ సింగ్

తనదైన ఎన‌ర్జిటిక్ నటనతో బాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఒక వింతైన - భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఒక ప్రొడ్యూసర్ (కాస్టింగ్ ప్రొఫెషనల్) తనను ఒక ప్రైవేట్ ప్రదేశానికి పిలిపించి అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా... పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఇలాంటివి తప్పవని మానసికంగా ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడని రణ్‌వీర్ చెప్పారు. అయితే తాను దానికి లొంగకుండా ఆ అవకాశాన్ని వదులుకున్నానని.. ప్రతిభ మాత్రమే విజయానికి మార్గమని నమ్మి ముందడుగు వేశానని ఆయన పేర్కొన్నారు.

విశాల్:

కోలీవుడ్ - టాలీవుడ్‌లలో మంచి గుర్తింపు పొందిన కథానాయకుడు విశాల్.., సినీ పరిశ్రమలో వేధింపులు కేవలం మహిళలకే కాక పురుషులకు కూడా ఎదురవుతాయని స్పష్టం చేశారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో మేల్ నటులు , సాంకేతిక నిపుణులు కూడా కాస్టింగ్ కౌచ్‌ బారిన పడుతున్నారని అనేక సందర్భాల్లో మాట్లాడారు. నటులుగా అవకాశాలు ఇస్తామని చెప్పి కొందరు కాస్టింగ్ ప్రతినిధులు కొత్త‌ నటుల నుండి లైంగిక లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారని... తమ కెరీర్ పాడవుతుందనే భయంతో చాలామంది మేల్ న‌టులు ఈ విషయాలను బయటకు చెప్పలేకపోతున్నారని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియదర్శి:

పెళ్లి చూపులు చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన హైద‌రాబాదీ న‌టుడు ప్రియ‌ద‌ర్శి కూడా ఇలాంటి ఒక చేదు జ్ఞాప‌కాన్ని ఎదుర్కొన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఒక బహిరంగ వేదిక‌పైనే ఓపెన‌య్యారు. తాను సినీ రంగానికి రాకముందు ఒక వ్యక్తి ప్రొడక్షన్ కంపెనీ పేరుతో తనను సంప్రదించి అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడని వెల్లడించారు. పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకోవడానికి పడే తపనను కొందరు వ్యాపారంగా మార్చుకుని దుర్వినియోగం చేస్తారని.. ఇలాంటి సంఘటనలు యువ నటులను మానసికంగా కుంగదీస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ అనుభవాలు తట్టుకుని నిలబడినప్పుడే అసలైన విజయం లభిస్తుందని ప్రియదర్శి పేర్కొన్నారు.