హీరో విజయ్ కి పోలీసులు హెచ్చరిక..
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో..తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలోని కౌలా లంపూర్లో ఈనెల 27న నిర్వహించనున్నారు.
By: Madhu Reddy | 25 Dec 2025 12:05 AM ISTఈ మధ్యకాలంలో రాజకీయాలలోకి ప్రవేశించిన కొంతమంది హీరోలు తమ సినిమా ఈవెంట్స్ వేదికగా రాజకీయాల గురించి మాట్లాడుతూ.. లేనిపోని విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మరికొంతమంది హీరోలు మాట్లాడే రాజకీయ మాటలు పలు వివాదాలకు కూడా దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇకపై అలాంటివి జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే హీరో విజయ్ కి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కోలీవుడ్ లో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి.. తమిళనాడులో టీవీకే అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ ద్వారా వచ్చే ఎన్నికలలో పోటీ చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి వరుస సినిమాలు కూడా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం జననాయగన్.. తెలుగులో జననాయకుడు పేరుతో విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో..తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలోని కౌలా లంపూర్లో ఈనెల 27న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పోలీసులు ఈవెంట్ పై పలు ఆంక్షలు విధిస్తూ ఆడియో లాంచ్ లో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడవద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ విషయానికొస్తే.. కౌలాలంపూర్ లోని బుకిట్ జలీల్ స్టేడియంలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ కి కొన్నివేల మంది అభిమానులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఇకపోతే ఇప్పటికే రాజకీయాలలో కొనసాగుతున్న విజయ్ అభిమాలను ఉద్దేశించి ఏదైనా రాజకీయ వ్యాఖ్యలు చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే అప్రమత్తమైన రాయల్ మలేషియా పోలీసులు ఇటు రాజకీయ ప్రసంగాలు, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు అక్కడి స్థానిక మీడియా స్పష్టం చేసింది. ఏది ఏమైనా మలేషియా పోలీసులు తీసుకున్న నిర్ణయానికి సినిమా ప్రేక్షకులు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు మంచిదే ఇలాంటి జాగ్రత్తల వల్ల భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడానికి వీలు ఉండదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
జననాయగన్ సినిమా విషయానికొస్తే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ , బాబీ డియోల్ , ప్రియమణి, మమిత బైజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటించి.. మంచి విజయం అందుకున్న భగవంత్ కేసరి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్నట్లు కోలీవుడ్లో వార్త వినిపిస్తోంది. కానీ దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అలాగే ఈ చిత్రాన్ని హిందీలో కూడా జననేత అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా విజయ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
