Begin typing your search above and press return to search.

హంతకుడిగా మోహన్ లాల్.. అంగీకారమేనా?

ప్రముఖ మలయాళ స్టార్ మోహన్ లాల్ హంతకుడిగా మారబోతున్నారు అనే వార్త సంచలనం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈమధ్య ట్రెండ్ బాగా మారిపోయిన విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   9 Sept 2025 8:15 AM IST
హంతకుడిగా మోహన్ లాల్.. అంగీకారమేనా?
X

ప్రముఖ మలయాళ స్టార్ మోహన్ లాల్ హంతకుడిగా మారబోతున్నారు అనే వార్త సంచలనం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈమధ్య ట్రెండ్ బాగా మారిపోయిన విషయం తెలిసిందే. దర్శకులు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా భిన్న విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే తెరపై ఎన్నో బయోపిక్ లు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా తారలకు సంబంధించిన బయోపిక్ లు మాత్రమే కాదు క్రీడారంగంలో సత్తా చాటిన వారి బయోపిక్ లు కూడా ఇప్పటికే తెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారబోతోంది అని టీజే జ్ఞానవేల్ తన ప్రయత్నంతో నిరూపిస్తున్నారని చెప్పాలి.

అసలు విషయంలోకి వెళ్తే.. ఒక హంతకుడి బయోపిక్ తో టీజే జ్ఞానవేల్ రాబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ హంతకుడి బయోపిక్ కోసం మోహన్ లాల్ ను ఎంపిక చేయడం మరింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మరి ఈ బయోపిక్ కథ ఎవరిది? ఎవరా హంతకుడు అనే విషయానికి వస్తే.. తమిళనాడులో దోశ కింగ్ గా ప్రసిద్ధి చెందిన శరవణా భవన్ వ్యవస్థాపకులు పి. రాజగోపాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు అయితే ఇప్పుడు ఈయన జీవిత కథ ఆధారంగానే.. ఈ సినిమా తీయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్టు మొత్తం సిద్ధం చేసుకొని.. మోహన్ లాల్ కి వినిపించి, ఆయనను ఒప్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ దోశె కింగ్ తన జీవితంలో ఎంత ఎత్తుకైతే ఎదిగారో.. దానికి సమానమైన నేర చరిత్రను కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ నేర చరిత్రనే తన కథలో కీలకంగా చేసుకోబోతున్నారు డైరెక్టర్..

ముఖ్యంగా రాజగోపాల్ బయోపిక్ విషయానికి వస్తే.. ఈయన తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతానికి చెందినవారు. పెద్దగా చదువుకోలేదు 1981లో చిన్న హోటల్ పెట్టి కెరియర్ ప్రారంభించిన ఈయన.. అక్కడ ఈయన వేసే దోసెలు మహా రుచిగా ఉండడంతో భారీ పాపులారిటీ లభించింది. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలు ఓపెన్ చేసి వేల నుంచి లక్షలు.. లక్షలు నుంచి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు.. కానీ ఒక జ్యోతిష్యుడు సలహా మేరకు అసిస్టెంట్ మేనేజర్ కుమార్తె జీవ జ్యోతిని పెళ్లాడాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమెకు శాంత కుమార్ అనే వ్యక్తితో పెళ్లయి ఉంటుంది. కానీ ఎలాగైనా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలని 2001లో ఆమె భర్తను చంపి, అడవిలో పడేస్తారు. ఆఖరికి ఆమె భర్త మృతదేహం దొరకడంతో రాజగోపాల్ మీద కిడ్నాప్, హత్య కేసు నమోదు అవుతుంది.

2010లో నేరం రుజువు కావడంతో 10 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష పడింది. అయితే 2019లో సుప్రీంకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చగా.. అదే సంవత్సరం కోర్టుకు హాజరయ్యే క్రమంలో రాజగోపాల్ గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడట. ఇలా ఒక ఆడదాని కోసం ఎంతో కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని క్షణికావేశంలో చేసిన పనితో నాశనం చేసుకున్నారు.ఇప్పుడు ఇదే కథను తెరపై మనకు చూపించబోతున్నారు.

నిజానికి ఇతడి జీవితం పైన ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ ఎవరూ కూడా ఈయనను పాజిటివ్ గా చూపించలేకపోయారు. మరి వెట్టయాన్, జై భీమ్ చిత్రాలతో పేరు సొంతం చేసుకున్న టీజే జ్ఞానవేల్ తన కథలో రాజగోపాల్ ను పాజిటివ్గా చూపిస్తారా లేక నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకొని హంతకుడుగానే చూపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ హంతకుడిగానే చూపిస్తే ఇందులో మోహన్ లాల్ హంతకుడి గెటప్ లో కనిపించబోతున్నారని చెప్పవచ్చు. మరి ఈ బయోపిక్ అభిమానులకు అంగీకారమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ కథ రూపుదిద్దుకొని తెరపైకి వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.