Begin typing your search above and press return to search.

కంటెంట్ నుంచి కమర్షియల్ వైపు అడుగులా?

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే? మలయాళ దర్శకులు కమర్షియాలిటీ కోసం అసలు బలాన్ని వ‌ద‌ల‌లేదు.

By:  Srikanth Kontham   |   28 Jun 2026 9:00 AM IST
కంటెంట్ నుంచి కమర్షియల్ వైపు అడుగులా?
X

ఒకప్పుడు మలయాళ సినిమా అనగానే గుర్తొచ్చేవి సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు.. అవార్డులు తెచ్చే సమాం తర కథలు .. పరిమిత బడ్జెట్లు. పక్క రాష్ట్రాల్లో కమర్షియల్ హంగామా ఎంత నడుస్తున్నా? మాలీవుడ్ మాత్రం పంథా మార్చుకోకుండా బలమైన కంటెంట్‌నే నమ్ముకుని సాగింది. కానీ గత రెండు మూడు ఏళ్లుగా ముఖ్యంగా 2024 నుండి -2026 వరకు గమనిస్తే అక్కడ ఊహించని నిశ్శబ్ద విప్లవం స్పష్టంగా కనిపిస్తోంది. తమదైన ముద్రను కోల్పోకుండానే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే భారీ కమర్షియల్ వసూళ్లు, హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ వైపు మలయాళ చిత్రసీమ వడివడిగా అడుగులు వేస్తోంది.

ఈ భారీ మార్పునకు నాంది పలికింది 2024 అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఏడాది వచ్చిన `మంజుమ్మెల్ బాయ్స్`, `ఆవేశం`, `ప్రేమలు` వంటి చిత్రాలు మాలీవుడ్ బిజినెస్ రూపురేఖలనే మార్చేశాయి. స్నేహం నేపథ్యంలో వచ్చిన `మంజుమ్మెల్ బాయ్స్` ఏకంగా 200 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు సృష్టించగా, ఫహద్ ఫాజిల్ `ఆవేశం` థియేటర్లలో మాస్ పూనకాలు తెప్పించింది. అంతవరకు కేవలం క్లాస్ ఆడియన్స్‌కు మాత్రమే పరిమితం అనుకున్న మలయాళ సినిమాలు, సరైన మాస్ కమర్షియల్ ప్యాకేజింగ్‌తో వస్తే పాన్-ఇండియా రేంజ్‌లో వసూళ్ల వర్షం కురిపించగలవని ఈ చిత్రాలు నిరూపించాయి.

ఈ ట్రెండ్ 2024తో ఆగిపోలేదు. 2025 - 2026 నాటికి మరింత ఊపందుకుంది. `లోకా చాప్టర్ 1: చంద్ర` చిత్రం మలయాళ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని విధంగా 300 కోట్ల మార్కును దాటి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. మోహన్‌లాల్ మోస్ట్ అవేటెడ్ `లూసిఫర్ సీక్వెల్ L2: ఎంపురాన్`, `దృశ్యం 3` వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, మమ్ముట్టి నటించిన `పేట్రియాట్` వంటి భారీ యాక్షన్ థ్రిల్లర్స్ మాలీవుడ్‌ను కమర్షియల్ పరంగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు కోట్లల్లో మాట్లాడే ఇండస్ట్రీ ఇప్పుడు వందల కోట్ల మార్కెట్‌ను సులువుగా శాసిస్తోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే? మలయాళ దర్శకులు కమర్షియాలిటీ కోసం అసలు బలాన్ని వ‌ద‌ల‌లేదు. కమర్షియల్ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అవ్వకుండా సిగ్నేచర్ రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ స్ట్రైకింగ్ యాక్షన్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన సౌండ్ డిజైన్‌ను జోడించారు. అంటే కథలోని సహజత్వాన్ని కోల్పోకుండా ఆడియన్స్‌కు కిక్ ఇచ్చే మాస్ ఎలిమెంట్స్ ను ఎలా దట్టించవచ్చో ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈ వైవిధ్యమైన మేకింగ్ శైలే ఇతర భాషల ప్రేక్షకులను సైతం థియేటర్లకు పరుగులు పెట్టేలా చేస్తోంది.

ఈ నేప‌థ్యంల్ఓ అక్కడి స్టార్ హీరోలు, ప్రొడక్షన్ హౌస్‌ల పాత్ర ఎంతో కీలకం. మమ్ముట్టి కంపెనీ, వేఫారర్ ఫిల్మ్స్, ఆశీర్వాద్ సినిమాస్ వంటి బ్యానర్లు బడ్జెట్ పరిమితులను పెంచి గ్రాండ్ విజువల్స్‌తో సినిమాలను నిర్మించడానికి ముందుకొస్తున్నాయి. లెజెండ్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ ఒకవైపు క్లాసిక్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు మాస్ ఇమేజ్‌ను రీఇన్వెంట్ చేసుకుంటున్నారు. నస్లిన్, టోవినో థామస్, ఆంటోనీ వర్గీస్ వంటి యంగ్ జనరేషన్ హీరోలు కూడా భారీ యాక్షన్ డ్రామాల్లో మెరుస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.

మలయాళ సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ రూట్స్ నుంచి కమర్షియల్ రూట్ వైపు వేస్తున్న ఈ అడుగులు ఇండస్ట్రీకి కొత్త ఊపిరినిచ్చాయి. కేవలం డబ్బు సంపాదన కోసమే కాదు. గ్లోబల్ మార్కెట్‌లో తమ సినిమా పరిధిని విస్తరించుకోవడానికి జరుగుతున్న వ్యూహాత్మక ప్రయాణం. కళాత్మ‌క‌ విలువలకు కమర్షియల్ హంగులను అద్ది, తమదైన ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్నారు. మాలీవుడ్ ప్రయాణం భ‌విష్య‌త్ లో భారతీయ సినిమా రంగానికి సరికొత్త దిక్సూచిగా మారే అవకాశం లేక‌పోలేదు.