Begin typing your search above and press return to search.

దిగ్గజ నటి రేవతి, పద్మప్రియ సంచలనం: AMMA సంఘానికి రాజీనామా!

ఇటీవల మలయాళ పరిశ్రమను కుదిపేసిన `హేమ కమిటీ రిపోర్ట్` తదనంతర పరిణామాలపై కూడా రేవతి, పద్మప్రియ తీవ్రంగా స్పందించారు.

By:  Sivaji Kontham   |   7 July 2026 10:05 AM IST
దిగ్గజ నటి రేవతి, పద్మప్రియ సంచలనం: AMMA సంఘానికి రాజీనామా!
X

మలయాళ చిత్ర పరిశ్రమలో మరోసారి `పురుషాధిక్య‌త` గురించిన చ‌ర్చ‌ తీవ్ర సంచలనంగా మారింది. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) ప్రాథమిక సభ్యత్వానికి దిగ్గజ నటి, దర్శకురాలు రేవతి (రేవతి ఆశా కేలుణ్ణి), వెటరన్ నటి పద్మప్రియ (పద్మప్రియ జానకీరామన్) రాజీనామా చేశారు. ఈ మేరకు వారు ఇన్ స్టాగ్రామ్‌లో ఉమ్మడిగా ఒక ప్రకటనను విడుదల చేస్తూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ఏదో ఒక సంఘటన వల్ల లేదా తొందరపాటుతో తీసుకున్నది కాదని... గత కొన్నేళ్లుగా సంఘంలో మార్పు కోసం తాము చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లే ఈ అడుగు వేయాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు.

గత దశాబ్ద కాలంగా తాము `అమ్మ` సంఘం నుండి కోరుతున్నది చాలా సులువైన, కనీస అవసరాలని రేవతి, పద్మప్రియలు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా కళాకారులకు సురక్షితమైన పని వాతావరణం, ఆత్మగౌరవం, జవాబుదారీతనం , సమానత్వం వంటి కనీస విలువలను మాత్రమే తాము ఆశించామని.. ప్రతి సభ్యుడికి దక్కాల్సిన కనీస హక్కులు ఇవేనని వారు ఆవేద‌న చెందారు. అయితే ఈ కనీస హక్కుల గురించి ప్రశ్నించినందుకు గానూ తమకు తోటి సహోద్యోగుల నుండి, స్నేహితుల నుండి.. ఒకప్పుడు తమ సొంత ఇల్లుగా భావించిన పరిశ్రమలోని ప్రాంతాల నుండి కేవలం నిశ్శబ్దం, దూరం మాత్రమే బహుమతిగా లభించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల మలయాళ పరిశ్రమను కుదిపేసిన `హేమ కమిటీ రిపోర్ట్` తదనంతర పరిణామాలపై కూడా రేవతి, పద్మప్రియ తీవ్రంగా స్పందించారు. హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత `అమ్మ` సంఘంలోని కొందరు వ్యక్తులు పదవులకు రాజీనామా చేయడం అనేది ఏదో నైతిక విలువలతో కూడుకున్న చర్య కాదని.. అది కేవలం జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమేనని వారు విమర్శించారు. ఈ విషయం నుంచి ప్రజలు, మీడియా దృష్టి కొద్దిగా ప‌క్క‌కు మళ్ళిన వెంటనే.. మళ్లీ పాత పద్ధతులే రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. అధికారం తనను తాను కాపాడుకోవడానికి ఎప్పుడూ కొత్త మార్గాలను వెతుక్కుంటుందని.. ముఖాలు.. పద్ధతులు మారినా అసమానతలకు తావిచ్చే వ్యవస్థలు మాత్రం అలాగే ఉన్నాయని ఆ న‌టీమ‌ణులు దుయ్యబట్టారు.

నటీనటులందరి ఉమ్మడి గొంతుకగా నిలవాల్సిన `అమ్మ` సంఘం ప్రస్తుతం పురుషాధిక్యత, అధికార రాజకీయాల చేతుల్లో చిక్కుకుపోయిందని వారు తీవ్ర విమర్శలు చేశారు. దీనివల్ల ఈ సంస్థ స్థాపించిన నాటి ఉన్నత ఆశయాలు పూర్తిగా బలహీనపడ్డాయని ఆరోపించారు. ఈ తరుణంలో తాము ఈ సంస్థ నుండి బయటకు రావడం అనేది ఓటమి కాదని..అది తమ `ఆత్మగౌరవం` అని స్పష్టం చేశారు. సంస్థలు అనేవి కేవలం ప్రజలు అందులో ఉన్నంత మాత్రాన నిలబడవని.. అవి నమ్మకానికి అర్హమైనవిగా ఉన్నప్పుడు మాత్రమే మనుగడ సాగిస్తాయని స‌ద‌రు న‌టీమ‌ణులు హితవు పలికారు.

ఈ సంఘం నుండి వైదొలిగినా .. మలయాళ చిత్ర పరిశ్రమ భవిష్యత్తుపై తమకు ఇప్పటికీ పూర్తి నమ్మకం ఉందని రేవతి, పద్మప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. మునుముందు రోజుల్లో పరిశ్రమలోని మహిళలు తమ సీనియర్లు ఎదుర్కొన్న పోరాటాలనే మళ్లీ ఎదుర్కోవాల్సిన అవసరం లేని ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందని తాము నమ్ముతున్నామని... ఆ నమ్మకానికి ఒక సంఘంలో సభ్యత్వం ఉండాల్సిన పని లేదని పేర్కొన్నారు. తాము సినీ నిపుణులుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తామని.. మెరుగైన కథల కోసం... తోటి సహోద్యోగుల కోసం... సమానత్వంతో కూడిన పరిశ్రమ కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటామని చెబుతూ ఈ వివాదాస్ప‌ద అధ్యాయాన్ని ముగించారు.