విజయ్ తో జరగాల్సిన టాలీవుడ్ డెబ్యూ.. అందుకే ఆగిపోయింది
తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసిన అమ్మడు పెద్ద సినిమాలేమీ చేయకపోయినా తన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఏర్పరచుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 5 Jan 2026 11:44 AM ISTమాళవిక మోహనన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాటోగ్రఫర్ కె.యు మోహనన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక అతి తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసిన అమ్మడు పెద్ద సినిమాలేమీ చేయకపోయినా తన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఏర్పరచుకున్నారు.
రాజా సాబ్ ద్వారా మాళవిక టాలీవుడ్ డెబ్యూ
ఆ ఫాలోయింగే ఇప్పుడు తనకు ఆఫర్లను తెచ్చిపెడుతుంది. అయితే మిగిలిన భాషల్లో ఇప్పటికే పలు సినిమాలు చేసిన మాళవిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా ద్వారా మాళవిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.
విజయ్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది
వాస్తవానికి మాళవిక టాలీవుడ్ డెబ్యూ ఎప్పుడో జరగాల్సిందట. విజయ్ దేవరకొండ హీరోగా మాళవిక హీరోగా ఆనంద్ అన్నామలై అనే తమిళ డైరెక్టర్ హీరో అనే మూవీ చేయడానికి అన్నీ రెడీ చేసి సినిమాను మొదలుపెట్టి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాక మొదటి షెడ్యూల్‌కు భారీగా ఖర్చవడంతో ఈ సినిమాను వర్కవుట్ చేయడం కష్టమని మేకర్స్ దీన్ని షెల్వ్ చేసేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
లవ్ స్టోరీ అవడంతో ఎగ్జైట్ అయ్యా
రాజా సాబ్ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్న మాళవిక, రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో విజయ్ తో ఆగిపోయిన మూవీ గురించి, తన టాలీవుడ్ డెబ్యూ గురించి మాట్లాడారు. విజయ్ తో చేయాల్సిన కథ చాలా బావుంటుందని, లవ్ స్టోరీ కావడంతో ఆ మూవీ కోసం చాలా ఎగ్జైట్ అయ్యానని ఆమె చెప్పారు. అప్పటికే విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అవడంతో పాటూ, మైత్రీ లాంటి ప్రిస్టీజియస్ బ్యానర్లో సినిమా అనేసరికి వెంటనే ఆ మూవీకి ఒప్పుకున్నట్టు మాళవిక తెలిపారు.
సలార్ కోసం అడిగిన మాట నిజమే!
కానీ విజయ్ ఆ మూవీకి బదులు లైగర్ చేయాలనుకోవడంతో కొంతమేర షూటింగ్ అయ్యాక ఆ మూవీ ఆగిపోయిందని, దీంతో తన టాలీవుడ్ డెబ్యూ లేటైందని ఆమె చెప్పారు. ఆ తర్వాత సలార్ టీమ్ తనను సంప్రదించారని, కానీ డేట్స్ అడ్జస్ట్ అవకపోవడంతో పాటూ మరికొన్ని ఇబ్బందుల వల్ల తాను ఆ సినిమాను చేయలేకపోయానని, తెలుగులో చాలా ఛాన్సులొచ్చినప్పటికీ, పెద్ద సినిమాతోనే తన డెబ్యూ జరగాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు వెయిట్ చేసినట్టు ఆమె చెప్పారు. జనవరి 9న రిలీజ్ కానున్న రాజా సాబ్ మూవీ తో తనకు టాలీవుడ్ లో మంచి డెబ్యూ దక్కుతుందని ఆమె భావిస్తున్నారు. మొత్తానికి అప్పట్లో విజయ్ తో జరగాల్సిన మాళవిక డెబ్యూ ఇప్పుడు ప్రభాస్ తో జరుగుతుందన్నమాట.
