Begin typing your search above and press return to search.

ఎడిటింగ్ వ‌ల్ల పాత్ర‌లు దెబ్బ తింటాయా?

ఒక సినిమాలో నటీనటులు కనిపించే కొన్ని నిమిషాల వెనుక నెలల తరబడి శ్రమ, క‌ష్టం, భాషపై పట్టు సాధించే ప్రయత్నం, పాత్ర కోసం చేసే త్యాగాలు దాగి ఉంటాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Jun 2026 7:00 PM IST
ఎడిటింగ్ వ‌ల్ల పాత్ర‌లు దెబ్బ తింటాయా?
X

ఒక సినిమాలో నటీనటులు కనిపించే కొన్ని నిమిషాల వెనుక నెలల తరబడి శ్రమ, క‌ష్టం, భాషపై పట్టు సాధించే ప్రయత్నం, పాత్ర కోసం చేసే త్యాగాలు దాగి ఉంటాయి. అయితే ఆ కష్టం మొత్తం ప్రేక్షకులకు చేరుతుందనే గ్యారంటీ ఉండదు. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన కామెంట్స్ మరోసారి ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ, తంగలాన్ ఫైనల్ వెర్షన్‌లో తనకు సంబంధించిన 50% సీన్స్ తొలగించబడ్డాయని ఆవేదన వ్య‌క్తం చేశారు.

సినిమా ర‌న్ టైమ్ ను నియంత్రించాల్సిన అవసరం కారణంగా చాలా సీన్స్ ఎడిటింగ్‌లో కట్ అయ్యాయని ఆమె తెలిపారు. షూటింగ్ సమయంలో తన పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండేదని, ఎక్కువ డైలాగ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడి కఠినమైన తమిళ డైలాగ్స్ నేర్చుకున్నానని మాళవిక పేర్కొన్నారు. ఆ డైలాగ్స్‌ను పలకడానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయించి ప్రాక్టీస్ చేసినట్లు తెలిపారు. అయితే ఫైనల్ ఎడిట్ చూసిన తర్వాత తనకు ఆశ్చర్యం కలిగిందని చెప్పారు.

త‌నకు సంబంధించిన సీన్స్ ఎడిటింగ్ లో క‌ట్ చేయ‌డం వ‌ల్ల త‌న పాత్రకు చెప్పుకోద‌గ్గ రీతిలో గుర్తింపు రాలేద‌ని, ఇంకా చెప్పాలంటే ఆ క్యారెక్ట‌ర్ గురించి చెప్పుకోవ‌డానికి ఏమీ లేద‌ని ఆమె వెల్ల‌డించారు. షూటింగ్ టైమ్ లో తానెంతో కష్టమైన తమిళం మాట్లాడుతున్నానని ఫ్రెండ్స్‌కు చెప్పగా, సినిమా రిలీజైన తర్వాత వాళ్లు చూసి నువ్వు చెప్పిందంతా లేదు క‌దా అని అడిగార‌ని గుర్తు చేసుకున్నారు.

మాళవిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరో చర్చకు దారితీశాయి. ఒక పాత్రను రూపొందించడానికి నటీనటులు ఎంత కష్టపడినా, ఫైనల్‌గా ప్రేక్షకులు చూసేది ఎడిటింగ్ టేబుల్‌పై తీసుకున్న నిర్ణయాల ఫలితమే అన్న అభిప్రాయం మరోసారి బలపడుతోంది. స్క్రీన్ ప్లే వేగం, రన్‌టైమ్, కమర్షియల్ అవసరాలు లాంటి కారణాలతో డైరెక్ట‌ర్లు, ఎడిటర్లు కొన్ని కీలక సన్నివేశాలను తొలగించడం కొత్త విషయ‌మేమీ కాదు. అయితే ఆ ప్రక్రియలో కొన్నిసార్లు క్యారెక్ట‌ర్స్ డెప్త్, ఎమోష‌న్స్, నటీనటుల కష్టం ప్రేక్షకులకు పూర్తిగా చేరకపోవచ్చు. తంగ‌లాన్ విషయంలో మాళవిక మోహనన్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎడిటింగ్ లో తీసేసిన ఆ సీన్స్ సినిమాలో ఉంటే ఆమె పాత్రకు మరింత బలం చేకూరేదా అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.