పాశ్చాత్య చిత్రసీమలో మారుతున్న సమీకరణాలు!
ముఖ్యంగా భారతీయ కళలు, నృత్య రూపాలను విదేశీ తెరపై చూపించే విధానంలో గొప్ప మార్పు వచ్చిందని మైత్రేయి వివరించారు.
By: Srikanth Kontham | 20 Sept 2026 10:00 PM ISTపాపులర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ `నెవర్ హావ్ ఐ ఎవర్` తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి మైత్రేయి రామకృష్ణన్ హాలీవుడ్‌లో దక్షిణాసియా నటుల ప్రాతినిధ్యం పై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్న తన కొత్త చిత్రం `బెస్ట్ ఆఫ్ ది బెస్ట్` సందర్భంలో మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం పాశ్చాత్య చిత్రసీమలో భారతీయ, దక్షిణాసియా సంస్కృతులకు దక్కుతున్న ప్రాధాన్యత గణనీయంగా మారిందని స్పష్టం చేశారు.
పాశ్చాత్య సినిమాలో దక్షిణాసియా పాత్రల చిత్రీకరణలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు కేవలం సహాయక పాత్రలకో లేదా పేరుకే ఉన్న పాత్రలకో పరిమితం చేసిన పరిశ్రమ ఇప్పుడు పాత్రల వ్యక్తిత్వానికి, కథకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సాంస్కృతిక నేపథ్యం అనేది పాత్రకు అదనపు బలంగా మారుతోందే తప్ప కేవలం శ్లాంగ్ లేదా స్టీరియోటైప్స్ కోసమే పాత్రలను సృష్టించడం తగ్గిందని పేర్కొన్నారు.
ముఖ్యంగా భారతీయ కళలు, నృత్య రూపాలను విదేశీ తెరపై చూపించే విధానంలో గొప్ప మార్పు వచ్చిందని మైత్రేయి వివరించారు. `బెస్ట్ ఆఫ్ ది బెస్ట్` లో భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్య రీతులను ఎంతో గౌరవప్రదంగా, వాస్తవికంగా చూపించారని తెలిపారు. గతంలో చూపించినట్లు నాగస్వరం, పాముల డాన్సుల పరిమితులకు స్వస్తి చెప్పామని.. ఇకపై కేవలం గాల్లో చేతులు తిప్పే సాధారణ ప్రదర్శనలతో సరిపెట్టుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తాను అనుభవిస్తున్న గుర్తింపు వెనుక గతంలో పోరాడిన ఎందరో దక్షిణాసియా నటుల కృషి ఉందని మైత్రేయి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చిన్న చిన్న పాత్రల కోసం తమ ఉనికిని చాటుకోవడం కోసం పోరాడిన నటుల పునాదులపైనే నేటి ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయన్నారు. ఆ నటీనటులు పడిన కష్టమే తర్వాతి తరానికి ప్రధాన పాత్రలు పోషించే అవకాశాన్ని తెచ్చిపెట్టిందని.. వారందరికీ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
18 ఏళ్ల వయసులోనే `నెవర్ హావ్ ఐ ఎవర్` ద్వారా వచ్చిన గ్లోబల్ పాపులారిటీ తనను ఎంతో ఒత్తిడికి గురి చేసిందన్నారు. అసలు నటి కావాలనే ఆలోచనే లేక, కెమెరా వెనుక యానిమేటర్‌గా స్థిరపడాలని అనుకున్న తనకు ఒకేసారి మిలియన్ల మంది దృష్టిలో పడటం మొదట్లో ఊహించని సవాలుగా మారిందన్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో డిజిటల్ మాధ్యమం ద్వారా దేశవిదేశాల్లో వచ్చిన గుర్తింపును జీర్ణించుకోవడం చిన్న వయసులో ఎంతో కష్టమైందన్నారు.
అయితే ఆ ఒత్తిడిని జయించడంలో నటి, ప్రొడ్యూసర్ మిండీ కాలింగ్ తనకు ఎంతో అండగా నిలిచారని మైత్రేయి కృతజ్ఞతలు తెలిపారు. ఇండస్ట్రీకి కొత్తయిన తనకు ఒక తల్లిలా, గురువులా మార్గదర్శనం చేసారని... హాలీవుడ్ ప్రపంచంలో ఎలా నిలదొక్కుకోవాలో నేర్పించారని పేర్కొన్నారు. మిండీ ప్రోత్సాహంతోనే తాను ఒత్తిడికి గురికాకుండా స్థిరంగా ముందడుగు వేయగలిగానన్నారు. త్వరలోనే రిలజీ్ అయ్యే ప్రాజెక్టులతో ప్రేక్షకులను మరింతగా అలరిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
