Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ని చెల్లి అని పిలిచి ఏడిపించిన హీరో

ఆన్ లొకేష‌న్ షూటింగ్ జ‌రిగేప్పుడు చాలా గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలు న‌డుస్తుంటాయి. ఆర్టిస్టుల మ‌ధ్య లేదా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల మ‌ధ్య కొన్ని ల‌వ్ ఎపిసోడ్స్ ర‌న్ అవుతాయి.

By:  Sivaji Kontham   |   19 Sept 2025 9:31 AM IST
హీరోయిన్‌ని చెల్లి అని పిలిచి ఏడిపించిన హీరో
X

ఆన్ లొకేష‌న్ షూటింగ్ జ‌రిగేప్పుడు చాలా గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలు న‌డుస్తుంటాయి. ఆర్టిస్టుల మ‌ధ్య లేదా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల మ‌ధ్య కొన్ని ల‌వ్ ఎపిసోడ్స్ ర‌న్ అవుతాయి. కానీ షూటింగ్ పూర్త‌యి- గుమ్మ‌డి కాయ కొట్టేశాక ఎవ‌రి దారిన వారు వెళ్లాల్స‌న ప‌రిస్థితి. ఆ స‌మ‌యంలో ఎమోష‌న‌ల్ ఎపిసోడ్స్ కూడా ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక ఎపిసోడ్ గురించి జగపతి బాబు జీ5 షో `జయమ్ము నిశ్చయమ్ము రా` బ‌య‌ట‌పెట్టింది.

ఈ షోలో మీనా - సిమ్రాన్ లతో కలిసి శ్రీ‌దేవి క‌జిన్ మ‌హేశ్వ‌రి క‌నిపించారు. త‌న ముందు ఉన్న ముగ్గురు హీరోయిన్ల‌ను జ‌గ‌ప‌తిబాబు చాలార‌కాలుగా ప్ర‌శ్నించారు. ఇందులో మ‌హేశ్వ‌రికి అత‌డు సంధించిన ప్ర‌శ్న సూటిగా హృద‌యాన్ని తాకింది. షూటింగ్ స‌మయంలో కొలీగ్ తో క్ర‌ష్ లు ఏవైనా ఉన్నాయా? అని మ‌హేశ్వ‌రిని జ‌గ‌ప‌తి ప్ర‌శ్నించారు. అయితే త‌ళా అజిత్ కుమార్ తో క‌లిసి సినిమాలు చేసే క్ర‌మంలో అత‌డిపై క్ర‌ష్ ఏర్ప‌డింద‌ని మ‌హేశ్వ‌రి తెలిపింది. ఏడాది పాటు క‌లిసి ప‌ని చేసాను. చివ‌రిరోజు అంద‌రం విడిపోతున్నాం. ఆ స‌మ‌యంలో అజిత్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి `చెల్లి` అని పిలిచేసిన‌ప్పుడు నా గుండె ముక్క‌లైంది... నా ప్రేమ విఫ‌ల‌మైంది! అని చెప్పింది మ‌హేశ్వ‌రి.

`అజిత్ నా అతిపెద్ద క్రష్` అని కూడా మ‌హేశ్వ‌రి వెల్ల‌డించింది. అత‌డిపై కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఒక వ్యక్తిగా గౌరవం అని తెలిపింది. 1997లో ఉల్లాసం - నేసం చిత్రాలలో ఈ జంట క‌లిసి ప‌ని చేసారు. షూటింగులు ఆల‌స్యం కావ‌డంతో ఏడాదిన్న‌ర పాటు క‌లిసి ట్రావెల్ చేయాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలోనే అజిత్ తో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని మ‌హేశ్వ‌రి వెల్లడించింది. కానీ షూటింగ్ చివరి రోజున నిరాశ ఎదురైంది. అత‌డిని ఇక చూడ‌లేనేమోన‌ని ఆందోళ‌న చెందాను. అజిత్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. ``మహీ.. నువ్వు నా చెల్లి (చెల్లెలు) లాంటిదానివి. నీకు ఏదైనా సహాయం అవసరమైతే అడగడానికి వెనుకాడకు`` అని అన్నారు. ఆ మాట‌లు నా గుండెను ముక్క‌లు చేసాయి. ఇక ఆశించ‌డానికి ఏమీ లేదు. నా హృద‌యం ముక్క‌లైంది! అని మ‌హేశ్వ‌రి స‌ర‌దాగా నాటి విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.

అజిత్ 2000లో స‌హ‌న‌టి షాలినిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. మ‌హేశ్వ‌రి ఒక త‌మిళ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తెలుగులో కృష్ణ‌వంశీ `గులాబీ` చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. జేడి చ‌క్ర‌వ‌ర్తి స‌ర‌స‌న ఎక్కువ సినిమాల్లో న‌టించడంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోంది! అంటూ గుస‌గుస వినిపించింది. కానీ చివ‌రికి ఆ ఇద్ద‌రూ కూడా దూర‌మ‌య్యారు. చివ‌రిగా 2008లో మ‌హేశ్వ‌రి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జయకృష్ణను మ‌హేశ్వ‌రి వివాహం చేసుకుంది. అదే సంవత్సరం తెలుగు షో `మై నేమ్ ఈజ్ మంగా తాయారు`తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల 2024లో `స్టార్ట్ మ్యూజిక్ సీజన్ 4`తో తమిళ రియాలిటీ టీవీలో కనిపించింది. ఇప్పుడు జ‌గ‌ప‌తితో చాట్ షోలోను అల‌రించింది.