మేకింగ్ వీడియో: వారణాసి టైటిల్ గ్లింప్స్.. మహేష్ ఎంట్రీ ఇలా
బహుశా భారతీయ సినిమా చరిత్రలోనే తన హీరోని ఇంత గ్రాండ్ గా ఎలివేట్ చేయాలని అనుకున్న దర్శకుడు ఒక్క రాజమౌళి మాత్రమే! అంటే అతిశయోక్తి కాదు.
By: Sivaji Kontham | 25 Nov 2025 11:44 PM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సారథ్యంలో `గ్లోబ్ ట్రాటర్ 2025` ఈవెంట్ ముగిసి ఇన్నిరోజులు అయినా ఇంకా దాని గురించి అభిమానుల్లో చర్చ సాగుతూనే ఉంది. ఈ వేదికపై 130 అడుగుల ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేసి, `వారణాసి` టైటిల్ గ్లింప్స్ ని లాంచ్ చేయడానికి రాజమౌళి టెక్నికల్ బృందాలు అహోరాత్రులు శ్రమించాయి. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వారణాసి సెట్ వేసి, ధేధీప్యమానమైన కాంతులతో అలంకరించిన తీరు ఆశ్చర్యపరిచింది.
ఇక ఇదే ఈవెంట్ లో చిత్ర కథానాయకుడు, సూపర్‌స్టార్ మహేష్ ఎంట్రీ కోసం ఎస్.ఎస్.రాజమౌళి ఎంత గ్రాండియర్ గా ప్లాన్ చేసారో తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో వెల్లడిస్తోంది. నిజానికి వారణాసి ఈవెంట్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అహోరాత్రలు శ్రమించడం ఒకెత్తు అనుకుంటే, తన హీరోని దర్శకధీరుడు ఎలా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాడో, అతడి డ్రీమ్ ఏమిటో తాజా వీడియో చాలా స్పష్ఠంగా చెబుతోంది. బహుశా భారతీయ సినిమా చరిత్రలోనే తన హీరోని ఇంత గ్రాండ్ గా ఎలివేట్ చేయాలని అనుకున్న దర్శకుడు ఒక్క రాజమౌళి మాత్రమే! అంటే అతిశయోక్తి కాదు.
అది ఒక మాటలో చెప్పాలంటే నందీశ్వరుడు (వృషభం)పై మహేష్ ఎంట్రీ సీన్. వేదికపైకి నందీశ్వరుడు మోరలెత్తి లగెత్తుతుంటే, దానిపై శూలం పట్టుకుని కూచుని ఉన్న పరమేశ్వరుడిలా మహేష్ ప్రదర్శించే ధరహాసాన్ని అభిమానులు, ప్రేక్షకులకు ప్రెజెంట్ చేయాలని అనుకున్నారు. ఈవెంట్ లో ఇది అద్భుతం మహదాద్భుతం అనిపించింది. అయితే ఇది చూడటానికి ఎంత సింపుల్ గా ఉందో, దానికోసం టెక్నీషియన్లు శ్రమించిన తీరు, పదుల సంఖ్యలో సెట్ వర్కర్స్ తెరవెనుక ఎలా పని చేసారో చూస్తుంటే, ఔరా! అనకుండా ఉండలేం.
ఈ సెటప్ కోసం ఆరడుగుల గొయ్యి తీసి, కొన్ని మీటర్ల పొడవున నేలను తవ్వి భారీ ఐరన్ సెటప్ తో భూగర్భంలో ఏర్పాట్లు చేస్తున్న మేకింగ్ వీడియో చూస్తుంటే రాజమౌళి సారథ్యంలోని టీమ్ ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవచ్చు. దీనికోసం కళాదర్శకుడు చాలా చాలా ప్రణాళికను అనుసరించారు. ఈ సెట్లు డిజైన్ చేయడానికి రోజుల తరబడి ఎందుకు శ్రమించాల్సి వచ్చిందో అర్థమవుతోంది. శూలం ధరించి నందీశ్వరుడిపై ప్రయాణించే పరమేశ్వరుడిలా మహేష్ ఎంట్రీ కూడా ఎంతో అద్భుతంగా కనిపించింది. ఇక వేదిక దిగువన నమ్రత, సితార అయితే ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. దాదాపు 130 అడుగుల ఐమ్యాక్స్ స్క్రీన్ ని ఏర్పాటు చేసి వారణాసి టైటిల్ ని లాంచ్ చేయాలని భావించిన రాజమౌళికి, సాంకేతికంగా కొన్ని అడ్డంకులు రావడం తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే ఆయన ఆంజనేయునిపైనే అసహనం ప్రదర్శించాల్సి వచ్చింది. మొత్తానికి మహేష్ అభిమానులు చాలా ఓపిగ్గా వేచి చూసి ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసారు.
