అప్పుడు కృష్ణ.. ఇప్పుడు మహేష్..
సూపర్ స్టార్ కృష్ణ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది.
By: M Prashanth | 16 Nov 2025 12:49 PM ISTసూపర్ స్టార్ కృష్ణ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న లెజెండరీ నటుడు. ఐదున్నర దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలు అందించిన ఆయన.. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కూడా రాణించారు.
కెరీర్ లో 360కు పైగా చిత్రాల్లో నటించి, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణ.. తనదైన శైలిలో రాణించి మెప్పించారు. డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. టెక్నికల్ గా తెలుగు సినిమాకు అనేక కొత్త విషయాలను పరిచయం చేశారు. ఆ విషయాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు.
అయితే ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ బాబు మూవీతో కొత్త టెక్నాలజీ టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఆయన నటిస్తున్న వారణాసి సినిమాతో ఐమాక్స్ ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ అనే కొత్త టెక్నాలజీ సందడి చేయనుంది. ఆ విషయాన్ని రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఆ మూవీ డైరెక్టర్ రాజమౌళి రివీల్ చేశారు.
చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం తనకు తెలియదని, ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలే చూసేవాడినని జక్కన్న తెలిపారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కృష్ణ గారంటే ఏంటో అర్థమైందని అన్నారు. అయితే ఇండస్ట్రీలో చాలా వరకు కూడా కొత్త టెక్నాలజీ ఆయన సినిమాల ద్వారానే పరిచయమైందని రాజమౌళి చెప్పుకొచ్చారు.
మనం తీసే సినిమాలన్నీ స్కోప్ లో తీసి, ఐమ్యాక్స్ ఫార్మాట్ కు బ్లో అప్ చేస్తామని, కానీ అది నిజమైన ఐమ్యాక్స్ కాదని చెప్పారు రాజమౌళి. ఇప్పుడు వారణాసి మూవీని అసలైన ఐమ్యాక్స్ ఫార్మాట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. వారణాసి పూర్తి స్క్రీన్ ఫార్మాట్ లోనే ఉంటుందని జక్కన్న వెల్లడించారు.
మొత్తానికి.. సినిమా పరిశ్రమకు చాలా కొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అయితే.. ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా వారణాసితో కొత్త టెక్నాలజీని తీసుకురావడం ఆసక్తికరమే. ప్రస్తుతం సినీ ప్రియులంతా ఆ ఫార్మాట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి సినిమా వచ్చాక.. కొత్త టెక్నాలజీ ఎలా మెప్పిస్తుందో.. ఎలాంటి సందడి చేస్తుందో.. ఎంతలా ఆకట్టుకుంటందో వేచి చూడాలి.
