Begin typing your search above and press return to search.

బ‌యోపిక్స్ లో సాహ‌సించాల్సిన తెలుగు స్టార్లు!

ముఖ్యంగా లెజెండరీ నటుల జీవిత చరిత్రలను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ పాత్రలకు ఎవరు సరిపోతారు అనే చర్చ తీవ్రంగా జ‌రుగుతుంటుంది.

By:  Srikanth Kontham   |   3 Aug 2026 1:13 AM IST
బ‌యోపిక్స్ లో సాహ‌సించాల్సిన తెలుగు స్టార్లు!
X

ఏ పరిశ్రమలోనైనా బయోపిక్స్ ట్రెండ్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ముఖ్యంగా లెజెండరీ నటుల జీవిత చరిత్రలను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ పాత్రలకు ఎవరు సరిపోతారు అనే చర్చ తీవ్రంగా జ‌రుగుతుంటుంది. అయితే బయటి నటులు ఎంత ప్రతిభావంతులైనా? తండ్రుల పాత్రలలో కుమారులు నటిస్తే వచ్చే భావోద్వేగం వేరుగా ఉంటుంది. కానీ ఈ తరహా బయోపిక్స్ చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో ఒత్తిడిగా భావిస్తుంటారు.

మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్‌లో నటించాలనే ఆలోచనను ఎప్పుడూ బాధ్యతగా, కఠినమైన సవాల్‌గా చూస్తుంటారు. కృష్ణ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు ఒక చారిత్రక ఘట్టం. ఆ పాత్రను తెరపైకి తీసుకురావాలంటే సామాన్యమైన ధైర్యం సరిపోదు. తన తండ్రి స్థాయిని, ఆయన నటనను, ఆయనకున్న అభిమాన ప్రభంజనాన్ని సరిగ్గా ప్రతిబింబించగలనా? అనే సంకోచం మహేష్‌లో స్పష్టంగా కనిపిస్తుంటుంది.

ఇదే కోవలో మెగాస్టార్ చిరంజీవి జీవిత క‌థ‌లో రామ్ చరణ్ న‌టించాల‌న్నా అంతే భ‌య‌ప‌డ‌తారు. చిరంజీవి అలుపెరగని ప్రయాణం, ఇండస్ట్రీలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు ఒక అద్భుతమైన చరిత్ర. ఈ ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడంలో రామ్ చరణ్ లాంటి వారసుడు ఉంటేనే దానికి పూర్తి న్యాయం జరుగుతుంది. అయినా? తండ్రి ఇమేజ్‌కు తగ్గట్టుగా నటిస్తూ ఆ పాత్రలో జీవించడం ఎంతటి నటుడికైనా కత్తిమీద సామే.

రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలోనూ ఇదే చర్చ నడుస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అయిన `ఒక్క అడుగు` వేయడానికి ప్రభాస్ ఎందుకు వెనకంజ వేస్తున్నారనేది అభిమానుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. కృష్ణంరాజు నైజాన్ని, ఆయన రాయలసీమ నేపథ్యంలో సాగిన సినిమాల వైభవాన్ని, వ్యక్తిగతంగా ఆయన చూపిన ఆప్యాయతను రీక్రియేట్ చేయడం అంత సులువు కాదు. ఆ పాత్రలో ఒదిగిపోవడానికి కావలసిన పరిపక్వత తనకు పూర్తిగా ఉందా? అని ప్రభాస్ భావిస్తుండవచ్చు.

సొంత తండ్రుల పాత్రలే కదా అని సులువుగా తీసేయ‌లేం. ఎందుకంటే అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. వారిని ప్రత్యక్షంగా చూసిన ప్రజల ముందు అదే హావభావాలు, నడక, అభినయం ప్రదర్శించడం ఒక నటుడిగా ఎంతో మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. తండ్రుల కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి మచ్చ రాకుండా తెరపై చూపించాలనే తపనతోనే ఈ సాహసానికి భయపడుతుంటారు.

అయినా కాలం మారుతున్న కొద్దీ తెలుగు స్టార్లు ఈ బయోపిక్స్ విషయంలో ఆలోచనలను మార్చుకునే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఆ లెజెండ్స్ వారసత్వాన్ని మోస్తున్న ఈ హీరోలు మాత్రమే ఆ పాత్రల అసలు ఆత్మను, ఎమోషన్స్‌ను పండించగలరు. ఇతరులెవరు చేసినా ఆ ప్రామాణికత లోపిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో దిగ్గజాల బయోపిక్స్ కోసం ఈ స్టార్లు కచ్చితంగా సాహసం చేయాల్సిందే. ఆ హీరోలు వెన‌క్కి త‌గ్గినా? వారిని అభిమానించే అభిమానులు మాత్రం ఒప్పుకునే ప్ర‌శ‌క్తే ఉండ‌దు.