Begin typing your search above and press return to search.

మహేష్ 'వారణాసి'.. ఏం జరుగుతోంది?

రాజమౌళి మార్క్ విజువల్స్, మహేష్ బాబు పవర్‌ ఫుల్ ప్రెజెన్స్‌ తో గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది.

By:  M Prashanth   |   9 Jan 2026 10:32 AM IST
మహేష్ వారణాసి.. ఏం జరుగుతోంది?
X

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి.. ప్రస్తుతం టాలీవుడ్‌ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన గ్లింప్స్.. రీసెంట్ గా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో విడుదలవ్వగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

రాజమౌళి మార్క్ విజువల్స్, మహేష్ బాబు పవర్‌ ఫుల్ ప్రెజెన్స్‌ తో గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. అయితే ఆ భారీ హైప్‌ కు భిన్నంగా వారణాసి సినిమా షూటింగ్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌ గా జరుగుతోంది. రాజమౌళి స్టైల్‌ కు తగ్గట్టుగానే, షూటింగ్ వివరాలు బయటకు రాకుండా పూర్తి సీక్రెట్ గా కానిచ్చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాలోని కీలక షూటింగ్ పార్ట్ హైదరాబాద్‌ లో కొనసాగుతోంది. అందుకు గాను రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్‌ ను నిర్మించారు మేకర్స్. ఘాట్‌ లు, ఆలయాలు, నదీ తీరాలు, పురాతన నగర శిల్పకళను అచ్చుగుద్దినట్లు సెట్‌ లో రీక్రియేట్ చేశారట. నిజంగా కాశీకి వెళ్లిన ఫీలింగ్ వచ్చేలా రాజమౌళి సెట్‌ ను డిజైన్ చేయించారని టాక్.

అయితే కాశీ సెట్ నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లు సమాచారం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్‌ లలో ఇది ఒకటిగా నిలవనుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ సెట్‌ లోనే యాక్షన్ సీక్వెన్స్‌లు, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఆ సెట్ మెయిన్ అట్రాక్షన్ గా మారనుంది.

తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌ లో మహేష్ బాబు పాల్గొంటున్నారు. ఆయనపై ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ ను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని సమాచారం. దీంతో కాశీలో రుద్రునిగా బిజీగా ఉన్నారన్నమాట సూపర్ స్టార్. ప్రస్తుత షెడ్యూల్ లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ డిజైన్, విజువల్ గ్రాండియర్ ఆ సీన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్తాయని టాక్.

ఇక సినిమాలో మహేష్ తో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. కేఎల్ నారాయణ, కార్తికేయ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌ తో వారణాసి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుండగా.. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే.