థియేటర్ వైపు మళ్ళిన దర్శకుడి ప్రయోగం!
పాత తరం నటులంతా నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన వాళ్లే ఎక్కువ. ఎన్నో నాటకాలు వేసి వెండి తెరపై సత్తా చాటిన వారి అనుభవం అపారమైంది.
By: Srikanth Kontham | 2 July 2026 8:00 AM ISTపాత తరం నటులంతా నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన వాళ్లే ఎక్కువ. ఎన్నో నాటకాలు వేసి వెండి తెరపై సత్తా చాటిన వారి అనుభవం అపారమైంది. ఇప్పటికీ నాటక రంగం గురించి సీనియర్లు చెప్పే విషయాలు తెలిస్తే? నాటక రంగం ఎంత గొప్పదన్నది అద్దం పడుతుంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్ నాటక రంగం - మెయిన్‌స్ట్రీమ్ సినిమా మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
సినిమాలతో పోలిస్తే థియేటర్ రంగంలో ప్రత్యేకమైన ధైర్యం ఉంటుందని పేర్కొన్నారు. వాణిజ్యపరమైన ఒత్తిళ్లు లేకపోవడంతో? థియేటర్ కళాకారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలరన్నారు.
`వో సుబహ్ హమ్ హీ సే ఆయేగీ` అనే నాటకాన్ని మహేష్ భట్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ నాటకానికి ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. గతంలో ఇద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు పని చేసినప్పటికీ తాజాగా థియేటర్ వేదికపై ఇద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. నాటకం ద్వారా సమాజానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నాటకంలో అను మాలిక్ భాగస్వామ్యం గురించి మహేష్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `అను మాలిక్ ప్రతిభ ..దాతృత్వాన్ని ప్రశంసించారు.
తన కెరీర్ ఎదుగుదల కంటే ఇతర ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఆయన చూపే చొరవ అభినం దనీయమని భట్ అభిప్రాయపడ్డారు. అను మాలిక్ తన తండ్రి సర్దార్ మాలిక్ నుండి నేర్చుకున్న అనుభవాల వల్ల కఠినమైన పని పట్ల ఆయనకు ఎంతో మక్కువ, నిబద్ధత ఉన్నాయని తెలిపారు. ఒక ప్రాజెక్టును ప్రెజెంట్ చేయాలంటే? అందులో బలమైన లక్ష్యం ఉండాలని మహేష్ భట్ నమ్ముతారు. థియేటర్ ద్వారా డబ్బు సంపాదించడం కష్టమని తెలిసినా? అందులో ఉండే నిజాయితీ, కళాకారుల తపన తనను ఆకట్టుకుంటాయన్నారు.
తన పేరు ఈ నాటకానికి తోడవ్వడం ద్వారా టిక్కెట్ల అమ్మకాలు పెరిగి నాటక రంగానికి ఏదైనా సహాయం చేకూరుతుందంటే తాను సంతోషంగా ముందుకు వస్తానన్నారు. సినిమాల్లో ఉండే వాణిజ్యపరమైన లెక్కల కంటే థియేటర్లో ఉండే స్వేచ్ఛ భిన్నమైనదని మహేష్ భట్ నొక్కి చెప్పారు. మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో ఒకసారి విజయం సాధించాక అదే స్థాయిని కాపాడుకోవాలనే భయం.. డబ్బు సంపాదించాలనే ఆలోచన ఆ కళాకారులను కట్టిపడేస్తుంది. కానీ థియేటర్లో కోల్పోవడానికి ఏమీ ఉండదు.
కాబట్టి వారు ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకునే సాహసం చేస్తారని భట్ విశ్లేషించారు. కళను కేవలం వృత్తిగా కాకుండా బాధ్యతగా భావించే ఇలాంటి ప్రయత్నాలు నాటక రంగానికి ప్రాణం పోస్తాయని మహేష్ భట్ ఆశాభావం వ్యక్తం చేశారు. తారికీ హమీద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `వో సుబహ్ హమ్ హీ సే ఆయేగీ` నాటకం జూలై 5న ముంబైలో ప్రదర్శితం కానుంది. ఈ నాటకంలో ఇమ్రాన్ జాహిద్, నమితా సచ్‌దేవా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
