Begin typing your search above and press return to search.

ఆలియా పెళ్లికి పిల‌వ‌లేదు.. భ‌ట్ బ్ర‌ద‌ర్స్‌ బ్రేక‌ప్ స్టోరి

ఇటీవ‌లి కాలంలో భార్యాభ‌ర్త‌ల బ్రేక‌ప్ స్టోరీలు ఎక్కువ‌గా హైలైట్ అవుతున్నాయి. ఫ‌లానా సెల‌బ్రిటీ జంట విడిపోయింది అంటూ మీడియాలో హెడ్ లైన్స్ వ‌స్తున్నాయి.

By:  Sivaji Kontham   |   16 Nov 2025 12:00 AM IST
ఆలియా పెళ్లికి పిల‌వ‌లేదు.. భ‌ట్ బ్ర‌ద‌ర్స్‌ బ్రేక‌ప్ స్టోరి
X

ఇటీవ‌లి కాలంలో భార్యాభ‌ర్త‌ల బ్రేక‌ప్ స్టోరీలు ఎక్కువ‌గా హైలైట్ అవుతున్నాయి. ఫ‌లానా సెల‌బ్రిటీ జంట విడిపోయింది అంటూ మీడియాలో హెడ్ లైన్స్ వ‌స్తున్నాయి. కానీ బ్రేక‌ప్ అనేది కేవ‌లం భార్యాభ‌ర్త‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు... అన్న‌-త‌మ్ముడు.. అక్క -చెల్లెలు లేదా తండ్రి- కొడుకు, అత్త‌- కోడ‌ళ్ల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది. ఆస్తులు, అంత‌స్తులు, భూములు, అధికారం, ద‌ర్పం అంటూ గొడ‌వ‌ల‌తో బంధాలు బ్రేక్ అవుతూనే ఉన్నాయి. క‌ళియుగ ధ‌ర్మంలో డ‌బ్బుతో పాటు ఇంకా చాలా కార‌ణాలు మ‌నుషుల బంధాల‌ను బ‌ల‌హీనప‌రుస్తున్నాయి.

ఇప్పుడు బాలీవుడ్ లో పేరున్న బ‌డా నిర్మాత‌లు మహేష్ భ‌ట్- ముఖేష్ భ‌ట్ బ్ర‌ద‌ర్స్ ఎందువ‌ల్ల విడిపోయారు? భాగ‌స్వాములుగా సొంత బ్యాన‌ర్ ని ప్రారంభించి ఎన్నో విజ‌య‌వంతమైన చిత్రాల‌ను అందించిన అన్న‌ద‌మ్ములు, ఎంతో అన్యోన్యంగా క‌లిసి వ్యాపారాలు న‌డిపించిన‌ సోద‌రులు అనూహ్యంగా ఒక‌రి నుంచి ఒక‌రు దూరంగా ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది? ఈ ప్ర‌శ్న‌ల‌కు అన్న‌ద‌మ్ముల్లో చిన్న‌వాడైన‌ ముఖేష్ భ‌ట్ నుంచి స‌మాధానం వ‌చ్చింది.

అన్ని సినిమా క‌థ‌ల్లానే ఈ అన్న‌ద‌మ్ముల బంధం బ్రేక‌ప్ అవ్వ‌డం వెన‌క ఒక ఆస్తి త‌గాదా క‌థ దాగి ఉంది. జాయింట్ వెంచ‌ర్ గా మొద‌లైన బ్యాన‌ర్ పై గుత్తాధిప‌త్యం కోసం అన్న‌ద‌మ్ముల న‌డుమ పోరు కొనసాగింది. ముఖ్యంగా ఆషిఖి 3 ని తెర‌కెక్కించే రైట్స్ కోసం మ‌హేష్ భ‌ట్, ముఖేష్ భ‌ట్ మ‌ధ్య వివాదాలు కొన‌సాగాయి. ప్ర‌స్తుతం ముఖేష్ భ‌ట్ అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల జంటగా ఒక మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరిని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా `ఆషిఖి- 3` అని పేరు పెట్టారు. కానీ మహేష్ భ‌ట్ ఈ టైటిల్ -స్టోరి లైన్ పై హ‌క్కులు త‌న‌కు చెందుతాయ‌ని వాదించారు. ఈ వివాదం కారణంగా ఈ చిత్రానికి ఇప్పుడు తాత్కాలికంగా `తు మేరీ జిందగీ హై` అని పేరు మార్చారు. ఇది 1990లో వచ్చిన `ఆషిఖి` పాట నుండి ప్రేరణ పొందిందని క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

అయితే కొన్నేళ్ల క్రిత‌మే మ‌హేష్ భ‌ట్ - ముఖేష్ భ‌ట్ బ్ర‌ద‌ర్స్ విడిపోయిన త‌ర్వాత ఆషిఖి ఫ్రాంఛైజీ రైట్స్ కి సంబంధించిన గొడవ కూడా అందులో అంత‌ర్భాగ‌మైంది. అంత‌కుముందే మ‌హేష్ భ‌ట్ త‌న కుమార్తె ఆలియాభ‌ట్ ర‌ణ‌బీర్ ని పెళ్లాడిన‌న‌ప్పుడు ఈ పెళ్లికి సోద‌రుడు ముఖేష్ భ‌ట్‌ని ఆహ్వానించ‌లేదు.

ఈ పెళ్లికి పిల‌వ‌నందుకు చాలా బాధ‌ప‌డ్డానని ముఖేష్ అన్నాడు. ఆ త‌ర్వాత ఆలియా గ‌ర్భ‌వ‌తి అని తెలిసిన‌ప్పుడు అన్న బిడ్డ‌ను చూడాల‌ని ప‌రామ‌ర్శించాల‌ని అనుకున్నాడు... కానీ ఇలాంటి శుభ‌సంద‌ర్భంలో ఇంట్లో భావోద్వేగాల‌ను పెంచే ఉద్ధేశం త‌న‌కు లేక‌పోవ‌డం వల్ల రాలేదని చెప్పాడు.

అన్న కూతుళ్లు ఆలియా- షాహిన్ ఇద్ద‌రినీ నా కుమార్తెలుగా ప్రేమిస్తాను.. వారి జీవితంలో ప్ర‌తి సంతోషం క‌ష్టం న‌ష్టం ప్ర‌తిదీ చూడాల‌నుకుంటాను.. అని ముఖేష్ భ‌ట్ అన్నారు. ఆలియాకు రాహా జ‌న్మించింద‌ని తెలిసిన‌ప్పుడు చూడాల‌నుకున్నాను.. కానీ రాలేదు. త‌న సంద‌ర్శ‌న ప‌రామ‌ర్శ ఉద్రిక్త‌త‌ల‌ను పెంచ‌కూడ‌ద‌ని భావించిన‌ట్టు చెప్పాడు. త‌న సోద‌రుడు త‌న‌కు దేవుడు (గాడ్‌)తో స‌మానం అని కూడా ముఖేష్ భ‌ట్ అన్నారు. వృత్తిగ‌తంగా విభేధాలున్నాయేమో కానీ, మా మ‌ధ్య అన్న‌ద‌మ్ములుగా అనుబంధంలో విభేధాలు లేవ‌ని అన్నారు ముఖేష్ భ‌ట్.

ఆలియా పెళ్లి కూతురు అయిన‌ప్పుడు `మేరీ బచ్చి కి షాదీ హై` అని భావించాన‌ని ముఖేష్ భ‌ట్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆ క్షణం అత‌డికి ఎంత వ్యక్తిగతమైన‌దో అర్థం చేసుకోవాలి. త‌న‌ బిడ్డను కలవాలనే తన కోరికను ముఖేష్ భ‌ట్ దాచుకోలేక‌పోయాడు.

అయితే సోదరుల మధ్య విభేదాలకు ప్ర‌ధాన కార‌ణం ఏమిట‌న్న‌ది ఇంకా క‌చ్ఛితమైన కారణం తెలీదు. ఇద్దరూ ఒకప్పుడు విశేష్ ఫిల్మ్స్‌ను సంయుక్తంగా స్థాపించారు. ఈ బ్యాన‌ర్ లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు. అయితే 2021లో ముఖేష్ అధికారికంగా బ్యానర్ బాధ్యతలు స్వీకరించారు. అప్ప‌టి నుంచి మ‌హేష్ భ‌ట్ కి ఈ బ్యాన‌ర్ తో ఎలాంటి సంబంధం లేదు.