రణ్‌బీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న.. ఎందుకంటే?
రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణం’లోని ఓ సన్నివేశం చూసి దర్శకుడు మహేష్ భట్ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి మాట కోసం శ్రీరాముడు రాజ్యాన్ని వదిలి 14 ఏళ్ల వనవాసానికి బయలుదేరే సన్నివేశం తనను కదిలించిందని, కన్నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపారు. రణ్‌బీర్ నటన అద్భుతంగా ఉందని, ఆయనలో దైవత్వం కనిపించిందని ప్రశంసించారు.
By: Priya Chowdhary Nuthalapti | 7 Nov 2026 7:41 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం విడుదలై పర్వాలేదు అనిపించుకుంటుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌బీర్ శ్రీరాముడి పాత్రలో కనిపించారు. ఈ క్రమంలో తాజాగా ఆలియా భట్ తండ్రి.. రణబీర్ వల్ల ఏడ్చారు అన్న సంగతి వైరల్ అవుతుంది.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న అరుదైన జంటల్లో రణబీర్, ఆలియాభట్ ఒకరు. ఇక ఆలియా భట్.. మహేష్ బట్ కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా రణ్‌బీర్ నటనను చూసి ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన అల్లుడు నటించిన రామాయణం సినిమాను చూసిన తర్వాత తన అనుభవాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాలోని ఒక సన్నివేశం తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. రణ్‌బీర్ నటన చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని వెల్లడించారు.
సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం మహేష్ భట్‌ను బాగా ఆకట్టుకుందట. శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి 14 ఏళ్ల వనవాసానికి బయలుదేరే ఘట్టాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యానని.. ఆ సమయంలో తన గొంతు కూడా మూగబోయినట్లు అనిపించిందని తెలిపారు.
తన చుట్టూ యువ దర్శకులు, రచయితలు ఉన్నారని, వారికి తాను రణ్‌బీర్ మామగారిననే విషయం తెలుసని చెప్పారు. అయినప్పటికీ సినిమా పూర్తయ్యాక తన కళ్లలో వచ్చిన కన్నీళ్లను దాచుకోలేకపోయానని పేర్కొన్నారు. కొన్ని అద్భుతమైన అనుభవాలు మనల్ని మాటలు రాకుండా చేస్తాయని అన్నారు.
ఈ సినిమాలో రణ్‌బీర్ శ్రీరాముడిగా అద్భుతంగా కనిపించారని మహేష్ భట్ ప్రశంసించారు. ముఖ్యంగా రణ్‌బీర్ చేతులు జోడించి నమస్కరించే సన్నివేశంలో ఆయనలోని దైవత్వం కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు చూడని మరో గొప్ప నటుడిని ఈ సినిమాలో చూశానని అన్నారు.
