సినిమా ఉన్నా లేకున్నా... మహేష్ సీక్రెట్ ఇదేనట!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 19 Nov 2025 11:02 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల జరిగిన గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ లో మహేష్ బాబు లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహేష్ బాబు ఎప్పుడు బయట కనిపించినా, మీడియాలో కనిపించినా అభిమానులతో పాటు అందరూ సర్‌ప్రైజ్ అవుతారు. మహేష్ బాబు వయసు చెబితే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఆయన అయిదు పదుల వయసు దాటిన ఇప్పటి మూడు పదుల వయసు ముందు ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటాడు. ఆయన లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని అంటారు. కానీ ఆయన ఫిజిక్ పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు అని ఆయన పర్సనల్ ఫిట్‌నెస్ కోచ్ కుమార్ మన్నావా అంటున్నారు. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
వారణాసి ఈవెంట్‌లో మహేష్ బాబు లుక్...
వారణాసి ఈవెంట్‌లో మహేష్ బాబును చూసిన చాలా మంది ఖచ్చితంగా నోరు వెళ్లబెట్టి ఉంటారు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు పెద్దగా బయట కనిపించలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత మహేష్ బాబును ఒక ఫుల్ ఈవెంట్‌లో చూడటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కాస్త ఎక్కువ గ్యాప్ రావడం వల్లనో లేదంటే మహేష్ బాబు లుక్ మారిందో కానీ ఆయన మరింత ఆకర్షణీయంగా తయారు అయ్యాడు అంటూ అభిమానులతో పాటు అంతా కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారణాసి ఈవెంట్‌లో మహేష్ బాబు లుక్ గురించి తెగ చర్చ జరిగింది. ఆయన ఆయన ధరించిన ఔట్ ఫిట్ మొదలుకుని, హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్ వరకు అన్ని విషయాల గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఇలాంటి సమయంలో కుమార్ మన్నావా ఇంటర్వ్యూ మరింతగా చర్చనీయాంశం అయింది.
ఫిజికల్ ఫిట్‌నెస్ విషయంలో మహేష్ బాబు తర్వాతే...
మహేష్ ఫిట్‌నెస్ రహస్యం గురించి కుమార్ మన్నావా మాట్లాడుతూ... మహేష్ బాబు ఒక సినిమాలోని పాత్ర కోసం లేదా, ఏదైనా సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం ఫిజికల్ ఫిట్ నెస్ సాధించాలి అనుకోరు. ఆయన సినిమాలు ఉన్నా లేకున్నా, షూటింగ్ ఉన్నా లేకున్నా, నెలల తరబడి కెమెరాకు దూరంగా ఉండాల్సి ఉన్నప్పటికీ వర్కౌట్స్ మాత్రం ఆపరు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, షూటింగ్ లో ఉన్న, హాలీడేస్ లో ఉన్నా ఏడాదిలో 365 రోజులు ఆయన ఏదో ఒక సమయంలో వర్కౌట్స్ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఆయన ప్రతి రోజు వర్కౌట్స్ చేయడం ఒక ఎత్తు అయితే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన తినాలి అనుకున్నవి మాత్రమే తింటాడు, ఆయన దూరంగా ఉంచాలి అనుకున్న ఫుడ్ ను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. అందుకే ఆయన ఇప్పటికీ చాలా యంగ్ గా, ఫిజిక్ పరంగా కుర్రాడిలా ఉంటాడు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
రాజమౌళి దర్శకత్వంలో వారణాసి
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా పదేళ్ల క్రితమే రావాల్సి ఉన్నా ఇద్దరి కమిట్‌మెంట్స్ వల్ల, సరైన కథ సెట్ కాకపోవడం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు వీరి కాంబో సెట్ అయింది. రాజమౌళికి పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆయన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లింది. అంతే కాకుండా విదేశాల్లో జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు ఇంకా ఇతర సినిమాలు విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే జక్కన్న దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా ఏ స్థాయికి వెళ్లి ఆగుతుందో ఏ ఒక్కరూ కనీసం ఊహించను కూడా ఊహించలేక పోతున్నారు. వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు అని కాకుండా మరో రేంజ్ లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా అభిమానుల అంచనాలను జక్కన్న అందుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
