మహేష్ (X) రణబీర్: ఎవరు ఉత్తముడు? శ్రీరాముడి లుక్‌పై క్యూరియాసిటీ!
ఎవరి లుక్ బెస్ట్ గా ఉంటుందో... ఎవరు షో స్టాపర్ గా మారతారో? అంటూ ప్రస్తుతానికి అభిమానుల్లో బోలెడంత చర్చ సాగుతోంది.
By: Sivaji Kontham | 24 Feb 2026 5:00 AM ISTఇంకా వారణాసి నుంచి మహేష్ శ్రీరాముడి గెటప్ ఫస్ట్ లుక్ లాంచ్ కాలేదు.. అలాగే 'రామాయణం' నుంచి రణబీర్ రాముడి లుక్ ఇంకా రాలేదు.. కానీ అభిమానుల్లో కుతూహాలం అంతకంతకు పెరుగుతోంది. ఎటు చూసినా ఉత్సాహం కనిపిస్తోంది.. లుక్ లాంచ్ ల కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్..
ఎవరి లుక్ బెస్ట్ గా ఉంటుందో... ఎవరు షో స్టాపర్ గా మారతారో? అంటూ ప్రస్తుతానికి అభిమానుల్లో బోలెడంత చర్చ సాగుతోంది. అయితే రాజమౌళి `వారణాసి`లో కొన్ని నిమిషాల పాటు మహేష్ రాముడి గెటప్ లో కనిపిస్తారు.. కానీ రణబీర్ అలా కాదు.. సినిమా ఆద్యంతం శ్రీరాముడిగా కనిపిస్తాడు.. ఫ్రాంఛైజీలోని రెండు సినిమాల్లోను అతడు శ్రీరాముడిగా తెర నిండుగా కనిపిస్తాడు.. మరింత డెప్త్ గా విషయంలోకి వెళితే..
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకేసారి `శ్రీరాముడి` పాత్రలు పోషించడం అనేది మునుపెన్నడూ లేని ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మహేష్ బాబు, రణబీర్ కపూర్ ఇద్దరూ కూడా తమదైన శైలిలో రాముడి పాత్రకు ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం ఇద్దరి ఫస్ట్ లుక్స్ విడుదల కాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ పీక్స్‌లో ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే చర్చ మొదలవుతోంది.
మహేష్ బాబు -రాజమౌళి సినిమా - వారణాసి
మహేష్ బాబును శ్రీరాముడిగా చూడాలనేది ఆయన అభిమానుల దశాబ్దాల కల. అందుకు తగ్గట్టే జక్కన్న ఈ లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. మహేష్‌కు ఉన్న `ప్రిన్స్` ఇమేజ్.. ఆయన ముఖ వర్చస్సు, ఎత్తు రాముడి పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ముఖ్యంగా రాజమౌళి సినిమాల్లో హీరోల మేకోవర్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి మహేష్ 'వారణాసి' ఎపిసోడ్‌లో శ్రీరాముడిగా కనిపిస్తే అది థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం.
ఇది పూర్తిస్థాయి రామాయణం కాదు. ఒక అడ్వెంచర్ డ్రామాలో భాగంగా మహేష్ రాముడి గెటప్‌లో కనిపిస్తారు. అది కేవలం కొన్ని నిమిషాలైనా.. రాజమౌళి మార్క్ గ్రాండియారిటీ నడుమ ఆ లుక్‌ను చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. సినిమాలో ఒక కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ లేదా ఒక ప్రత్యేక సన్నివేశంలో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇది వారణాసి (కాశీ) పుణ్యక్షేత్రం నేపథ్యంలో చిత్రీకరిస్తారని సమాచారం.
రణబీర్ కపూర్ - నితేష్ తివారీ 'రామాయణం':
రణబీర్ కపూర్ ఒక పూర్తిస్థాయి పౌరాణిక గాథలో శ్రీరాముడిగా మెరవబోతున్నారు. రణబీర్ ఈ పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారు. మాంసాహారాన్ని వదిలేయడం, గొంతులో మార్పు కోసం శిక్షణ తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఆయన శాంత స్వభావం, నటనలో ఉండే మెచ్యూరిటీ రాముడి పాత్రకు బలాన్నిస్తాయి. రణబీర్ రెండు భాగాల్లోనూ శ్రీరాముడిగా కనిపిస్తారు కాబట్టి ప్రేక్షకులు ఆయన లుక్‌కు, నటనకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాముడి జీవితంలోని వివిధ దశలను ఆయన ఎలా పండిస్తారనేది ఆసక్తికరం.
ఎవరు బెస్ట్? అభిమానుల అంచనా :
ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం... ఫస్ట్ లుక్ లు రాలేదు కాబట్టి ఇప్పుడు వర్ణించడం కష్టం. ఇద్దరు హీరోల ఫీచర్స్ ప్రకారం.. మహేష్ క్లాసిక్ రాజకుమారుడిలా రాయల్ లుక్ లో కనపిస్తే, రణబీర్ కపూర్ సాఫ్ట్ - ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తాడు.. ఆరడుగుల మహేష్ బాబుకు ఎత్తు, తిరుగులేని స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన బలాలు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యంలో రణబీర్ కపూర్ తక్కువేమీ కాదు. ఇక దర్శకుడు రాజమౌళి లార్జర్ దేన్ లైఫ్ పాత్రలను ఆవిష్కరించడంలో ఘనాపాటి. నితీష్ తివారీ ఎమోషనల్ కనెక్ట్ ఇస్తూనే, రియలిస్టిక్ ఎప్రోచ్ తో పాత్రల్ని తీర్చిదిద్దగలరు.
లుక్ పరంగా చూస్తే... మహేష్ బాబుకు ఉన్న `దైవికమైన కటౌట్` ఒక ఎడ్జ్ ఇస్తుంది. కానీ సినిమా పరంగా చూస్తే రణబీర్ కపూర్ `పూర్తిస్థాయి రామాయణం`లో నటిస్తుండటం వల్ల ఆయనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది.
ఫస్ట్ లుక్స్ వచ్చాక అసలైన పోలిక మొదలవుతుంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో కొన్ని ఊహాజనితమైన ఇమేజెస్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ వీటికి భిన్నంగా ఒరిజినల్ ఫస్ట్ లుక్ లు మరింత ఎక్కువగా ఆకర్షిస్తాయని అంచనావేస్తున్నారు.
