Begin typing your search above and press return to search.

దేవుడిగా న‌టించాలంటే? మ‌హేష్-ర‌ణ‌బీర్‌ల‌పై చ‌ర్చ‌లు

సినిమా ప్రపంచంలో శ్రీరాముడి పాత్ర పోషించడం అనేది కేవలం ఒక పాత్ర కాదు.. అదొక సవాలు. నటుల నిజజీవిత అలవాట్లు వారి పాత్రల స్వ‌భావంపై క‌చ్చితంగా ప్రభావం చూపుతాయి.

By:  Sivaji Kontham   |   25 Feb 2026 5:19 AM IST
దేవుడిగా న‌టించాలంటే? మ‌హేష్-ర‌ణ‌బీర్‌ల‌పై చ‌ర్చ‌లు
X

సినిమా ప్రపంచంలో శ్రీరాముడి పాత్ర పోషించడం అనేది కేవలం ఒక పాత్ర కాదు.. అదొక సవాలు. నటుల నిజజీవిత అలవాట్లు వారి పాత్రల స్వ‌భావంపై క‌చ్చితంగా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో ముకేష్ ఖన్నా వంటి సీనియర్ నటులు చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం అభిమానుల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌ను ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర‌ విషయాలు తెలుస్తున్నాయి.

ర‌ణ‌బీర్‌పై శ‌క్తిమాన్ పంచ్‌లు:

రణబీర్ కపూర్‌ను ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ శ్రీరాముడిగా ఎంపిక చేసినప్పుడు ముకేష్ ఖన్నా (శక్తిమాన్) ఘాటుగా స్పందించారు. రాముడిగా నటించే వ్యక్తి ముఖంలో ఆ దైవత్వం ఉండాలి... మాంసాహారం తింటూ, మద్యం సేవించే వారు,.. `యానిమల్` వంటి క్రూరమైన పాత్రలు చేసిన వారు రాముడిగా సరిపోరు`` అని ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో రణబీర్ చేసిన ``బీఫ్ లవర్`` వ్యాఖ్యలు కూడా అత‌డికి శాపంగా మారాయి.

అయితే రణబీర్ తనపై వస్తున్న విమర్శలను గౌరవిస్తూ శ్రీ‌రాముడి పాత్ర కోసం సంపూర్ణంగా మారిపోయారు. ఆయన మద్యం, మాంసాహారం, ధూమపానం పూర్తిగా మానేశారు. `రామాయణం` షూటింగ్ పూర్తయ్యే వరకు తాను `సాత్విక జీవనం` గడుపుతానని ఆయన ప్రతిన పూనడం విశేషం.

మహేష్ బాబు `జెంటిల్మన్` ఇమేజ్

మహేష్ బాబు రాముడి పాత్ర అనగానే ఎవరూ విమర్శించకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఆఫ్-స్క్రీన్ ప్రెజెన్స్. మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితం చాలా క్రమశిక్షణతో కూడుకున్నదని పేరుంది. మద్యం, మాంసాహారం వంటి విషయాల్లో ఆయన ఎప్పుడూ బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. శ్రీరాముడికి ఉండాల్సిన ప్రధాన గుణం `శాంతం`. మహేష్ ముఖంలోని తేజస్సు, ఆయన పద్ధతి శ్రీరాముడి పాత్రకు సహజంగానే సరిపోతాయని అభిమానులు నమ్ముతారు. అందుకే ఆయనను రాముడిగా చూడటానికి ద‌క్షిణాదితో పాటు, ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఉత్సాహం చూపుతున్నారు.

ప్రజలు ఎవరిని శ్రీరాముడిగా అంగీకరిస్తారు?

నిజానికి ఈరోజుల్లో ఇది ఒక బిగ్ డిబేట్! అయితే రెండు సినిమాల నేపథ్యాలు వేరు.. రణబీర్ కపూర్ క్లాసిక్ `రామాయణం`లో నటిస్తున్నారు. అంటే మన పురాణాల్లో చదువుకున్న రాముడిని ఆయన ప్రతిబింబించాలి. ఆయన నటన ఎంత బాగున్నా, గత అలవాట్ల వల్ల ప్రజలు ఆయనను నిశితంగా గమనిస్తారు. రణబీర్ తన నటనతో ఆ నెగెటివ్ ఇమేజ్‌ను చెరిపేయాల్సి ఉంటుంది.

రాజమౌళి సినిమాలో మహేష్ పోషిస్తున్నది ఒక లేయ‌ర్డ్ రోల్ మాత్ర‌మే. ఇది పూర్తిగా పౌరాణిక చిత్రం కాదు. ఒక ఆధునిక సాహసికుడు.. రామాయణ స్ఫూర్తితో ఒక మిషన్‌లో పాల్గొనడం చూపిస్తున్నారు. ఇందులో మహేష్ రాముడి గెటప్‌లో కనిపించే ఆ 20-30 నిమిషాలు కేవలం ఒక విజువల్ ట్రీట్ లాంటివి. దీనివల్ల ఆయనపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. పైగా రాజమౌళి మేకింగ్ వల్ల ప్రజలు ఆయనను వెంటనే ఓన్ చేసుకుంటారు.

నిన్న మొన్నటి వరకు మహేష్ లుక్ రాలేదని అనుకున్నాం కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో `వారణాసి` సినిమా నుండి ఒక త్రీడీ త‌ర‌హా పోస్టర్ వైరల్ అవుతోంది. అందులో మహేష్ కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో విల్లు పట్టుకుని కొండపై నిలబడినట్లు కనిపిస్తున్నారు. రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మహేష్‌ను రాముడి గెటప్‌లో చూసి నాకు గూస్‌బంప్స్ వచ్చాయి.. ఆ ఫోటోను నా వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాను! అని చెప్పడంతో రాముడి వేషంపై అంచ‌నాలు పెరిగాయి. ర‌ణ‌బీర్ క‌పూర్ ని శ్రీ‌రాముడిగా చూపించే ఫోటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఇవి కూడా ఎగ్జ‌యిట్ చేస్తున్నాయి.

చివరగా, నటన -అంకితభావం పరంగా రణబీర్ కష్టపడుతున్నా కానీ, సాంప్రదాయక రూపం, క్లీన్ ఇమేజ్ పరంగా మహేష్ బాబుకే ప్రేక్షకుల నుండి ఎక్కువ ఓట్లు పడతాయ‌న‌డంలో సందేహం లేదు. ర‌ణ‌బీర్ భార‌త‌దేశంలోని అత్యుత్త‌మ న‌టుల‌లో ఒక‌డు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. పురాణేతిహాసాల‌కు సంబంధించిన పాత్ర‌లు, దైవ‌త్యం నిండిన పాత్ర‌ల్లో న‌టించాలంటే క్లీన్ ఇమేజ్, మంచి అల‌వాట్లు చాలా ముఖ్యం. ఈ విష‌యంలో విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కూడదు. మ‌హేష్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి పెద్ద స్టార్లు అలాంటి ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తే అభిమానులు ఎప్పుడూ హ‌ర్షిస్తారు. ఒక‌రిని ఎక్కువ చేసి, ఒక‌రిని త‌క్కువ చేసి చూడ‌టానికి కూడా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. నితీష్ రామాయ‌ణం, రాజ‌మౌళి వార‌ణాసి మైథాల‌జీ ట‌చ్ తో ప్ర‌జ‌ల్లో క్యూరియాసిటీని అంత‌కంత‌కు పెంచుతున్నాయి. 2026 దీపావ‌లి (న‌వంబ‌ర్)కి రామాయ‌ణం -1 విడుద‌ల‌వుతుంది. వారణాసి 2027లో విడుద‌ల కానుంది.

కేవ‌లం శ్రీ‌రాముడి పాత్ర ఒక్క‌టే కాదు, దేవుళ్ల‌లో ఇత‌ర ముఖ్యులైన వెంక‌టేశ్వ‌ర స్వామి, అయ్య‌ప్ప స్వామి, న‌ర‌సింహ స్వామి, స‌త్య‌నారాయ‌ణ స్వామి, వినాయ‌కుడు, శివ‌పార్వ‌తులు, ల‌క్ష్మీ దేవి... ఇంకా ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించాలంటే నటుడు లేదా న‌టి క్యారెక్ట‌ర్ ప‌రంగా క్లీన్ ఇమేజ్ ని ప్ర‌జ‌లు చూస్తారు.